తమ మైనర్‌ కూతురిపై అదే గ్రామంలోని ఓ యువకుడు అత్యాచారం చేశాడంటూ పంచాయితీని ఆశ్రయించారు తల్లిదండ్రులు

ఓ వ్యక్తి బాలిక పై అత్యాచారానికి పాల్పడ్డాడు. అయితే.. ఆ అత్యాచారానికి శిక్షగా నిందితుడికి ఐదు చెప్పలు దెబ్బలు కొట్టించాలంటూ తీర్పు ఇచ్చారు. ఈ సంఘటన ఉత్తరప్రదేశ్ రాష్ట్రం మహారాజ్ గంజ్ జిల్లాలో చోటుచేసుకోగా... ఈ ఘటనకు సంబంధించిన పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి.

మహారాజ్‌గంజ్‌ జిల్లాలోని కోతిభార్‌ పోలీస్‌ స్టేషన్‌ సమీపంలోని ఓ కుగ్రామంలో మైనర్ బాలికపై యువకుడు అత్యాచారానికి పాల్పడ్డాడు. కాగా... తమ మైనర్‌ కూతురిపై అదే గ్రామంలోని ఓ యువకుడు అత్యాచారం చేశాడంటూ పంచాయితీని ఆశ్రయించారు తల్లిదండ్రులు. అయితే పెద్దలు మాత్రం దాష్టీకమైన తీర్పు ఇచ్చారు. బాధితురాలి చెప్పుతో నిందితుడిని ఐదుసార్లు కొట్టాలని, యాభై వేల పరిహారం తీసుకుని ఘటన మరిచిపోమ్మని బాలిక తల్లిదండ్రులకు సర్దిచెప్పబోయారు. 

అయితే ఆ తల్లిదండ్రులు అందుకు ఒప్పుకోలేదు. న్యాయం కోసం పట్టుబట్టారు. దీంతో పెద్దలు వాళ్లపై ఆగ్రహం వ్యక్తం చేశారు. చేసేది లేక కోతిభార్‌ స్టేషన్‌లో ఘటనపై.. పంచాయితీ పెద్దల తీరుపై ఫిర్యాదు చేసింది బాధితురాలి తల్లి. మరోవైపు సోషల్‌ మీడియాలో పంచాయితీ తీర్పు వైరల్‌ అయ్యింది. దీంతో రంగంలోకి దిగిన పోలీసులు పోక్సో చట్టం కింద నిందితుడిపై ఎఫ్‌ఐఆర్‌ నమోదు చేశారు. బాలిక వైద్య పరీక్షల నివేదిక అనంతరం.. కేసు దిశగా అడుగు వేస్తామని జిల్లా ఎస్పీ ప్రదీప్‌ గుప్తా వెల్లడించారు. బాధితురాలికి న్యాయం జరిగేలా చూస్తామని ఆయన హామీ ఇచ్చారు.