Dakota DC-3 aircraft : పాక్ తో జరిగిన యుద్ధంలో కీలక పాత్ర పోషించిన డకోటా ఫైటర్ జెట్.. మళ్లీ ఎగిరింది.. !
Dakota DC-3 aircraft: పాకిస్థాన్ తో 1947-48 యుద్ధం, 1971 బంగ్లాదేశ్ విమోచన యుద్ధంలో కీలక పాత్ర పోషించిన డకోటా ఫైటర్ జెట్ మళ్లీ ఎగిరింది. పాతకాలం నాటి ఆ ఫైటర్ జెట్ చారిత్రాత్మకంగా ఎంతో ప్రత్యేకత కలిగి ఉంది. 2011లో మంత్రి రాజీవ్ చంద్రశేఖర్ ఈ విమానాన్ని కొనుగోలు చేసి పునరుద్ధరించి భారత వైమానిక దళానికి బహుమతిగా అందించారు. ఈ ఫైటర్ జెట్ ఇప్పుడు ప్రయాగ్ రాజ్ లో జరిగిన 91వ ఐఏఎఫ్ డే యానివర్సరీ ఫ్లైపాస్ట్ లో మరోసారి ఆకాశంలోకి దూసుకెళ్లింది.

Historic Dakota DC-3 ‘Parashurama’ Takes to the Skies: డకోటా డీసీ-3వీపీ-905 ఫైటర్ జెట్ కు భారత చరిత్రలో ఎంతో ప్రాముఖ్యత ఉంది. దేశవిభజన తర్వాత కశ్మీర్ ను స్వాధీనం చేసుకునేందుకు పాక్ ప్రయత్నించింది. అయితే, డకోటా ఫైటర్ జెట్ కాశ్మీర్ ను కాపాడింది. 1971 బంగ్లాదేశ్ విమోచన యుద్ధంలో డకోటా కీలక పాత్ర పోషించింది. ఇప్పుడు భారతదేశపు పురాతన విమానం మళ్లీ ఎగిరింది. ప్రయాగ్ రాజ్ లో జరిగిన భారత వైమానిక దళం ఫ్లైఫాస్ట్ వార్షికోత్సవ వేడుకల్లో చారిత్రాత్మక డకోటా డీసీ3 వీపీ 905 నింగిలోకి దూసుకెళ్లింది. వింగ్ కమాండర్ డి. ధన్కర్, ఆయన బృందం నేతృత్వంలో డకోటా ప్రయాగ్ రాజ్ ఆకాశంలో ఎగిరింది.
వివరాల్లోకెళ్తే.. ప్రయాగ్ రాజ్ లో జరిగిన 91వ ఇండియన్ ఎయిర్ ఫోర్స్ డే వార్షికోత్సవ ఫ్లైపాస్ట్ లో ఐకానిక్ డకోటా డీసీ-3 వీపీ 905 ఫైటర్ జెట్ ను ప్రదర్శించారు. దీనిని 2018 లో పునరుద్ధరించారు. ఈ అద్భుతమైన విమానాన్ని కేంద్ర నైపుణ్యాభివృద్ధి, ఎంటర్ ప్రెన్యూర్ షిప్, ఎలక్ట్రానిక్స్ అండ్ ఐటీ శాఖ సహాయ మంత్రి రాజీవ్ చంద్రశేఖర్ భారత వైమానిక దళానికి బహూకరించారు. హిందూ మతంలో విష్ణువు ఆరవ అవతారం పేరు మీద 'పరశురామ' అని పిలువబడే డకోటా డీసీ-3ని హిందాన్ ఎయిర్ ఫోర్స్ స్టేషన్ లోని ఐఎఎఫ్ వింటేజ్ స్క్వాడ్రన్ లోకి అధికారికంగా ఆహ్వానించారు. దీని విలక్షణమైన తోకపై వీపీ 905తో గుర్తించారు. 1947/48లో జమ్ముకశ్మీర్ పై నియంత్రణ సాధించేందుకు పాకిస్థాన్ చేసిన ప్రయత్నాలతో ముడిపడిన సంఘటనల సందర్భంగా డకోటా ఎయిర్ క్రాఫ్ట్ కు భారత చరిత్రలో గణనీయమైన పాత్ర ఉన్నందున ఈ విమానానికి ప్రత్యేక హోదా ఉందని మంత్రి రాజీవ్ చంద్రశేఖర్ తెలిపారు.
రాజీవ్ చంద్రశేఖర్ తండ్రి ఎయిర్ కమోడోర్ (రిటైర్డ్) ఎంకే చంద్రశేఖర్ ఐఏఎఫ్ లో డకోటా పైలట్. ఈ డకోటా డీసీ-3 భారత వైమానిక దళ చరిత్రలో ఒక ప్రత్యేకమైన విమానం. దీన్ని కొనుగోలు చేసి యూకేలో పునరుద్ధరించారు. డకోటా ఫ్లీట్ సర్వీస్ నుండి రిటైర్ అయినప్పుడు, ఈ విమానాలలో చివరిది 2010 నాటికి స్క్రాప్ గా విక్రయించబడింది. చరిత్రను పరిరక్షించే ప్రయత్నంలో 2011లో మంత్రి రాజీవ్ చంద్రశేఖర్ ఐర్లాండ్ లో అమ్మకానికి ఉన్న డకోటాను కొనుగోలు చేయడానికి ప్రయత్నాలు ప్రారంభించారు. తొలుత తన సొంత ఖర్చుతో డకోటా విమానాన్ని ఐఏఎఫ్ కు బహుమతిగా ఇవ్వాలన్న ఆయన ప్రతిపాదనను అప్పటి రక్షణ మంత్రి ఏకే ఆంటోనీ తిరస్కరించారు. అయితే, ఈ విమానాన్ని పూర్తిగా పునరుద్ధరించే ప్రతిపాదనకు బీజేపీ ప్రభుత్వంలో రక్షణ మంత్రి మనోహర్ పారికర్ ఆమోదం తెలిపారు. "గూనీ బర్డ్" గా పిలువబడే డకోటా డీసీ-3 ఐఎఎఫ్ లో చేరిన మొదటి ప్రధాన రవాణా విమానం. ఇది 1947 కాశ్మీర్ సంఘర్షణ, 1971 బంగ్లాదేశ్ విమోచన యుద్ధంలో కీలక పాత్ర పోషించింది.