Karnataka hijab row: హిజాబ్ వివాదానికి సంబంధించి దాఖలైన పటిషన్లను విచారించిన కర్నాటక హైకోర్టు మంగళవారం నాడు తన తీర్పును వెల్లడించింది. అయితే, హైకోర్టు తీర్పుపై అసంతృప్తితో కర్నాటకలోని ఓ కాలేజీలో విద్యార్థులు పరీక్షలను బహిష్కరించారు.
Karnataka hijab row: కర్నాటక హైకోర్టు హిజాబ్ కేసులో మంగళవారం నాడు తన తీర్పును ప్రకటించింది. విద్యా సంస్థల్లో హిజాబ్ నిషేధాన్ని సవాలు చేస్తూ దాఖలైన పిటిషన్లను కొట్టివేసిన న్యాయస్థానం ప్రభుత్వ ఉత్తర్వులను సమర్థించింది. కర్నాటక హైకోర్టు మంగళవారం హిజాబ్ వివాదం కేసులో తీర్పు ఇచ్చిన కొన్ని గంటల తర్వాత రాష్ట్రంలోని యాద్గిర్‌లోని సురపుర తాలూకా కెంబావి ప్రభుత్వ పీయూ కళాశాల విద్యార్థులు పరీక్షను బహిష్కరించి వెళ్లిపోయారు. విద్యార్థులకు మెయిన్ పరీక్షలకు ముందు సన్నాహక పరీక్షలు నిర్వహిస్తున్నారు. అయితే, తాజాగా హిజాబ్ పై హైకోర్టు ఇచ్చిన తీర్పు పై అసంతృప్తితో విద్యార్థులు పరీక్షలను బహిష్కరించారు. ఈ పరీక్ష ఉదయం 10 గంటలకు ప్రారంభమై మధ్యాహ్నం 1 గంటలోపు ముగియాల్సి ఉంది.
కళాశాల ప్రిన్సిపల్ మాట్లాడుతూ.. కర్ణాటక హైకోర్టు ఆదేశాలను పాటించాలని విద్యార్థులకు విజ్ఞప్తి చేశారు. "కానీ వారు నిరాకరించారు మరియు పరీక్ష హాల్ నుండి బయటకు వెళ్ళిపోయారు. మొత్తం 35 మంది విద్యార్థులు కళాశాల నుంచి బయటకు వెళ్లిపోయారు’’ అని ఆమె తెలిపారు. ఇదిలా ఉండగా, తీర్పుపై తల్లిదండ్రులతో చర్చించి, హిజాబ్ ధరించకుండానే తరగతికి హాజరవుతారో లేదో నిర్ణయిస్తామని విద్యార్థులు తెలిపారు.“మేము హిజాబ్ ధరించి పరీక్ష రాస్తాము. హిజాబ్‌ను తొలగించమని వారు అడిగితే, మేము పరీక్షలు రాయము”అని ఒక విద్యార్థి పేర్కొన్నారు.
కాగా, కర్నాటకతో పాటు పలు రాష్ట్రాల్లోని ప్రాంతాల్లో Hijab వివాదం ఉద్రిక్తలకు దారి తీసింది. ఈ క్రమంలోనే న్యాయస్థానాలు రంగంలోకి దిగాయి. హిజాబ్ నేపథ్యంలో రాజుకున్న వివాదంపై Karnataka High Court మంగళవారం నాడు సంచలన తీర్పు ఇచ్చింది. విద్యా సంస్థల్లో హిజాబ్ తప్పని సరికాదని న్యాయస్థానం స్పష్టం చేసింది. విద్యా సంస్థల్లో స్కూల్ నియమాల ప్రకారం.. యాజమాన్యం సూచించిన యూనిఫామ్ ను ధరించాల్సిందేనని హైకోర్టు స్పష్టం చేసింది. హిజాబ్ ను నిషేధించాలని సవాల్ చేస్తూ దాఖలు చేసిన పిటిషన్లను హైకోర్టు కొట్టివేసింది. యూనిఫామ్ పై విద్యార్ధులు అభ్యంతరం చెప్పకూడదని కూడా హైకోర్టు తేల్చి చెప్పింది.
కర్నాటకలోని ఉడిపిలోని విద్యా సంస్థల్లో హిజాబ్ ధరించడాన్ని పలువురు విద్యార్థులు వ్యతిరేకించారు. ఈ క్రమంలోనే వారు కాషాయ కండువాలు ధరించి స్కూల్ వచ్చారు. దీంతో హిజాబ్ వ్యతిరేక నినాదాలు చేయడం.. కాషాయ కండువాలు ధరించడం వంటి చర్యలతో ఉద్రిక్త పరిస్థితులు తలెత్తాయి. ఉడిపి నుంచి కర్నాటక మొత్తం హిజాబ్ వివాదం రాజుకుంది. ఇతర రాష్ట్రాలకు సైతం పాకింది. రాష్ట్రంలో ఈ వివాదం మరింత ముదరకుండా ప్రభుత్వం చర్యలకు ఉపక్రమించింది. హిజాబ్ వివాదం నేపథ్యంలో గత మాసంలో హిజాబ్ తో పాటు, కాషాయ రంగు కండువాలు ధరించి విద్యా సంస్థలకు రావడంపై నిషేధం విధించింది. .
పలు వర్గాల నుంచి ప్రభుత్వం నిర్ణయంపై వ్యతిరేకత వచ్చింది. హిజాబ్ ధరించడం రాజ్యాంగం కల్పించిన ప్రాథమిక హక్కు అంటూ సుమారు 12 మంది ముస్లిం విద్యార్ధులతో పాటు పలువురు కోర్టులో పిటిషన్లు దాఖలు చేశారు. ఈ విషయమై 11 రోజుల విచారణ అనంతరం హైకోర్టు ఫిబ్రవరి 25న తీర్పును రిజర్వ్ చేసింది. ఈ క్రమంలోనే మంగళవారం నాడు హైకోర్టు తన తుది తీర్పును వెల్లడించింది. విద్యా సంస్థల్లో హిజాబ్ తప్పని సరికాదని స్పష్టం చేసింది. విద్యా సంస్థల్లో స్కూల్ యూనిఫామ్ ను ధరించాల్సిందేనని పేర్కొంది. హిజాబ్ ను నిషేధించాలని సవాల్ చేస్తూ దాఖలు చేసిన పిటిషన్లను కొట్టివేసింది.
