జ్ఞానవాపి కేసు నుంచి హిందూ పిటిషనర్ ఉపసంహరణ.. ‘హిందువులూ వేధిస్తున్నారు’
జ్ఞానవాపి కేసులో హిందు వైపున ఉన్న ఓ ముఖ్యమైన లిటిగెంట్ జితేంద్ర సింగ్ విసెన్ ఈ కేసుల నుంచి తప్పుకుంటున్నట్టు ప్రకటించారు. తనకు అన్ని వైపుల నుంచి వేధింపులు వస్తున్నాయని, హిందువుల నుంచీ వేధింపులు వస్తున్నాయని తెలిపారు.
వారణాసి: జ్ఞానవాపి కేసులో ముఖ్యమైన లిటిగెంట్‌లలో హిందువుల వైపున ఉన్న జితేంద్ర సింగ్ విసెన్ అన్ని కేసుల నుంచి వెనక్కి తగ్గుతున్నట్టు తెలిపారు. వేధింపుల కారణంగానే తాను ఈ నిర్ణయం తీసుకున్నట్టు వివరించారు. జితేంద్ర సింగ్ విసెన్ తరఫున వాదిస్తున్న న్యాయవాది శివమ్ గౌర్ కూడా ముందుగానే ఈ కేసు నుంచి ఉపసంహరించుకున్నట్టు వెల్లడించడం గమనార్హం.
‘నేను నా కుటుంబం (భార్య కిరణ్ సింగ్, నీస్ రాఖి సింగ్) జ్ఞానవాపి కేసునకు సంబంధించిన అన్నింటిలో నుంచి ఉపసంహరించుకుంటున్నాం. దేశ, మత ప్రయోజనాలను ఆకాంక్షించి పలు కోర్టులో తాము పిటిషన్లు వేశాం’ అని విశ్వ వేదిక్ సనాతన్ సంఘ్ చీఫ్ తన ప్రకటనలో శనివారం వెల్లడించారు.
తాము హిందు సహా పలు వర్గాల నుంచి వేధింపులు ఎదుర్కొంటున్నామని చెప్పారు. ఇది అవమానకరంగా భావిస్తున్నామని పేర్కొన్నారు. ఇలాంటి పరిస్థితుల్లో పరిమితమైన శక్తి, వనరులను దృష్టిలో పెట్టుకుని ఈ ధర్మ యుద్ధాన్ని ఇంకెంత మాత్రం కొనసాగించలేనని, అందుకే ఈ యుద్ధం నుంచి తప్పుకుంటున్నట్టు చెప్పారు.
ఈ ధర్మయుద్ధాన్ని ప్రారంభించడమే జీవితంలో తాను చేసిన అతి పెద్ద తప్పు అని విసెన్ తెలిపారు. మతం పేరు చెప్పి గిమ్మిక్‌లు వేసే వారిని ఈ సమాజం నమ్ముతుందని ఆవేదన చెందారు.
Also Read: ఒడిశా రైలు ప్రమాదానికి మతం రంగు పులమొద్దు: పోలీసుల వార్నింగ్
జ్ఞానవాపి మసీదు కాంపౌండ్‌లో దేవత శ్రింగార్ గౌరీని రోజూ పూజించడానికి తమకు అనుమతి ఇవ్వాలని 2021 ఆగస్టులో ఐదుగురు కలిసి పిటిషన్ వేశారు. ఇందులో మిగిలిన మహిళలతో రాఖి వేరు దారి ఎంచుకున్నారు. విసెన్‌కు, ఇతర పిటిషనర్ల లాయర్‌కు మధ్య అభిప్రాయ బేధాలు తటస్థించాయి.