న్యూఢిల్లీ:జమ్మూ కాశ్మీర్ రాష్ట్రంలో యాంటీ టెర్రర్ ఆపరేషన్ సిబ్బంది నిర్వహించిన దాడుల్లో ముగ్గురు ఉగ్రవాదులు సోమవారం నాడు మరణించారు. ఈ ఘటనలో హిజ్బుల్ ముజాహిద్దీన్ కమాండర్ సహా ఇద్దరు తీవ్రవాదులు మరణించారు.

హిజ్బుల్ ముజాహిద్దీన్ కమాండర్ మసూద్ అహ్మద్ భట్ తో పాటు మరో ఇద్దరు తీవ్రవాదులు దక్షిణ కాశ్మీర్ లోని కుచుహోర్ లో జరిగిన ఆపరేషన్ లో మరణించారు. ఈ ఎన్ కౌంటర్ తో దోడా జిల్లాలోని జమ్మూ రీజియన్ లో ఉగ్రవాదులు పూర్తిగా తుడిచిపెట్టుకుపోయినట్టైందని పోలీసులు తెలిపారు.

జమ్మూ కాశ్మీర్ పోలీసు, ఆర్మీ అధికారులు సంయుక్తంగా ఈ ఆపరేషన్ పూర్తి చేశారు. ఏకే రైఫిల్ తో పాటు రెండు ఫిస్టల్స్ ను ఉగ్రవాదుల నుండి స్వాధీనం చేసుకొన్నట్టుగా పోలీసులు తెలిపారు.

ఇవాళ ఉదయం కుల్ చోహర్ అనంతనాగ్ పోలీసులు స్థానికంగా ఉన్న ఆర్ ఆర్ యూనిట్ తో కలిసి సోదాలు నిర్వహిస్తున్న సమయంలో లష్కర్ ఏ తోయిబా టెర్రరిస్టులు ఇద్దరు, హిజ్బుల్ ముజాహిద్దీన్ కమాండర్ ఒకరు పోలీసుల కంటబడ్డారు. పోలీసుల కాల్పుల్లో ఈ ముగ్గురు మృతి చెందారు.

మసూద్ ఓ రేప్ కేసులో కూడ నిందితుడు. అతను పోలీసుల నుండి తప్పించుకొని తిరుగుతున్నాడు. కొంతకాలం క్రితం ఆయన హిజ్బుల్ ముజాహిద్దీన్ కమాండర్ గా బాధ్యతలు స్వీకరించినట్టుగా పోలీసులు ప్రకటించారు. 

దక్షిణ కాశ్మీర్ లో 29 మంది విదేశీ ఉగ్రవాదులు పనిచేస్తున్నారని పోలీసులు తెలిపారు. దక్షిన కాశ్మీర్  ప్రాంతంలో టెర్రరిజాన్ని పూర్తిగా తుదముట్టించేందుకు ప్రయత్నిస్తున్నట్టుగా పోలీసులు తెలిపారు.ఉగ్రవాదుల ఏరివేతకు ప్రజలు సహకరిస్తున్నందున తమ పని చాలా సులువుగా మారిందని పోలీసు ఉన్నతాధికారులు ప్రకటించారు.