Asianet News TeluguAsianet News Telugu

హిమాచల్‌లో కాంగ్రెస్ విజయం.. ప్రభుత్వ ఏర్పాటులో సవాళ్లు.. అక్కడికే ఎమ్మెల్యేల తరలింపు..?

హిమాచల్ ప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ విజయం సాధించింది. హిమాచల్ ప్రదేశ్‌లో ప్రభుత్వ ఏర్పాటుకు 35 మెజారిటీ మార్క్‌గా ఉంది. దీనిని కాంగ్రెస్ ఇప్పటికే అధిగమించినప్పటికీ.. ప్రభుత్వ ఏర్పాటకు సంబంధించి ఆ పార్టీని కొన్ని టెన్షన్స్ వెంటాడుతున్నాయి.

Himachal Pradesh congress Form govt Bhupesh Baghel says need to protect MLAs
Author
First Published Dec 8, 2022, 3:55 PM IST

హిమాచల్ ప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ విజయం సాధించింది. ఇప్పటివరకు వెలువడిన ఫలితాల ప్రకారం.. కాంగ్రెస్ 36 స్థానాల్లో విజయం సాధించగా, మరో 3 స్థానాల్లో ఆధిక్యంలో కొనసాగుతుంది. బీజేపీ 22 స్థానాల్లో విజయం సాధించగా, మరో 4 స్థానాల్లో ఆధిక్యంలో ఉంది. ఇతరులు మూడు స్థానాల్లో విజయం సాధించారు. అయితే మొత్తం 68 అసెంబ్లీ స్థానాలు ఉన్న హిమాచల్ ప్రదేశ్‌లో ప్రభుత్వ ఏర్పాటుకు 35 మెజారిటీ మార్క్‌గా ఉంది. దీనిని కాంగ్రెస్ ఇప్పటికే అధిగమించినప్పటికీ.. ప్రభుత్వ ఏర్పాటకు సంబంధించి ఆ పార్టీని కొన్ని టెన్షన్స్ వెంటాడుతున్నాయి. మెజారిటీ స్వల్పంగానే ఉండటం, గతంలో కొన్ని రాష్ట్రాల్లో చోటుచేసుకున్న  పరిణామాలను దృష్టిలో ఉంచుకుని కాంగ్రెస్ అధిష్టానం ఆచితూచి అడుగులు వేస్తోంది. 

ఇప్పటికే హిమాచల్ ప్రదేశ్‌లో కాంగ్రెస్ ఎమ్మెల్యేలను కాపాడాల్సిన బాధ్యతలను ఛత్తీస్‌గఢ్ సీఎం భూపేష్ బఘెల్, సీనియర్ నేత భూపిందర్ సింగ్ హుడా‌లకు అప్పగించింది. మరోవైపు ప్రియాంక గాంధీ కూడా ఈ వ్యవహారాలను పరిశీలిస్తున్నట్టుగా తెలుస్తోంది. అయితే ప్రస్తుతం ఎన్నికల్లో గెలుపొందిన కాంగ్రెస్ ఎమ్మెల్యేలను.. ఒకచోటుకు తరలించాలని ఆ పార్టీ భావిస్తోంది. తొలుత రాజస్తాన్‌కు తరలించాలని భావించినప్పటికీ.. అక్కడి తీసుకెళ్లడం దూరం అవుతుందని భావించి రాజధాని సిమ్లాకు గానీ, పక్కనే ఉన్న చండీగఢ్‌ గానీ తరలించాలని ఆ పార్టీ నిర్ణయానికి వచ్చినట్టుగా తెలుస్తోంది. ఇదే విషయంపై హిమాచల్ ప్రదేశ్‌కు ఏఐసీసీ ఇంచార్జ్‌గా ఉన్న రాజీవ్ శుక్లా తెలిపారు. 

