తమిళనాడులోని విదుర్‌నగర్ జిల్లా  ప్రభుత్వాసుపత్రిలో ల్యాబ్ టెక్నీషియన్ల నిర్లక్ష్యం కారణంగా వైద్యులు ఓ గర్భిణీకి హెచ్‌ఐవీ రక్తం ఎక్కించడం, ఇది తెలిసి డోనర్ ఆత్మహత్య చేసుకోవడం రాష్ట్రంలో సంచలనం కలిగించింది.

ఇది వివాదం చిలికి చిలికి గాలివానగా మారుతూ ప్రభుత్వం మెడకు ఉచ్చులా బిగుసుకుంటోంది. తన కారణంగా గర్బిణితో పాటు ఆమె బిడ్డ జీవితాలు హెచ్ఐవీకి బలికావాల్సి రావడంతో రక్తదానం చేసిన యువకుడు పురుగుల మందు తాగి ఆత్మహత్యకు పాల్పడ్డాడు.

అయితే తమ కుమారుడి మరణంపై అనుమానాలు వ్యక్తం చేశారు. బుధవారం ఆత్మహత్యాయత్నం చేసిన తమ కొడుకు శుక్రవారం వరకు చలాకీగానే ఉన్నాడని, అయితే డాక్టర్లు వచ్చి ఏదో సూదిమందు ఇచ్చిన తర్వాతనే బిడ్డ ఆరోగ్యం క్షీణించిందని వారు ఆరోపిస్తున్నారు.  

అతని మృతి వెనుక కారణాలను వెలికితీయాలని కోరుతూ మృతుడి తల్లిదండ్రులు మద్రాస్ హైకోర్టులో పిటిషన్‌ వేశారు. దీనిని విచారణకు స్వీకరించిన న్యాయస్థానం, ఇద్దరు ఫోరెన్సిక్ నిపుణుల సమక్షంలో మృతదేహానికి పోస్ట్‌మార్టం నిర్వహించి వీడియో తీయాలని రాజాజీ ప్రభుత్వాసుపత్రిని ఆదేశించింది.

అయితే హెచ్ఐవీ సోకిన శరీరానికి 72 గంటలలోపు పోస్ట్‌మార్టం చేయడం కుదరదని, అలా చేయడం వల్ల వైద్యులకు ఇన్‌ఫెక్షన్ సోకే ప్రమాదముందని ఆస్పత్రి డీన్ న్యాయస్థానికి తెలిపారు. అన్ని జాగ్రత్తలు తీసుకుని, నిబంధనల ప్రకారం పోస్ట్ మార్టం చేయాలని మద్రాస్ హైకోర్టు వైద్యులను కోరింది.

డిసెంబర్ 6న ప్రసవ వేదనతో విరుద్ నగర్ జిల్లా ప్రభుత్వాసుపత్రిలో చేరిన గర్భిణీకి అక్కడి వైద్యులు బ్లడ్ బ్యాంక్ నుంచి తీసుకొచ్చిన రక్తాన్ని ఎక్కించారు. అయితే ఉద్యోగం కోసం విదేశాలకు వెళుతున్న ఓ యువకుడు.. ఓ ప్రైవేట్ ల్యాబ్‌లో రక్త పరీక్ష చేయించుకోగా హెచ్ఐవీ పాజిటివ్ అని తేలింది.

వెంటనే తాను రక్తాన్ని దానం చేసిన బ్లడ్‌ బ్యాంకుకు సమాచారం ఇచ్చే లోపు.. అప్పటికే ఆ రక్తాన్ని గర్భిణీకి ఎక్కించారు. ఈ విషయం ఆలస్యంగా వెలుగులోకి రావడంతో ప్రభుత్వం రంగంలోకి దిగింది. దీనికి కారణమైన ముగ్గురు ల్యాబ్ టెక్నీషియన్లను ఉద్యోగాల్లోంచి తీసేసింది. బాధిత గర్భిణీకి లేదా అతని భర్తకు ప్రభుత్వోద్యోగంతో పాటు నష్టపరిహారం చెల్లిస్తామని హామీ ఇచ్చింది.