విద్యార్ధులకు ఎవరైనా పుస్తకాలు ఇస్తారు లేదంటే చదువుకోవడానికి ఆర్ధిక సాయాలు చేస్తారు. అలాంటిది ఆగ్రాలో కొందరు పిల్లలకు కత్తులు పంపిణీ చేశారు. వివరాల్లోకి వెళితే.. స్వాతంత్ర్య సమరయోధుడు, హిందూ మహాసభ దిగ్గజ నాయకుడు వీర్ సావర్కర్ జయంతుత్సావాలు మంగళవారం దేశవ్యాప్తంగా జరిగాయి.

ఈ సందర్భంగా ఆగ్రాలో జరిగిన ఓ కార్యక్రమంలో హిందూ మహా సభ నాయకులు 10, 12 తరగతుల విద్యార్ధులకు కత్తుల్ని పంపిణీ చేశారు.

దీనిపై వారు మాట్లాడుతూ.. హిందూ సమాజం సాధికారత సాధించేందుకు..ముఖ్యంగా యువత ఆత్మరక్షణ, దేశ రక్షణకు జాగరూకులై ఉండేందుకు కత్తులను పంపిణీ చేస్తున్నామని హిందూ మహా సభ జాతీయ కార్యదర్శి శకున్ తెలిపారు.

మహిళలపై రోజురోజుకు అఘాయిత్యాలు పెచ్చు మీరుతున్నాయని... ఆత్మ రక్షణ కోసం యువతులకు ఆయుధ శిక్షణ అవసరమని పేర్కొన్నారు. రాజకీయాల్లో హిందూకీకరణ.. హిందువుల్లో సైనికీకరణ... అనేది సావర్కర్ నినాదమని.. మోడీ ప్రధానిగా ఎన్నికై సావర్కర్ కలను నెరవేర్చారు.

ఇక రెండోది.. దేశ రక్షణ కోసం ప్రతి హిందువు సైనికుడిగా మారాలి.. అందుకోసమే యువతకు కత్తులను అందిస్తున్నామని హిందూ మహాసభ అధికార ప్రతినిధి అశోక్ పాండే తెలిపారు.

కాగా, సావర్కర్ జయంతి సందర్భంగా ప్రధాని నరేంద్రమోడీ ఆయనకు నివాళులర్పించారు. ప్రజల్లో దేశభక్తిని రగిల్చి ఎందరికో ధీరోదాత్తమైన స్ఫూర్తిని అందించిన సావర్కర్ కృషి మరువలేనిదన్నారు. జాతి నిర్మాణం కోసం పనిచేసిన ఆయన సదాస్మరణీయుడని ప్రధాని ట్వీట్ చేశారు.