హోలీ వేడుకలు ముగ్గురు చిన్నారుల ప్రాణాలు తీశాయి. హృదయవిదారకమైన ఈ ఘటన బీహార్ లో చోటు చేసుకుంది. ఆదివారం అర్థరాత్రి హోలికా దహనం సమయంలో చెలరేగిన మంటల్లో ముగ్గురు చిన్నారులు మృతి చెందారు. 

వివరాల ప్రకారం.. బోధ్‌గయ పోలీస్ స్టేషన్ పరిధిలోని మన్ కోసి గ్రామంలో ఆదివారం రాత్రి హోలికా దహన కార్యక్రమం నిర్వహించారు. దాని చుట్టూ చేరిన స్థానికులు మంటల్లోకి కర్రలు విసురుతుండగా, నలుగురు చిన్నారులకు మంటలు అంటుకున్నాయి. 

వీరిలో ముగ్గురు చిన్నారులు ఘటనా స్థలంలోనే చనిపోయారు. మరొకచిన్నారి తీవ్రంగా గాయాలపాలయ్యింది. ఈ ఘటనతో సరదగా సాగాల్సిన హోలీ విషాదాంతం అయ్యింది. గ్రామంలో విషాద ఛాయలు అలముకున్నాయి. 

మృతులు రోహిత్ కుమార్ (12), నందలాల్ మంఝీ (13), ఉపేంద్ర కుమార్ (12)గా గుర్తించారు. ఈ రోజు ఉదయం మృతులకు వారి కుటుంబీకులు అంత్యక్రియలు నిర్వహించారు. అయితే ముగ్గురు మృతి చెందినా ఘటన మీద పోలీసులకు ఎలాంటి ఫిర్యాదు అందలేదని భోద్ గయా పోలీస్ ఇన్ స్పెక్టర్ మితేష్ కుమార్ తెలిపారు.