హిజాబ్ వివాదంపై కర్ణాటక హైకోర్టు ఇచ్చిన తీర్పును ముస్లిం మత సంస్థ ఆల్ ఇండియా ముస్లిం ఉమెన్స్ పర్సనల్ లా బోర్డు స్వాగతించింది. హైకోర్టు ఆదేశాలను అందరూ గౌరవించాలని సూచించింది.
విద్యా సంస్థల్లో హిజాబ్‌ను నిషేధిస్తూ కర్ణాటక హైకోర్టు (Karnataka High Court) మంగళవారం ఇచ్చిన తీర్పుపై భిన్నాభిప్రాయలు వ్యక్తం అవుతున్నాయి. పలువురు ఈ తీర్పు పట్ల వ్యతిరేకత వ్యక్తం చేస్తుండగా.. పలువురు స్వాగతిస్తున్నారు. అయితే హిజాబ్ నిషేధంపై తీర్పును ముస్లిం మత సంస్థ ఆల్ ఇండియా ముస్లిం ఉమెన్స్ పర్సనల్ లా బోర్డు (AIMWPLB) స్వాగతించింది.
ఈ తీర్పుపై AIMWPLB ప్రెసిడెంట్ షైస్టా అంబర్ (Shaista Amber) మాట్లాడారు. కర్ణాటక హైకోర్టు ఆదేశాలను గౌరవించాలని అన్నారు. దేశంలో న్యాయవ్యవస్థ, రాజ్యాంగం అన్నింటికంటే ఉన్నతమైనవని తెలిపారు. దేశ న్యాయవ్యవస్థ, రాజ్యాంగం ప్రాథమికమైనవని చెప్పారు. పాఠశాలల్లో డ్రెస్ కోడ్ ఉంటే దానిని పాటించాలని సూచించారు. విద్యార్థులు విద్యకు ప్రాధాన్యత ఇవ్వాలని, ఎందుకంటే ఇది ఇస్లాంలో విశ్వాసానికి చిహ్నంగా ఉందని తెలిపారు.
అయితే ఆర్టికల్ 21 ప్రకారం ప్రజలు తమకు నచ్చిన దుస్తులు ధరించడానికి అనుమతించాలని షైస్టా అంబర్ అన్నారు. విద్యా సంస్థలు దుస్తులు ధరించడానికి కొన్ని నిబంధనలను నిర్దేశించినట్లయితే, దానిని తప్పనిసరిగా పాటించాలని తెలిపారు. ఇస్లాంలో హిజాబ్ తల, శరీరాన్ని కప్పి ఉంచే నిరాడంబరమైన, నాగరిక పద్ధతి అని తెలిపారు. ఇది ముఖాన్ని కప్పి ఉంచడానికి కాదని తెలిపారు. సమాజం, దేశం గొప్ప ఔన్నత్యాన్ని సాధించడానికి విద్యకు ప్రాధాన్యత ఇవ్వాలని ఆమె అన్నారు.
మంగళవారం కర్ణాటక హైకోర్టులోని త్రిసభ్య ధర్మాసనం తీర్పు వెలువరిస్తూ.. ఇస్లామిక్ ఆచరణలో హిజాబ్ ముఖ్యమైన భాగం కాదని నిర్ద్వంద్వంగా పేర్కొంది. కాలేజీల్లో హిజాబ్ ధరించడానికి అనుమతి కోరుతూ ముస్లిం బాలికలు దాఖలు చేసిన పిటిషన్‌ను కొట్టివేసిన కోర్టు, యూనిఫాం నిబంధన సహేతుకమైన పరిమితి అని, విద్యార్థులు దానిపై అభ్యంతరం చెప్పలేరని పేర్కొంది. ఇదిలా ఉండగా.. కోర్టు ఇచ్చిన తీర్పును కేంద్ర మంత్రి ప్రహ్లాద్ జోషి (central minister pralhad joshi) స్వాగతించారు. ప్రతీ ఒక్కరూ కోర్టు ఆదేశాలను అంగీకరించి శాంతిని కాపాడాలని విజ్ఞప్తి చేస్తున్నాని తెలిఆరు. విద్యార్థుల ప్రాథమిక విధి చదువు అని, కాబట్టి అన్ని విషయాలను పక్కనబెట్టి చదువుకొని ఐక్యంగా ఉండాలని ఆయన సూచించారు
కాగా.. హిజాబ్ వివాదంపై కర్ణాటక హైకోర్టు ఇచ్చిన తీర్పు తమను తీవ్రంగా నిరాశ పర్చిందని కాశ్మీర్ మాజీ ముఖ్యమంత్రులు ఒమర్ అబ్దుల్లా ((omar abdullah), మెహబూబా ముఫ్తీ (Mehbooba Mufti)లు మంగళవారం తెలిపారు. “ హజాబ్ నిషేధాన్ని సమర్థిస్తూ కర్ణాటక హైకోర్టు తీసుకున్న నిర్ణయం తీవ్ర నిరాశపరిచింది. ఒక వైపు మనం మహిళలకు సాధికారత కల్పించడం గురించి మాట్లాడుతున్నాం. అయినప్పటికీ మనమే వారికి సాధారణ ఎంపిక హక్కును నిరాకరిస్తున్నాము. ఇది కేవలం మతానికి సంబంధించినది కాదు. ఇది ఎంచుకునే స్వేచ్ఛ ‘‘ మెహబూబా ముఫ్తీ ట్వీట్ చేశారు. అలాగే ‘‘ కర్ణాటక హైకోర్టు తీర్పు పట్ల చాలా నిరాశ చెందాను. హిజాబ్ విషయంలో మీరు ఏమనుకుంటున్నప్పటికీ, ఇది దుస్తులు, వస్తువుల గురించి కాదు. ఒక స్త్రీ ఎలా దుస్తులు ధరించాలనుకుంటున్నారో ఎంచుకునే హక్కు ఆమెకు ఉంది. ఈ ప్రాథమిక హక్కును కోర్టు సమర్థించకపోవడం అపహాస్యం’’ అని అబ్దుల్లా తెలిపారు.
