హిజాబ్ వివాదంపై కర్ణాటక హైకోర్టు వెలువరించిన తీర్పుపై భిన్నాభిప్రాయలు వ్యక్తం అవుతున్నాయి. ఈ తీర్పును పలువురు స్వాగతిస్తుండగాా.. మరి కొందరు అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. ఈ తీర్పు తమని నిరాశకు గురిచేసిందని జమ్మూ కాశ్మీర్ మాజీ ముఖ్యమంత్రులు ఒమర్ అబ్దుల్లా, మెహబూబా ముఫ్తీ తెలిపారు.
గత రెండున్నర నెలల నుంచి కర్ణాటక రాష్ట్రంలో నెలకొన్న వివాదం నేడు కొలక్కి వచ్చింది. మంగళవారం ఉదయం ఆ రాష్ట్ర హైకోర్టు హిజాబ్ వివాదంపై తీర్పు ఇచ్చింది. అయితే ఈ తీర్పును కేంద్ర ప్రభుత్వంతో పాటు పలువురు నాయకులు స్వాగతిస్తుండగా.. ఒమర్ అబ్దుల్లా, మెహబూబా ముఫ్తీ వంటి ప్రముఖ కాశ్మీరీ నేతలు తమ నిరాశను వ్యక్తం చేశారు.
“ హజాబ్ నిషేధాన్ని సమర్థిస్తూ కర్ణాటక హైకోర్టు తీసుకున్న నిర్ణయం తీవ్ర నిరాశపరిచింది. ఒక వైపు మనం మహిళలకు సాధికారత కల్పించడం గురించి మాట్లాడుతున్నాం. అయినప్పటికీ మనమే వారికి
సాధారణ ఎంపిక హక్కును నిరాకరిస్తున్నాము. ఇది కేవలం మతానికి సంబంధించినది కాదు. ఇది ఎంచుకునే స్వేచ్ఛ ‘‘ అని మాజీ ముఖ్యమంత్రి, పీపుల్స్ డెమోక్రటిక్ పార్టీ (PDP) అధ్యక్షురాలు మెహబూబా ముఫ్తీ (Mehbooba Mufti) తెలిపారు. ఈ మేరకు ఆమె ట్విట్టర్ లో ట్వీట్ చేశారు.
''కర్ణాటక హైకోర్టు తీర్పు పట్ల చాలా నిరాశ చెందాను. హిజాబ్ విషయంలో మీరు ఏమనుకుంటున్నప్పటికీ, ఇది దుస్తులు, వస్తువుల గురించి కాదు. ఒక స్త్రీ ఎలా దుస్తులు ధరించాలనుకుంటున్నారో ఎంచుకునే హక్కు ఆమెకు ఉంది. ఈ ప్రాథమిక హక్కును కోర్టు సమర్థించకపోవడం అపహాస్యం’’ అని జమ్మూ కాశ్మీర్ మాజీ ముఖ్యమంత్రి ఒమర్ అబ్దుల్లా (omar abdullah) ట్వీట్ చేశారు.
మంగళవారం కర్ణాటక హైకోర్టు హిజాబ్‌పై పిటిషన్‌ను కొట్టివేసింది, విద్యా సంస్థల్లో హిజాబ్ ధరించడంపై నిషేధాన్ని సమర్థించింది. హిజాబ్ ధరించడం మత స్వేచ్ఛ కింద రక్షించబడే ముఖ్యమైన మతపరమైన ఆచారాల కిందకు రాదని కోర్టు పేర్కొంది. ‘‘ ముస్లిం మహిళలు హిజాబ్ ధరించడం ఇస్లామిక్ ప్రకారం మతపరమైన ఆచారంలో భాగం కాదని మేము భావిస్తున్నాము ’’ అంటూ తెలిపింది. హైకోర్టు త్రిసభ్య ధర్మాసనానికి నేతృత్వం వహించిన ప్రధాన న్యాయమూర్తి రీతూ రాజ్ అవస్తీ (Chief Justice Ritu Raj Awasthi) ఈ తీర్పును వెలువరించారు. ప్యానెల్‌లోని మరో ఇద్దరు న్యాయమూర్తులుగా జస్టిస్ కృష్ణ ఎస్ దీక్షిత్ (Krishna S Dixit) , జస్టిస్ జెఎం ఖాజీ (J M Khazi) ఉన్నారు. స్కూల్ యూనిఫాం విధానం అనేది ఒక సహేతుకమైన పరిమితి మాత్రమేనని తెలిపారు.
కోర్టు ఇచ్చిన తీర్పును కేంద్ర మంత్రి ప్రహ్లాద్ జోషి (central minister pralhad joshi) స్వాగతించారు. ప్రతీ ఒక్కరూ కోర్టు ఆదేశాలను అంగీకరించి శాంతిని కాపాడాలని విజ్ఞప్తి చేస్తున్నాని తెలిఆరు. విద్యార్థుల ప్రాథమిక విధి చదువు అని, కాబట్టి అన్ని విషయాలను పక్కనబెట్టి చదువుకొని ఐక్యంగా ఉండాలని ఆయన సూచించారు. కాగా.. జనవరి 1వ తేదీన కర్ణాటకలోని ఉడిపిలో ఉన్న ప్రభుత్వ కాలేజీలో ఈ హిజాబ్ (hijab)వివాదం మొదలైంది. ఆరుగురు ముస్లిం బాలికలు హిజాబ్ ధరించి క్లాసులకు హాజరయ్యారు. దీనిని కాలేజీ మేనేజ్మెంట్ ఒప్పుకోలేదు. దీంతో ఈ వివాదం మొదలైంది. ముస్లిం బాలికల హిజాబ్ ధరించి రావడంతో కొంత మంది హిందూ విద్యార్థులు కాషాయ కండువాలు ధరించి క్లాసులకు రావడం మొదలు పెట్టింది. దీంతో రెండు ఉడిపిలో వర్గాల మధ్య మొదలైన ఈ సమస్య రాష్ట్రం మొత్తం వ్యాపించింది. ఇది కోర్టు వరకు వెళ్లింది. దీంతో ఇరు వర్గాల వాదలను విన్న కోర్టు నేడు తీర్పును వెలువరించింది.
