హిజాబ్ వివాదంపై కర్నాటక హైకోర్టు విచారణ చేపడుతోంది. అయితే హిజాబ్ నిరాకరించారని కోర్టుకు వెళ్లిన ముస్లిం బాలికల వ్యక్తిగత వివరాలను ఆ రాష్ట్ర బీజేపీ ట్విట్టర్ లో షేర్ చేసింది. దీనిపై విమర్శలు రావడంతో కొంత సమయం తరువాత తొలగించింది. 

తరగతి గదుల్లో హిజాబ్ (hijab) నిషేధించడాన్ని వ్యతిరేకిస్తూ కర్ణాటక హైకోర్టును ఆశ్రయించిన ఉడిపి (udipi)కి చెందిన బాలికల‌ ఇంటి చిరునామాలతో పాటు వారి వ్యక్తిగత వివరాలను క‌ర్నాట‌క (karnataka) బీజేపీ (bjp) ట్విట్ట‌ర్ (twitter)లో షేర్ చేసింది. క‌న్న‌డ, ఇంగ్లీష్ లో చేసిన ఈ ట్వీట్ పై తీవ్ర విమ‌ర్శ‌లు రావ‌డంతో వెంట‌నే వాటిని తొల‌గించింది. 

‘‘ హిజాబ్ వివాదంలో పాల్గొన్న ఐదుగురు విద్యార్థులు మైనర్లే. ఈ మైనర్ బాలికలను రాజకీయాల్లోకి లాగేందుకు కాంగ్రెస్ నేతలు సోనియా (sonia), రాహుల్ (rahul), ప్రియాంక (priyanka)లకు ఎలాంటి అపరాధభావం లేదా ? ఎన్నికల్లో గెలవడానికి ఎంతగా దిగజారిపోతారు ? ప్రియాంకగాంధీ ఇదేనా ‘లడ్కీ హూ లడ్ శక్తి హూన్’ అంటే ? ’’ అని ట్వీట్ చేసింది. దీంతో పాటు హైకోర్టులో పిటిషన్లు వేసిన ఉడిపికి చెందిన అమ్మాయిల వ్యక్తిగత వివరాలను పార్టీ ట్విట్ట‌ర్ లో ఉంచింది. 

బీజేపీ చేసిన ఈ ట్వీట్ కు వ్య‌తిరేకంగా శివసేన (shivasena) ఎంపీ ప్రియాంక చతుర్వేది (mp priyanka chaturvedi) ట్వీట్ చేశారు. ‘‘'సిగ్గులేని కర్నాటక బీజేపీ ప్రతిపక్షాలపై దాడి చేయడానికి మైనర్ బాలికల చిరునామాలను ట్వీట్ చేస్తుంది. ఇది ఎంత సున్నితత్వం, అనారోగ్యం, దయనీయమైనదో మీరు గ్రహించారా ? మైనర్‌ల పేర్లు, చిరునామాలను పంచుకోవడం నేరపూరిత చర్య. ఇది ఆమోదయోగ్యం కాదు. ఈ ట్వీట్ ను తొల‌గించాల్సిందిగా క‌ర్నాట‌క డీజీపీని, ట్విట్ట‌ర్ ఇండియాను కోరుతున్నాను’’ అంటూ ఆ రాష్ట్ర డీజీపీ ట్విట్టర్ అకౌంట్ ను, ట్విట్టర్ ఇండియా అకౌంట్ ను ట్యాగ్ చేశారు. దీనిపై జాతీయ బాలల హక్కుల పరిరక్షణ కమిషన్ వెంటనే విచారణ చేపట్టాలని ఆయ‌న డిమాండ్ చేశారు. 

హిజాబ్ నిరాక‌రణ‌ను వ్య‌తిరేకిస్తూ బాలికలు వేసిన పిటిషన్‌పై కర్ణాటక హైకోర్టు ఫుల్ బెంచ్ రోజువారీగా విచారణ జరుపుతోంది. గ‌త వారం హిజాబ్ వివాదానికి సంబంధించిన అన్ని పిటిషన్ల పరిశీలనల‌ను న్యాయ స్థానం పెండింగ్‌లో ఉంచింది. తుది నిర్ణ‌యం వచ్చేంత వ‌ర‌కు కాలేజ్ ల‌లో ఎవ‌రూ హిజాబ్ లు, కాషాయ కండువాలు ధ‌రించ‌కూడ‌ద‌ని, ఎలాంటి మ‌తప‌రమైన దుస్తులు ధ‌రింకూడ‌ద‌ని ఆదేశించింది. 

క‌ర్నాట‌క‌లోని ఉడిపిలోని ఓ ప్రభుత్వ కాలేజీలో ఈ వివాదం గ‌త నెల‌లో మొద‌టి సారిగా వెలుగులోకి వ‌చ్చింది. కాలేజీ యూనిఫామ్ నిబంధనలను అతిక్రమించి ముస్లిం విద్యార్థులు హిజాబ్ ధరించి వస్తున్నారని ఇంకొందరు విద్యార్థులు వాదనలకు దిగారు. క్రమంగా అది పెద్ద వివాదంగా మారింది. క్రమంగా ఇది రాష్ట్రవ్యాప్తంగా మంటలు రాజేసింది. ఇది దేశ వ్యాప్తంగా ప్ర‌స్తుతం చ‌ర్చ‌నీయాంశంగా మారింది. ఈ హిజాబ్ వివాదం క‌ర్నాట‌క‌ను దాటి మిగితా రాష్ట్రాల్లోనూ వ్యాపిస్తోంది. కేంద్ర పాలిత ప్రాంతమైన పుదుచ్చేరిలో ఇలాంటి హిజాబ్ వివాదం వెలుగు చూసింది. పుదుచ్చేరి (puducherry)లోని అరియాంకుప్పంలోని ప్రభుత్వ పాఠశాలలో ఓ టీచ‌ర్ తరగతిలో విద్యార్థి హిజాబ్ వేసుకొని రావ‌డంతో అభ్యంతరం వ్య‌క్తం చేశారు. దీనిపై ఆందోళ‌న వ్య‌క్తం అవుతోంది. అలాగే మ‌ధ్య ప్ర‌దేశ్ (madya pradhesh)లో విద్యాశాఖ మంత్రి హిజాబ్ పై వ్యాఖ్య‌లు చేశారు. దీంతో అక్క‌డి ప్ర‌తిప‌క్షం ఆయ‌న‌పై విమ‌ర్శ‌లు గుప్పించింది.