ఇంట్లో ఒక్క ఆడపిల్ల ఉంటే రూ.2 లక్షలు.. హిమాచల్ ప్రదేశ్ సీఎం సంచలన ప్రకటన
ఇంట్లో ఒక ఆడపిల్ల వుంటే రూ.2 లక్షల ప్రోత్సాహకాన్ని అందజేస్తామని హిమాచల్ ప్రదేశ్ సీఎం సుఖ్వీందర్ సింగ్ సుఖు ప్రకటించారు . ఇద్దరు ఆడపిల్లల తర్వాత ఇక సంతానం చాలు అనుకునేవారికి రూ. లక్ష (ప్రస్తుతం ఇది 25,000గా వుంది) ప్రోత్సాహం అందజేస్తామని సీఎం వెల్లడించారు.

హిమాచల్ ప్రదేశ్‌లోని కాంగ్రెస్ ప్రభుత్వం ఆకర్షణీయ పథకాన్ని ప్రవేశపెట్టింది. రాష్ట్రంలో ఆడ శిశువులు, ఆడ బ్రూణహత్యల నిర్మూలనకు తీవ్రంగా కృషి చేస్తున్న ప్రభుత్వం.. తాజాగా ఇంట్లో ఒక ఆడపిల్ల వుంటే రూ.2 లక్షల ప్రోత్సాహకాన్ని అందజేస్తామని రాష్ట్ర ముఖ్యమంత్రి సుఖ్వీందర్ సింగ్ సుఖు ప్రకటించారు. ‘‘ఇందిరా గాంధీ బాలికా సురక్ష యోజన’’ కింద ఇస్తున్న ప్రోత్సాహకాన్ని ప్రస్తుతమున్న రూ.35,000 నుంచి రూ.2 లక్షలకు పెంచుతున్నట్లు సీఎం వెల్లడించారు. సిమ్లాలో జరిగిన ప్రీ కాన్సెప్షన్ అండ్ ప్రీ నేటల్ డయాగ్నోస్టిక్ టెక్నిక్స్ యాక్ట్ 1994పై రెండు రోజుల పాటు జరిగిన వర్క్ షాప్ సందర్భంగా ఈ ప్రకటన చేశారు ముఖ్యమంత్రి.
ఆరోగ్యకర లింగ నిష్పత్తిని కొనసాగించినందుకు గాను చంబా, సిమ్లా, మండి జిల్లాలతో పాటు పలు జిల్లాలకు ఈ సందర్భంగా సీఎం, ఆరోగ్ మంత్రి ధని రామ్ షాండిల్‌లు అవార్డులు అందజేశారు. ఒకే ఒక్క కుమార్తె వున్న తల్లిదండ్రులకు రూ.2 లక్షలు, ఇద్దరు ఆడపిల్లల తర్వాత ఇక సంతానం చాలు అనుకునేవారికి రూ. లక్ష (ప్రస్తుతం ఇది 25,000గా వుంది) ప్రోత్సాహం అందజేస్తామని సీఎం వెల్లడించారు. హిమాచల్ ప్రదేశ్‌లో లింగ నిష్పత్తి మెరుగుపడిందని.. ఆడపిల్లల భ్రూణహత్యలను అరికట్టడంలో ప్రభుత్వం సఫలమైందని సుఖ్వీందర్ అన్నారు.