Karnataka hijab row: హిజాబ్ వివాదానికి సంబంధించి దాఖ‌లైన ప‌టిష‌న్ల‌ను విచారించిన క‌ర్నాట‌క హైకోర్టు మంగ‌ళ‌వారం నాడు త‌న తీర్పును వెల్ల‌డించింది. విద్యా సంస్థల్లో హిజాబ్ తప్పని సరికాదని హైకోర్టు స్పష్టం చేస్తూ..ప్ర‌భుత్వ ఉత్త‌ర్వుల‌ను స‌మ‌ర్థించింది.  

Karnataka hijab row: క‌ర్నాట‌క‌ హైకోర్టు హిజాబ్ కేసులో మంగ‌ళ‌వారం నాడు తన తీర్పును ప్రకటించింది. విద్యా సంస్థల్లో హిజాబ్ నిషేధాన్ని సవాలు చేస్తూ దాఖలైన పిటిషన్లను కొట్టివేసిన న్యాయస్థానం.. ప్రభుత్వ ఉత్తర్వులను సమర్థించింది. అయితే, హైకోర్టు తీర్పుపై పిటిష‌న‌ర్లు అసంతృప్తిని వ్య‌క్తం చేస్తున్నారు. హైకోర్టు తీర్పును స‌వాలు చేస్తూ.. దేశ అత్యున్న‌త న్యాయ‌స్థానం సుప్రీంకోర్టుకు వెళ్తామ‌ని చెబుతున్నారు. 

వివ‌రాల్లోకెళ్తే.. క‌ర్నాట‌క‌తో పాటు ప‌లు రాష్ట్రాల్లోని ప్రాంతాల్లో Hijab వివాదం ఉద్రిక్త‌ల‌కు దారి తీసింది. ఈ క్ర‌మంలోనే న్యాయ‌స్థానాలు రంగంలోకి దిగాయి. హిజాబ్ నేప‌థ్యంలో రాజుకున్న వివాదంపై Karnataka High Court మంగళవారం నాడు సంచలన తీర్పు ఇచ్చింది. విద్యా సంస్థల్లో హిజాబ్ తప్పని సరికాదని న్యాయ‌స్థానం స్పష్టం చేసింది. విద్యా సంస్థల్లో స్కూల్ నియ‌మాల ప్ర‌కారం.. యాజ‌మాన్యం సూచించిన యూనిఫామ్ ను ధరించాల్సిందేనని హైకోర్టు స్పష్టం చేసింది. హిజాబ్ ను నిషేధించాలని సవాల్ చేస్తూ దాఖలు చేసిన పిటిషన్లను హైకోర్టు కొట్టివేసింది. యూనిఫామ్ పై విద్యార్ధులు అభ్యంతరం చెప్పకూడదని కూడా హైకోర్టు తేల్చి చెప్పింది.

క‌ర్నాట‌క‌లోని ఉడిపిలోని విద్యా సంస్థ‌ల్లో హిజాబ్ ధ‌రించ‌డాన్ని ప‌లువురు విద్యార్థులు వ్య‌తిరేకించారు. ఈ క్ర‌మంలోనే వారు కాషాయ కండువాలు ధ‌రించి స్కూల్ వ‌చ్చారు. దీంతో హిజాబ్ వ్య‌తిరేక నినాదాలు చేయ‌డం.. కాషాయ కండువాలు ధ‌రించ‌డం వంటి చ‌ర్య‌ల‌తో ఉద్రిక్త ప‌రిస్థితులు త‌లెత్తాయి. ఉడిపి నుంచి క‌ర్నాట‌క మొత్తం హిజాబ్ వివాదం రాజుకుంది. ఇత‌ర రాష్ట్రాల‌కు సైతం పాకింది. రాష్ట్రంలో ఈ వివాదం మ‌రింత ముద‌ర‌కుండా ప్ర‌భుత్వం చ‌ర్య‌ల‌కు ఉప‌క్ర‌మించింది. హిజాబ్ వివాదం నేపథ్యంలో గత మాసంలో హిజాబ్ తో పాటు, కాషాయ రంగు కండువాలు ధరించి విద్యా సంస్థలకు రావడంపై నిషేధం విధించింది. . 

ప‌లు వ‌ర్గాల నుంచి ప్ర‌భుత్వం నిర్ణ‌యంపై వ్య‌తిరేక‌త వ‌చ్చింది. హిజాబ్ ధరించడం రాజ్యాంగం కల్పించిన ప్రాథమిక హక్కు అంటూ సుమారు 12 మంది ముస్లిం విద్యార్ధులతో పాటు పలువురు కోర్టులో పిటిషన్లు దాఖలు చేశారు. ఈ విషయమై 11 రోజుల విచారణ అనంతరం హైకోర్టు ఫిబ్రవరి 25న తీర్పును రిజర్వ్ చేసింది. ఈ క్ర‌మంలోనే మంగ‌ళ‌వారం నాడు హైకోర్టు తన తుది తీర్పును వెల్లడించింది. విద్యా సంస్థల్లో హిజాబ్ తప్పని సరికాదని స్పష్టం చేసింది. విద్యా సంస్థల్లో స్కూల్ యూనిఫామ్ ను ధరించాల్సిందేనని పేర్కొంది. హిజాబ్ ను నిషేధించాలని సవాల్ చేస్తూ దాఖలు చేసిన పిటిషన్లను కొట్టివేసింది.

చీఫ్ జస్టిస్ రీతూ రాజ్ అవస్థి, జస్టిస్ కృష్ణ ఎస్ దీక్షిత్, జస్టిస్ జేఎం ఖాజీలతో కూడిన త్రిసభ్య ధర్మాసనం ఉదయం 10.30 గంటలకు కొనసాగుతున్న హిజాబ్ వివాదంపై తీర్పును వెలువరించింది. హిజాబ్ వివాదం తుదితీర్పు వెలువ‌డ‌నున్న నేప‌థ్య‌లో అధికారులు ముందుగానే బెంగుళూరులో 144 సెక్షన్ విధించారు. విద్యాసంస్థ‌ల‌కు సెల‌వు ప్ర‌క‌టించారు. ఇక హైకోర్టు తీర్పుపై పిటిష‌న‌ర్లు అసంతృప్తి వ్య‌క్తం చేశారు. తీర్పును స‌వాలు చేస్తామ‌ని పేర్కొంటూ.. సుప్రీంకోర్టును ఆశ్రయిస్తానని తెలిపారు. పిటిషనర్ల తరఫు న్యాయవాది కెవి ధనంజయ్‌ మాట్లాడుతూ.. హైకోర్టు పూర్తి ఉత్తర్వులు వెలువడిన తర్వాత సుప్రీంకోర్టును ఆశ్రయిస్తామ‌ని తెలిపారు. అలాగే, మ‌రో పిటిష‌న‌ర్ త‌ర‌ఫున వాద‌న‌లు వినిపించిన న్యాయవాది షాహుల్, "మేము ఈ అంశంపై సంప్రదింపులు జరుపుతున్నాము, వివరణాత్మక ఉత్తర్వు వచ్చిన తర్వాత, మేము దానిని విశ్లేషించి, సుప్రీం కోర్టుకు వెళ్తాము" అని తెలిపారు.