దాదాపు రెండున్నర నెలలుగా నెలకొన్న హిజాబ్ వివాదం నేడు కొలిక్కిరానుంది. ఫిబ్రవరి 10వ తేదీ నుంచి హిజాబ్ వివాదంపై వాదనలు విన్న కర్ణాటక హైకోర్టు మంగళవారం తీర్పు వెలువరించనుంది. దీంతో శాంతి భద్రతల నేపథ్యంలో రాష్ట్రంలోని పలు ప్రాంతాల్లో స్కూళ్లకు, కాలేజీలకు ప్రభుత్వం సెలవు ప్రకటించింది.

హిజాబ్ (Hijab) వివాదంపై మంగ‌ళ‌వారం క‌ర్ణాట‌క హైకోర్టు (high court) తీర్పు ఇవ్వ‌నున్న నేప‌థ్యంలో నేడు స్కూల్స్ కు, కాలేజీల‌కు సెలవులు ప్ర‌క‌టించారు. తీర్పు వెలువడిన అనంత‌రం ఎలాంటి ఇబ్బందులు త‌లెత్త‌కుండా ముందు జాగ్ర‌త్త చ‌ర్య‌ల్లో భాగంగా ఉడిపి (Udupi), శివమొగ్గ (Shivamogga), దక్షిణ కన్నడ (Dakshina Kannada) ప్రాంతాల్లో స్థానిక అధికారులు అన్ని స్కూళ్ల‌ను, కాలేజీల‌ను మూసివేశారు. 

హిజాబ్ వివాదంపై కర్నాటక హైకోర్టు ఎలాంటి తీర్పు వెలువ‌రిస్తుందోన‌ని చాలా మంది ఆస‌క్తిగా ఎదురుచూస్తున్నారు. దాదాపు రెండున్న‌ర నెల‌ల నుంచి న‌లుగుతున్న ఈ స‌మ‌స్య ఈరోజు కొలిక్కి వచ్చే అవకాశం ఉంది. కోర్టు ఈ తీర్పును ఫిబ్ర‌వ‌రి 25వ తేదీన రిజ‌ర్వ్ చేసింది. కాగా తీర్పు నేప‌థ్యంలో స్కూళ్లు, కాలేజీలు మూసివేయ‌డానికి ముందే ఎలాంటి అవాంఛ‌నీయ ఘ‌ట‌న‌లు చోటు చేసుకోకుండా అనేక ప్రాంతాల్లో సెక్ష‌న్ 144 విధించారు. 

నేడు స్కూళ్లకు, కాలేజీలు సెలువులు ప్రక‌టించ‌డంతో పాటుగా ఈ ప్రాంతంలో జ‌రిగే ఇంట‌ర్న‌ల్ (internal) ప‌రీక్ష‌ల‌ను కూడా వాయిదా వేశారు. కొత్త తేదీల‌ను త్వ‌ర‌లోనే ప్ర‌క‌టిస్తారు. అయితే external ప‌రీక్ష‌లు మాత్రం షెడ్యూల్ ప్ర‌కారం జ‌రుగుతాయి. అయితే క‌ర్నాట‌క‌లో బెంగళూరు అతి ముఖ్య‌మైన ప‌ట్ట‌ణం కాబ‌ట్టి ఇక్క‌డ కూడా విద్యా సంస్థ‌ల‌ను మూసివేస్తార‌ని భావించారు. కానీ ప్ర‌భుత్వం విడుద‌ల చేసిన ప్ర‌క‌ట‌న‌లో ఈ న‌గ‌రం పేరు లేక‌పోవ‌డంతో కేవ‌లం 144 సెక్ష‌న్ మాత్ర‌మే విధించారు. 

జనవరి 1న కర్ణాటకలోని ఉడిపిలో ఉన్న ప్రభుత్వ కాలేజీలో ఈ హిజాబ్ వివాదం రాజుకుంది. ఆరుగురు ముస్లిం బాలిక‌లు హిజాబ్ ధ‌రించి క్లాసుల‌కు హాజ‌రయ్యారు. దీనిని కాలేజీ మేనేజ్మెంట్ ఒప్పుకోలేదు. దీంతో ఈ వివాదం మొద‌లైంది. ముస్లిం బాలికల హిజాబ్ ధ‌రించి రావ‌డంతో కొంత మంది హిందూ విద్యార్థులు కాషాయ కండువాలు ధ‌రించి క్లాసులకు రావ‌డం మొద‌లు పెట్టింది. దీంతో రెండు ఉడిపిలో వ‌ర్గాల మ‌ధ్య మొద‌లైన ఈ స‌మ‌స్య రాష్ట్రం మొత్తం వ్యాపించింది. ఇది పెద్ద ఆందోళ‌న‌కు దారి తీసింది. 

అయితే ఫిబ్రవరి 9న ఉడిపికి చెందిన ముస్లిం బాలిక‌లు కోర్టుకు వెళ్లారు. హిజాబ్ ధ‌రించేందుకు అనుమ‌తి ఇవ్వాల‌ని పిటిష‌న్ దాఖ‌లు చేశారు. దీనిని విచారించ‌డానికి కర్ణాటక హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి రితూ రాజ్ అవస్థి, జస్టిస్ జెఎం ఖాజీ, జస్టిస్ కృష్ణ ఎస్ దీక్షిత్‌లతో కూడిన పూర్తి బెంచ్ ఏర్పాటు అయ్యింది. ఫిబ్రవరి 10వ తేదీ నుంచి హైకోర్టులోని త్రిసభ్య ధర్మాసనం ఈ కేసును రోజూ విచారించింది. ఆందోళనల కారణంగా మూతపడిన విద్యాసంస్థలను తిరిగి తెరవాలని కర్ణాటక ప్రభుత్వాన్ని ఆదేశిస్తూ ధర్మాసనం మధ్యంతర ఉత్తర్వులు జారీ చేసింది. తుది తీర్పు వెలువడే వరకు విద్యార్థులు క్లాస్‌రూమ్‌లో హిజాబ్ లేదా కాషాయ కండువాలు ధరించడాన్ని కూడా కోర్టు నిషేధించింది.

హిజాబ్ వివాదంపై 11 రోజుల పాటు హైకోర్టు విచార‌ణ జ‌రిపింది. అనంతరం హైకోర్టు ఫిబ్రవరి 25న తీర్పును రిజర్వ్ చేసింది. కాగా ఈ తీర్పు వెల‌వ‌డే వారం రోజుల ముందు నుంచి బెంగ‌ళూరు వంటి ముఖ్య ప‌ట్ట‌ణాల్లో పెద్ద స‌మావేశాల‌ను క‌ర్ణాక‌ట ప్ర‌భుత్వం నిషేదించింది. నేడు ఉద‌యం 10.30 గంట‌ల‌కు కోర్టు తీర్పు వెలువ‌రించ‌నుంది.