Himanta Biswa Sarma: ముస్లిం పురుషుడు ముగ్గురు స్త్రీలను పెళ్లి చేసుకోకూడదని, తలాక్ ఇవ్వకండి, చట్టబద్ధంగా విడాకులు ఇవ్వండని అస్సాం ముఖ్యమంత్రి హిమంత బిశ్వ సలహా ఇచ్చారు. కొడుకుల మాదిరిగా కుమార్తెలకు కూడా ఆస్తిలో సమాన వాటా ఇవ్వాలనీ, ఆస్తిలో 50 శాతం వాటా భార్యకు ఇవ్వాలని, ప్రభుత్వం, సామాన్య ముస్లింల అభిప్రాయాలు ఒకేలా ఉన్నాయని సిఎం శర్మ అన్నారు.
Himanta Biswa Sarma: ఏదోక సంచలన వ్యాఖ్యలు చేస్తూ నిత్యం వార్తల్లో నిలిచే అస్సాం ముఖ్యమంత్రి హిమంత బిశ్వ శర్మ గురువారం మరోసారి సంచలన వ్యాఖ్యలు చేశారు. ముస్లిం వివాహాల గురించి, భార్యకు ఆస్తిలో సమాన వాటా ఇవ్వడం గురించి ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు.
అస్సాం ముఖ్యమంత్రి హిమంత బిశ్వ శర్మ బుధవారం విలేకరుల సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా విడాకులు, ముస్లిం వివాహాల గురించి మాట్లాడాడు. భార్యకు ఆస్తిలో సమాన వాటా ఇవ్వడాన్ని సమర్ధించాడు. ముస్లిం పురుషుడు మూడు వివాహాలకు బదులుగా ఒక స్త్రీని వివాహం చేసుకోవాలని కోరాడు.
అదే సమయంలో.. విడిపోయాలనుకుంటే.. తలక్ ద్వారా విడాకులు ఇవ్వకుండా.. లీగల్ గా విడాకులు ఇవ్వాలని సీఎం మాట్లాడారు. ముస్లిం పురుషుడు ముగ్గురు మహిళలను పెళ్లి చేసుకోకూడదని అన్నారు. కొడుకుల మాదిరిగానే ఆడపిల్లలకు ఆస్తిలో సమాన వాటా ఇవ్వాలి. ఆస్తిలో 50 శాతం భార్యకు ఇవ్వాలని సూచించారు.
అదే సమయంలో ఈశాన్య రాష్ట్రాల విద్యార్థులపై ఇప్పుడు వివక్ష గణనీయంగా తగ్గిందని, గత కొన్నేళ్లుగా ఈ ప్రాంతంలో చాలా పురోగతి సాధించామని చెప్పారు. దీని వల్ల విద్యార్థుల పట్ల ఇలాంటి వివక్ష చాలా వరకు తగ్గిందని అన్నారు.
గత 2-3 ఏళ్లుగా చూస్తే.. ఇప్పుడు ఈశాన్య రాష్ట్రాల్లో ప్రధాని మోదీ విస్తృతంగా పర్యటించడం, ఈ ప్రాంత అభివృద్ధిపై ప్రధాని మోడీ ప్రత్యేక దృష్టి పెట్టడం వల్ల.. ఈశాన్య రాష్ట్రాల విద్యార్థులపై జాతి వివక్ష హఠాత్తుగా తగ్గిపోయిందని శర్మ అన్నారు. భారత్‌ను బలమైన ప్రపంచ శక్తిగా ప్రధాని మోదీ నిలబెట్టారని సీఎం అన్నారు.
ప్రధాని మోడీ మార్గదర్శకత్వంలో గత 8 సంవత్సరాల్లో గణనీయమైన అభివృద్ధి జరిగిందనీ, అస్సాం ప్రజల తరపున ఈశాన్య రాష్ట్రాల సామర్థ్యాన్ని అన్‌లాక్ చేయాలనుకుంటున్నాననీ, భారతదేశ వృద్ధికి ఈ రాష్ట్రాలను ఇంజన్ గా మార్చాలనుకుంటున్నాననీ, ప్రధాని మోడీకి కృతజ్ఞతలు తెలియజేశారు.
కేంద్రంలో బీజేపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చి ఎనిమిదేళ్లు పూర్తి చేసుకున్న సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడుతూ.. కాంగ్రెస్ పై విరుచుకుపడ్డారు. వచ్చే పార్లమెంటరీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ ప్రధాన ప్రతిపక్ష హోదాను నిలుపుకోవడం కూడా కష్టమనీ. తన అంచనా ప్రకారం 2024లో కాంగ్రెస్ కేవలం 30-35 సీట్లే గెలుచుకోవచ్చునని శర్మ అభిప్రాయపడ్డారు. ప్రస్తుతం ఈశాన్య రాష్ట్రాలలో అభివృద్ధి కొనసాగుతుందని సీఎం తెలిపారు.
