హిజాబ్ వివాదంపై కర్ణాటక హైకోర్టు మంగళవారం నాడు సంచలన తీర్పు ఇచ్చింది
బెంగుళూరు: Hijab వివాదంపై Karnataka High Court మంగళవారం నాడు సంచలన తీర్పు ఇచ్చింది. విద్యా సంస్థల్లో హిజాబ్ తప్పని సరికాదని హైకోర్టు స్పష్టం చేసింది. విద్యా సంస్థల్లో స్కూల్ Uniform ను ధరించాల్సిందేనని హైకోర్టు స్పష్టం చేసింది. హిజాబ్ ను నిషేధించాలని సవాల్ చేస్తూ దాఖలు చేసిన పిటిషన్లను హైకోర్టు కొట్టివేసింది. మరో వైపు యూనిఫామ్ పై విద్యార్ధులు అభ్యంతరం చెప్పకూడదని కూడా హైకోర్టు తేల్చి చెప్పింది.
హిజాబ్ వివాదం నేపథ్యంలో గత మాసంలో హిజాబ్ తో పాటు, కాషాయ రంగు కండువాలు ధరించి విద్యా సంస్థలకు రావడంపై నిషేధం విధించింది. విద్యా సంస్థల్లోకి హిజాబ్ వేసుకొని రావడంపై వివాదం చేలరేగడంతో ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకొంది.
హిజాబ్ ధరించడం రాజ్యాంగం కల్పించిన ప్రాథమిక హక్కు అంటూ సుమారు 12 మంది ముస్లిం విద్యార్ధులతో పాటు పలువురు కోర్టులో పిటిషన్లు దాఖలు చేశారు. ఈ విషయమై 11 రోజుల విచారణ అనంతరం హైకోర్టు ఫిబ్రవరి 25న తీర్పును రిజర్వ్ చేసింది. ఇవాళ ఈ విషయమై హైకోర్టు తన తుది తీర్పును వెల్లడించింది.
జనవరి 1న కర్ణాటకలోని ఉడిపిలో ఉన్న ప్రభుత్వ కాలేజీలో ఈ హిజాబ్ వివాదం రాజుకుంది. ఆరుగురు ఓ వర్గానికి చెందిన బాలికలు హిజాబ్ ధరించి క్లాసులకు హాజరయ్యారు. దీనిని కాలేజీ మేనేజ్‌మెంట్ ఒప్పుకోలేదు. దీంతో ఈ వివాదం మొదలైంది. ముస్లిం బాలికల హిజాబ్ ధరించి రావడంతో కొంత మంది మరో వర్గం విద్యార్థులు కాషాయ కండువాలు ధరించి క్లాసులకు రావడం మొదలు పెట్టింది. దీంతో రెండు ఉడిపిలో వర్గాల మధ్య మొదలైన ఈ సమస్య రాష్ట్రం మొత్తం వ్యాపించింది. ఇది పెద్ద ఆందోళనకు దారి తీసింది.
అయితే ఫిబ్రవరి 9న ఉడిపికి చెందిన ముస్లిం బాలికలు కోర్టుకు వెళ్లారు. హిజాబ్ ధరించేందుకు అనుమతి ఇవ్వాలని పిటిషన్ దాఖలు చేశారు. దీనిని విచారించడానికి కర్ణాటక హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి రితూ రాజ్ అవస్థి, జస్టిస్ జెఎం ఖాజీ, జస్టిస్ కృష్ణ ఎస్ దీక్షిత్‌లతో కూడిన పూర్తి బెంచ్ ఏర్పాటు అయ్యింది. ఫిబ్రవరి 10వ తేదీ నుంచి హైకోర్టులోని త్రిసభ్య ధర్మాసనం ఈ కేసును రోజూ విచారించింది. ఆందోళనల కారణంగా మూతపడిన విద్యాసంస్థలను తిరిగి తెరవాలని కర్ణాటక ప్రభుత్వాన్ని ఆదేశిస్తూ ధర్మాసనం మధ్యంతర ఉత్తర్వులు జారీ చేసింది. తుది తీర్పు వెలువడే వరకు విద్యార్థులు క్లాస్‌రూమ్‌లో హిజాబ్ లేదా కాషాయ కండువాలు ధరించడాన్ని కూడా కోర్టు నిషేధించింది.
హిజాబ్ వివాదంపై 11 రోజుల పాటు హైకోర్టు విచారణ జరిపింది. అనంతరం హైకోర్టు ఫిబ్రవరి 25న తీర్పును రిజర్వ్ చేసింది. కాగా ఈ తీర్పు వెలవడే వారం రోజుల ముందు నుంచి బెంగళూరు వంటి ముఖ్య పట్టణాల్లో పెద్ద సమావేశాలను కర్ణాకట ప్రభుత్వం నిషేదించింది. రాష్ట్రంలో శాంతి భద్రతలకు విఘాతం కల్గిస్తున్నందున వివాదానికి కారణమైన దుస్తులను ప్రభుత్వం ఈ ఏడాది పిబ్రవరి 5న నిషేధం విధించిన విషయం తెలిసిందే.
