ప్రస్తుతం కర్ణాటకలో హిజాబ్ వివాదం (Karnataka Hijab Row) కొనసాగుతున్న సంగతి తెలిసిందే. ఇందుకు సంబంధించిన పిటిషన్లపై కర్ణాటక హైకోర్టులో విచారణ సాగుతుంది. ఈ క్రమంలోనే గతంలో ఇలాంటి ఓ వివాదానికి సంబంధించి కేరళ హైకోర్టు (Kerala High Court) ఇచ్చిన తీర్పును ఇప్పుడు ఒకసారి పరిశీలిద్దాం.
ప్రస్తుతం కర్ణాటకలో హిజాబ్ వివాదం (Karnataka Hijab Row) రోజురోజుకు ముదురుతోంది. కర్ణాటక ఉడిపిలోని ప్రభుత్వ బాలికల పీయూ కళాశాలలో గత నెలలో హిజాబ్ నిరసనలు ప్రారంభమయ్యాయి. హిందు విద్యార్థినులు కాషాయం కండువాలు ధరించి.. హిజాబ్ వ్యతిరేకంగా నిరసనలు వ్యక్తం చేశారు. మరోవైపు యూనిఫామ్‌లో భాగంగా హిజాబ్‌ను అనుమతించాలనే డిమాండ్ చేశారు. ఈ వివాదం తర్వాత కర్ణాటకలోని పలుచోట్లకు విస్తరించింది. అయితే ఇందుకు సంబంధించి దాఖలైన పిటిషన్లపై కర్ణాటక హైకోర్టు విస్తృత ధర్మాసనం విచారణ జరుపుతుంది. అయితే ఈ క్రమంలోనే గతంలో ఇలాంటి ఓ వివాదానికి సంబంధించి కేరళ హైకోర్టు (Kerala High Court) ఇచ్చిన తీర్పును ఇప్పుడు ఒకసారి పరిశీలిద్దాం.
Christ Nagar Senior Secondary Schoolలో చదువుతున్న ఇద్దరు విద్యార్థినిలు మతపరమైన దుస్తులకు సంబంధించి దాఖలు చేసిన పిటిషన్‌పై జస్టిస్ ఏ మహ్మద్ ముస్తాక్ (Justice A Muhamed Mustaque) 2018లో తీర్పు వెలువరించారు. పాఠశాల యూనిఫాంలో భాగంగా ఫుల్ స్లీవ్ డ్రెస్‌లు, హిజాబ్‌లు ధరించేందుకు చేసిన విజ్ఞప్తిని తిరస్కరించారు. ఒక ప్రైవేట్ సంస్థ యొక్క ప్రాథమిక హక్కు ముఖ్యమని తెలిపారు. ప్రతి ఒక్కరికి డ్రెస్ కోడ్ విషయంలో సొంత ఆలోచనలు, నమ్మకాలను అనుసరించే స్వేచ్ఛ ఉందన్నారు. అదే సమయంలో ఒక సంస్థను నిర్వహించడానికి సమానమైన ప్రాథమిక హక్కును కలిగిన ప్రైవేట్ సంస్థపై అటువంటి హక్కును క్లెయిమ్ చేసినప్పుడు.. ప్రాథమిక హక్కులను బ్యాలెన్స్ చేసి సమస్యను నిర్ణయించాల్సి ఉంటుందని అభిప్రాయపడ్డారు. ఇలాంటి విషయాల్లో గతంలో సుప్రీం కోర్టు, హైకోర్టులు ఇచ్చిన తీర్పులను న్యాయమూర్తి తన తీర్పులో ప్రస్తావించారు.
రాజ్యాంగ హక్కు (Constitutional right) అనేది.. ఇతరుల హక్కులను నిర్మూలించడం ద్వారా ఒక హక్కును రక్షించడానికి ఉద్దేశించినది కాదని న్యాయమూర్తి అన్నారు. సంస్థ యొక్క విస్తృత హక్కుకు వ్యతిరేకంగా పిటిషనర్లు తమ వ్యక్తిగత హక్కులను కోరలేరని కోర్టు నిర్ధారించింది. పిటిషనర్లు అయిన తోబుట్టువులు ఫాతిమా తస్నీమ్, హఫ్జా పర్వీన్‌లు.. హిజాబ్, ఫుల్ స్లీవ్ డ్రెస్‌లు ధరించి తరగతులకు హాజరయ్యేందుకు అనుమతించవచ్చా లేదా అనేది సంస్థ నిర్ణయించాల్సి ఉంటుందని పేర్కొంది. దానిపై నిర్ణయం తీసుకోవడం పూర్తిగా సంస్థ యొక్క డొమైన్‌లో విషయమని చెప్పింది.
అందుకే అటువంటి అభ్యర్థనను పరిగణనలోకి తీసుకోవాలని కోర్టు కూడా సంస్థను ఆదేశించదని న్యాయమూర్తి చెప్పారు. ఈ కారణం చేత విద్యార్థినులు వేసిన రిట్ పిటిషన్ కొట్టివేయడంజరిగిందన్నారు. పిటిషనర్లు ట్రాన్స్‌ఫర్ సర్టిఫికేట్ కోసం సంస్థను సంప్రదించినట్లయితే.. పాఠశాల యజమాన్యం ఎటువంటి వ్యాఖ్యలు చేయకుండా దానిని జారీ చేయాలని తీర్పు వెలువరించారు. పిటిషనర్లు పాఠశాల దుస్తుల కోడ్‌కు కట్టుబడి ఉండటానికి సిద్ధంగా ఉంటే.. వారు అదే పాఠశాలలో కొనసాగడానికి అనుమతించబడతారని అనడంలో ఎలాంటి సందేహం లేదన్నారు.
