హిందువులు మెజార్టీగా ఉండే మన దేశంలో పది రాష్ట్రాల్లో హిందువులు మైనార్టీలుగా ఉన్నారని ఓ పిటిషనర్ సుప్రీంకోర్టును ఆశ్రయించాడు. ఆ రాష్ట్రాల్లో హిందువులను మైనార్టీలుగా గుర్తించడం లేదని వాదించారు. వారిని మైనార్టీలుగా గుర్తిస్తే.. అక్కడి వారు మైనార్టీలకు ఉండే ప్రత్యేక హక్కులను పొందగలుగుతారని వివరించారు. ఈ పిటిషన్‌లోనే రాష్ట్రాలు మైనార్టీలను గుర్తించడానికి మార్గదర్శకాలను విడుదల చేయాలని డిమాండ్ చేశారు.
న్యూఢిల్లీ: భారత్‌లో హిందువులు మెజార్టీ ప్రజలు. కానీ, పది రాష్ట్రాల్లో వారు మైనార్టీలుగా ఉన్నారని సుప్రీంకోర్టులో ఓ పిటిషనర్ వాదించారు. 2011 జనాభా లెక్కల ప్రకారం, లక్షద్వీప్, మిజోరం, నాగాల్యాండ్, మేఘాలయ, జమ్ము కశ్మీర్, అరుణాచల్ ప్రదేశ్, మణిపూర్, పంజాబ్‌లలో హిందువులు మైనార్టీలు అని 2020లో అడ్వకేట్ అశ్విని ఉపాధ్యాయ్ సుప్రీంకోర్టులో పిటిషన్‌లో వేశారు. ఈ రాష్ట్రాల్లో మైనార్టీలుగా ఉన్న హిందువులు.. నిజంగా మైనార్టీలకు ఉండే హక్కులను పొందడం లేదని వాదించారు. వారికి మైనార్టీ హోదా ఇచ్చి
2002 టీఎంఏ పై ఫౌండేషన్‌పై సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పునకు లోబడి వారికి హక్కులు కట్టబెట్టాలని పేర్కొన్నారు. ఈ తీర్పు ప్రకారం, ఆర్టికల్ 30 అనుసరించి మైనార్టీలు ప్రత్యేక విద్యా సంస్థలను వ్యవస్థాపించుకోవచ్చు, వాటిని నడిపించుకోవచ్చు. వీటితోపాటు పలు హక్కులు ప్రత్యేకంగా మైనార్టీలకు ఉంటాయి. ఈ హక్కులను ఆ రాష్ట్రాల్లో హిందువులకు కల్పించాలని డిమాండ్ చేశారు. అయితే, ఆ పది రాష్ట్రాల్లో హిందువులను మైనార్టీలుగా గుర్తించలేదని పేర్కొన్నారు. రాష్ట్ర స్థాయిలో మైనార్టీలను గుర్తించడం, వారికి మైనార్టీ హోదా ఇవ్వడానికి మార్గదర్శకాల రూపకల్పన చేపట్టడానికి కేంద్ర ప్రభుత్వాన్ని సుప్రీంకోర్టు ఆదేశించాలని కోరారు. ఈ పిటిషన్‌పై ఈ రోజు సుప్రీంకోర్టులో విచారణ జరగనుంది.
ఈ పిటిషన్‌పై సోమవారం కేంద్ర ప్రభుత్వం స్పందించింది. మైనార్టీలను నోటిఫై చేసే అధికారం కేంద్ర ప్రభుత్వం దగ్గరే ఉన్నదని, అయితే, రాష్ట్ర ప్రభుత్వాలు, సంబంధితులతో సంప్రదింపులు జరిపిన తర్వాతే నిర్ణయం తీసుకుంటామని వివరించింది. అయితే, అదే సందర్భంలో మరో విషయాన్ని కూడా పేర్కొంది. కమ్యూనిటీలను మైనార్టీలుగా డిక్లేర్ చేసే అధికారం రాష్ట్రాలకు కూడా ఉన్నదని కేంద్ర ప్రభుత్వం తన అఫిడవిట్‌లో వివరించింది. మతపరంగా లేదా భాషాపరంగా ఒక కమ్యూనిటీని ఆ రాష్ట్రం వరకు మైనార్టీ కమ్యూనిటీగా గుర్తించవచ్చని
తెలిపింది. వీటికి కొన్ని ఉదాహరణలను తెలిపింది. మహారాష్ట్ర 2016లో యూదులను మైనార్టీలుగా గుర్తించిందని వివరించింది. అంతేకాదు, ఉర్దూ, తెలుగు, తమిళం, మలయాళం, మరాఠి, తులు, లమానీ, హిందీ, కొంకణి, గుజరాతి భాష మాట్లాడే ప్రజలను మైనార్టీలుగా కర్ణాటక ప్రభుత్వం గుర్తించిందని పేర్కొంది.
కాబట్టి, ఆయా రాష్ట్రాల్లో మైనార్టీలుగా ఉన్నవారు అక్కడి రాష్ట్ర ప్రభుత్వాలతో మైనార్టీ హోదాను కల్పించుకుని వారికి అనుకూలమైన విద్యా సంస్థలను నెలకొల్పుకోవచ్చని కేంద్రం తన అఫిడవిట్‌లో వివరించింది. అంతేకానీ, దేశవ్యాప్తంగా ఒకే మతం, భాషా పరంగా మైనార్టీలను సూటిగా గుర్తించడం సరికాదని తెలిపింది. ఎందుకంటే మన దేశ భిన్నమైనదని, ఒక రాష్ట్రంలో మైనార్టీగా ఉన్నవారు మరో రాష్ట్రంలో మెజార్టీగానూ ఉండవచ్చని వివరించింది.
ఉపాధ్యాయ్ తన పిటిషన్‌లో నేషనల్ కమిషన్ ఫర్ మైనార్టీ ఎడ్యుకేషన్ ఇన్‌స్టిట్యూషన్ యాక్ట్ 2004లోని సెక్షన్ 2(ఎఫ్) ప్రస్తావన కూడా తెచ్చారు. ఈ చట్టం కేంద్ర ప్రభుత్వానికి అనూహ్య అధికారాన్ని కట్టబెడుతున్నదని, ఇది సరికాదని వివరించారు. నేషనల్ కమిషన్ ఫర్ మైనార్టీస్ యాక్ట్ 1992 సెక్షన్ 2 కింద కేంద్ర ప్రభుత్వం ఆరు కమ్యూనిటీలను మైనార్టీలుగా గుర్తించిందని కేంద్ర మైనార్టీ వ్యవహారాల మంత్రిత్వ శాఖ వెల్లడించింది.
ముస్లిం, క్రిస్టియన్లు, సిక్కులు, బౌద్ధవులు, పార్సీలను మైనార్టీలుగా కేంద్రం గుర్తించడాన్ని సవాల్ చేస్తూ పలు హైకోర్టులో పిటిషన్లు దాఖలయ్యాయి. ఈ పిటిషన్లు అన్నింటినీ సుప్రీంకోర్టుకు బదిలీ చేయాలని గతంలోనే ఆదేశాలు జారీ చేసింది.
