మరే ఇతర భారతీయ భాషతోనూ హిందీ పోటీ పడలేదు - కేంద్ర హోం మంత్రి అమిత్ షా
అన్ని భాషలను ఏకం చేయడం ద్వారానే బలమైన దేశం ఏర్పడుతుందని కేంద్ర హోం మంత్రి అమిత్ షా అన్నారు. అన్ని స్థానిక భాషల సాధికారతకు హిందీ ఒక మాధ్యమంగా మారుతుందని చెప్పారు. హిందీ దివాస్ సందర్భంగా ఆయన విడుదల చేసిన ఓ వీడియో సందేశంలో ఈ వ్యాఖ్యలు చేశారు.

ప్రపంచంలోని అతి ప్రజాస్వామ్య దేశంలో ఉన్న భిన్న భాషల్లో ఉన్న వైవిద్యాన్ని హిందీ ఏకం చేస్తుందని కేంద్ర హోం మంత్రి అమిత్ షా అన్నారు. హిందీ మరే ఇతర భారతీయ భాషతోనూ పోటీ పడలేదని చెప్పారు. గురువారం హిందీ దివస్ సందర్భంగా ఆయన ఓ వీడియో సందేశాన్ని విడుదల చేశారు.
ఈ సందర్భంగా అందులో ప్రముఖ సాహితీవేత్త భరతుడు హరిశ్చంద్ర రాసిన 'నిజ్ భాషా ఉన్నతి అహే, సబ్ ఉన్నతి కో మూల్' అనే ప్రసిద్ధ కవితను ప్రస్తావిస్తూ.. ఏ దేశానికైనా అసలైన, సృజనాత్మక వ్యక్తీకరణలు దాని సొంత భాష ద్వారానే సాధ్యమని అన్నారు. మన భారతీయ భాషలు, మాండలికాలన్నీ మన సాంస్కృతిక వారసత్వమేనని, వాటిని మనతో పాటు తీసుకెళ్లాలని అన్నారు. ‘‘హిందీ ఎప్పుడూ పోటీ పడలేదు. మరే ఇతర భారతీయ భాషతో పోటీ పడదు. అన్ని భాషలను బలోపేతం చేయడం ద్వారానే బలమైన దేశం ఏర్పడుతుంది. అన్ని స్థానిక భాషల సాధికారతకు హిందీ ఒక మాధ్యమంగా మారుతుంది’’ అని అమిత్ షా అన్నారు.
భారతదేశం విభిన్న భాషల దేశమని అమిత్ షా తన సందేశంలో పేర్కొన్నారు. ప్రపంచంలోనే అతి పెద్ద ప్రజాస్వామ్య దేశంలో భాషల వైవిధ్యాన్ని హిందీ ఏకం చేస్తుందని తెలిపారు. ‘ఇది ప్రజాస్వామ్య భాష. వివిధ భారతీయ భాషలు, మాండలికాలతో పాటు అనేక ప్రపంచ భాషలను గౌరవించి, వాటి పదజాలం, వాక్యాలు, వ్యాకరణ నియమాలను స్వీకరించింది. స్వాతంత్ర ఉద్యమ క్లిష్ట రోజుల్లో దేశాన్ని ఏకం చేయడంలో హిందీ అపూర్వ పాత్ర పోషించింది.’’ అని చెప్పారు.
అనేక భాషలు, మాండలికాలుగా విడిపోయిన దేశంలో ఐక్యతా భావాన్ని హిందీ కలిగించిందని కేంద్ర హోం మంత్రి అమిత్ షా అన్నారు. దేశంలో తూర్పు నుంచి పడమరకు, ఉత్తరం నుంచి దక్షిణానికి స్వాతంత్య్ర పోరాటాన్ని ముందుకు తీసుకెళ్లడంలో కమ్యూనికేషన్ భాషగా హిందీ కీలక పాత్ర పోషించిందన్నాదని గుర్తు చేశారు.
అధికార భాషపై పార్లమెంటరీ స్టాండింగ్ కమిటీ ఇటీవల తన 12వ వాల్యూమ్ నివేదికను రాష్ట్రపతికి సమర్పించిందని అమిత్ షా అన్నారు. 2014 వరకు కేవలం 9 వాల్యూమ్స్ మాత్రమే నివేదికను సమర్పించామని, గత నాలుగేళ్లలో మూడు వాల్యూమ్ లను సమర్పించామని తెలిపారు. 2019 నుంచి మొత్తం 59 మంత్రిత్వ శాఖల్లో హిందీ అడ్వైజరీ కమిటీలను ఏర్పాటు చేశామని, వాటి సమావేశాలను కూడా క్రమం తప్పకుండా నిర్వహిస్తున్నామని తెలిపారు.