Himachal Pradesh congress Form govt Bhupesh Baghel says need to protect MLAs

ట్రెండ్‌ల ప్రకారం హిమాచల్ ప్రదేశ్‌లో తాము ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయబోతున్నామని భూపిందర్ సింగ్ హుడా చెప్పారు. భూపేష్ బఘేల్, రాజీవ్ శుక్లాలతో కలిసి తాను సిమ్లాకు చేరుకుంటానని చెప్పారు. మరోవైపు భూపేష్ బఘేల్ మాట్లాడుతూ.. హిమాచల్‌లో పార్టీ ఎమ్మెల్యేలను కాపాడుకోవాల్సిన అవసరం ఉందని అన్నారు. బీజేపీ ఏ స్థాయికైనా వెళ్లగలదని విమర్శించారు.

అయితే సీఎం అభ్యర్థి ఎంపిక, ఆశావహుల మధ్య సయోధ్య, ఎమ్మెల్యేలను కాపాడుకోవడం అనేది కాంగ్రెస్ అధిష్టానానికి తలనొప్పిగా మారే  అవకాశం ఉంది. ప్రస్తుతం కాంగ్రెస్ సీఎం అభ్యర్థుల రేసులో ప్రతిభా సింగ్, సుఖ్వీందర్ సింగ్ సుఖు, ముఖేష్ అగ్నిహోత్రి, ఠాకూర్ కౌల్ సింగ్, ఆశా కుమారి ఉన్నారు. ఇందులో ఎవరికి ఉండే బలాలు వారికి ఉన్నాయి. అయితే వీరిలో నుంచి ఒకరిని ఎంపిక చేయడం, మిగిలిన వారిని బుజ్జగించడమనేది కాంగ్రెస్ అధిష్టానం ఎలా డీల్ చేస్తుందనేది చూడాల్సి ఉంది. అలాగే విజయం సాధించిన  స్వతంత్రులను కూడా కాంగ్రెస్ సంప్రదింపులు  జరిపే అవకాశం ఉంది. 

మాజీ ముఖ్యమంత్రి వీరభద్ర సింగ్ సతీమణి ప్రతిభా సింగ్ ప్రస్తుతం ఎంపీగా ఉన్నారు. అయితే అసెంబ్లీ ఎన్నికల్లో ఆమె పోటీ చేయలేదు.  వీరభద్ర సింగ్ కుటుంబానికి ప్రాధాన్యత ఇవ్వాలని భావిస్తే.. ఆమెను సీఎం పీఠం దక్కే అవకాశం ఉంది. ఇక, సుఖ్వీందర్ సింగ్ సుఖు.. హిమాచల్ ప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ క్యాపెయినింగ్ కమిటీకి హెడ్‌గా ఉన్నారు. రాహుల్ గాంధీకి సన్నిహితుడిగా పేరుంది. అయితే వీరభద్ర సింగ్‌ కుటుంబానికి సుఖ్వీందర్ సింగ్ సుఖు‌లకు మధ్య సఖ్యత లేదనే ప్రచారం ఉంది. 

ముఖేష్ అగ్నిహోత్రి ప్రస్తుతం హిమాచల్ ప్రదేశ్ అసెంబ్లీలో ప్రతిపక్ష నాయకుడిగా ఉన్నారు. ఆయన వీరభద్ర సింగ్ ప్రభుత్వంలో మంత్రిగా ఉన్నారు. ముఖేష్ అభ్యర్థిత్వాన్ని ప్రతిభా సింగ్ సమర్థించే అవకాశాలు కూడా ఉన్నాయి. మరోవైపు ఠాకూర్ కౌల్ సింగ్ 77 ఏళ్ల ఠాకూర్ కౌల్ సింగ్ హిమాచల్ ప్రదేశ్‌లోని మండిలోని దర్రాంగ్ అసెంబ్లీ స్థానం నుంచి ఎనిమిది సార్లు ఎమ్మెల్యేగా ఎన్నికయ్యారు. వీరభద్ర సింగ్ కుటుంబ విధేయుడు గా ఉన్నారు. అయితే  వయోభారం దృష్ట్యా ఆయనను ఎంపిక చేయడం కష్టమనే మాట వినిపిస్తోంది. ఇక, పంజాబ్ అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ ఇన్‌ఛార్జ్‌గా వ్యవహరించారు. ఆమె కూడా సీఎం రేసులో ఉన్నారు. 

Follow Us:
Download App:
  • android
  • ios