Karnataka hijab row: కర్నాటకలోని పలు విద్యాసంస్థల్లో రాజుకున్న హిజాబ్ (Hijab) వివాదం.. ఇప్పుడు దేశవ్యాప్తంగా రాజకీయ దుమారం రేపుతున్నది. కర్నాటక నుంచి హిజాబ్ వివాదం ఇతర రాష్ట్రాలకు పాకుతోంది. ఈ నేపథ్యంలోనే సోషల్ డెమోక్రటిక్ పార్టీ ఆఫ్ ఇండియా సంచలన వ్యాఖ్యలు చేసింది. హిజాబ్-కాషాయ కండువాల వివాదాన్ని బీజేపీ స్పాన్సర్ చేస్తోందని ఆరోపించింది.
Karnataka hijab row: కర్నాటకలోని పలు విద్యాసంస్థల్లో రాజుకున్న హిజాబ్ (Hijab) వివాదం.. ఇప్పుడు దేశవ్యాప్తంగా రాజకీయ దుమారం రేపుతున్నది. కర్నాటక నుంచి హిజాబ్ వివాదం ఇతర రాష్ట్రాలకు పాకుతోంది. ముఖ్యంగా మధ్యప్రదేశ్, పుదుచ్చేరిలలోనూ ఉద్రిక్త పరిస్థితులు నెలకొంటున్నాయి. ఈ నేపథ్యంలోనే కర్నాటకలోని విద్యాసంస్థల్లో హిజాబ్-కాషాయ కండువాల వివాదాన్ని బీజేపీ స్పాన్సర్ చేస్తోందని సోషల్ డెమోక్రటిక్ పార్టీ ఆఫ్ ఇండియా (ఎస్‌డీపీఐ) సంచలన వ్యాఖ్యలు చేసింది. ఎస్‌డీపీఐ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి బీఆర్ భాస్కర్ ప్రసాద్ బుధవారం మీడియాతో మాట్లాడుతూ ఈ వ్యాఖ్యలు చేశారు.
రాష్ట్రంలోని బీజేపీ ప్రభుత్వం ఈ హిజాబ్-కాషాయ కండువాల వివాదాన్ని స్పాన్సర్ చేస్తున్నదని బీఆర్ భాస్కర్ ప్రసాద్ (B R Bhaskar Prasad) ఆరోపించారు. ఇది నేరపూరితమైన చర్య అని అన్నారు. ముస్లిం మహిళలు హిజాబ్ ధరించడాన్ని రాజ్యాంగం ఎప్పుడూ నిషేధించలేదని పేర్కొన్న ఆయన.. ఈ సమస్యను కళాశాల ప్రిన్సిపాల్ సృష్టించారనీ, అనంతరం సంఘ్ పరివార్ సంస్థలు ముందుకు కొనసాగించాయని ఆరోపించారు. దారం (thread), నామా (nama) వంటి హిందూ చిహ్నాలను అనుమతించినప్పుడు హిజాబ్‌ను మత చిహ్నంగా ఎందుకు నిషేధించాలో చెప్పాలని ఆయన డిమాండ్ చేశారు. ఈ విషయంలో కాంగ్రెస్ ద్వంద్వ ప్రమాణాలు అనుసరిస్తోందని విమర్శించారు.
అలాగే, ఎస్‌డీపీఐ (social democratic party of India) రాష్ట్ర అధ్యక్షుడు అబ్దుల్ మజీద్ మాట్లాడుతూ.. అభివృద్ధి కమిటీలు డ్రెస్ కోడ్ నిర్దేశించిన కాలేజీలకు మాత్రమే హైకోర్టు మధ్యంతర ఉత్తర్వులు వర్తిస్తాయని అన్నారు. ఈ ఉత్తర్వులపై జిల్లా యంత్రాంగం, విద్యాశాఖ గందరగోళం సృష్టిస్తున్నాయని ఆరోపించారు. ఈ అంశంపై కాంగ్రెస్ వైఖరిని కేపీసీసీ అధ్యక్షుడు డీకే శివకుమార్ స్పష్టం చేయాలని ఆయన అన్నారు. కాంగ్రెస్, బీజేపీలకు మైనార్టీ ఓట్లు కావాలని కానీ.. వారి సమస్యలను పరిష్కరించడం పార్టీలకు ఇష్టం లేదని మాజీద్ అన్నారు. కాగా, హిజాబ్ విషయంలో ముస్లిం బాలికలు మానసిక వేధింపులకు గురవుతున్నారని పాపులర్ ఫ్రంట్ ఆఫ్ ఇండియా ( Popular Front of India) (పీఎఫ్‌ఐ) మహిళా విభాగం నేషనల్ ఉమెన్స్ ఫ్రంట్ ఆరోపించింది.
ఇక్కడ జరిగిన ప్రెస్ మీట్‌లో NWF దక్షిణ కన్నడ జిల్లా అధ్యక్షురాలు జులైఖా బజ్పే మాట్లాడుతూ.. హైకోర్టు ఆదేశాలను అమలు చేస్తామనే నెపంతో బాలికలను 'హింస' చేస్తున్న కొన్ని పాఠశాలల యాజమాన్యాలు, ఉపాధ్యాయుల వైఖరిని ఖండించారు. ఈ ఉత్తర్వు ప్రీ-యూనివర్సిటీ కళాశాలలకే పరిమితం కాగా, ఇతర కళాశాలల విద్యార్థులు మరియు ఉపాధ్యాయులను కూడా బహిరంగ ప్రదేశాల్లో తమ హిజాబ్ లను తొలగించాలని అధికారులు ఒత్తిడి చేస్తున్నారని ఆమె అన్నారు. ఇలాంటి చర్యలు ముస్లిం విద్యార్థుల ప్రాథమిక హక్కులను కాలరాయడమేనని ఆమె పేర్కొన్నారు.
అంతకు ముందు రోజు కేరళ గవర్నర్ ఆరీఫ్ మహ్మద్ ఖాన్ చేసిన వ్యాఖ్యలపైనా సోషల్ డెమోక్రటిక్ పార్టీ ఆఫ్ ఇండియా (ఎస్‌డీపీఐ) అసంతృప్తిని వ్యక్తం చేసింది. అధికార పార్టీ ప్రతినిధిలా ఆయన ధోరణి ఉందని విమర్శించింది. ఈ మేరకు ఓ ప్రకటన జారీ చేసింది.
