Karnataka hijab row: హిజాబ్ వివాదంపై కర్ణాటక ఏఐసీసీ ప్రధాన కార్యదర్శి రణదీప్ చేసిన వ్యాఖ్య‌ల‌పై  క‌ర్ణాట‌క బీజేపీ ఆగ్ర‌హం వ్య‌క్తం చేసింది. ఆధునిక తరగతి గదులలో సంప్ర‌దాయ హిజాబ్ కు స్థానం ఎక్క‌డ ఉంది ? అని సూర్జేవాలా ను నిలదీసింది క‌ర్ణాట‌క బీజేపీ.  

Karnataka hijab row: కర్నాట‌క‌లో ప్రారంభ‌మైన హిజాబ్ వివాదం దేశ‌వ్యాప్త‌మై ప్రకంపనలు సృష్టిస్తుంది. ప్ర‌స్తుతం కర్ణాటక పేరు అంతర్జాతీయంగా మారుమోగుతోంది. ఈ అంశంపై రాజకీయ నాయకులు తమదైన శైలిలో స్పందిస్తూ వివాదంలో చిక్కుకుంటున్నారు. కర్ణాటక కాంగ్రెస్ ఎమ్మెల్యే ఎమ్మెల్యే జమీర్ అహ్మద్ చేసిన వ్యాఖ్యలపై తీవ్ర దుమారం రేగుతోంది. ఎమ్మెల్యే జమీర్ అహ్మద్ మాట్లాడుతూ.. హిజాబ్ తప్పనిసరి కాదని, కానీ, ఈ ఆచారాన్ని చాలా సంవత్సరాల నుంచి ఆచరిస్తున్నారన్నారు. అంతేకాదు, మహిళలు తమ అందాన్ని దాచుకోకపోవడం వల్లే అత్యాచారాలకు గురవుతారని సంచలన వ్యాఖ్యలు చేశారు. ఈ వ్యాఖ్య‌లపై తీవ్ర దుమారం రేగుతోంది. 

దీంతో .. ఎమ్మెల్యే జమీర్ అహ్మద్ వ్యాఖ్యల‌పై కర్ణాటక ఏఐసీసీ ప్రధాన కార్యదర్శి రణదీప్‌ సింగ్‌ సూర్జేవాలా స్పందించారు. త‌న ట్విట్ట‌ర్ వేదిక‌గా అభిప్రాయాన్ని పంచుకున్నారు. ఆధునిక భారతదేశంలో గానీ, మన సమాజంలో గానీ మహిళలపై సంకుచిత, తిరోగమన అభిప్రాయాలకు చోటు లేదని అన్నారు. ఇలాంటి సంకుచిత అభిప్రాయాలు బిజెపి నాయకులే ప్రత్యేకించబడ్డాయి. గ‌తంలోఆదిత్యనాథ్, మనోహర్ లాల్ ఖట్టర్, ఇతరులు బీజేపీ నేత‌లు విపరీతమైన వ్యాఖ్యలు చేశారు. భారతీయ‌ మహిళలు మతం లేదా కులంతో సంబంధం లేకుండా ప్రాచీన కాలం నుండి శక్తికి ప్రతినిధిగా నిలుస్తున్నారు. వారు ప్రతి రంగంలో పట్టుదల, స్వాతంత్య్రం, సంకల్పంతో భారతదేశం గర్వించేలా చేశారు. ఇప్ప‌టికైనా సంప్రదాయ వాద ఆలోచనా ధోరణులున్న ప్ర‌తి నాయ‌కుడు మారాల్సిన సమయం ఆసన్నమైందని అని సుర్జేవాలా ట్వీట్ చేశారు.

రణదీప్‌ సింగ్‌ సూర్జేవాలా చేసిన‌ ట్వీట్ పై క‌ర్ణాట‌క బీజేపీ ఆగ్ర‌హం వ్య‌క్తం చేసింది. అదే ట్విట్టర్ వేదికగా సూర్జేవాలా ను నిలదీసింది క‌ర్ణాట‌క బీజేపీ. మిస్టర్ @రణదీప్‌ సింగ్‌ సూర్జేవాలా.. ఆధునిక తరగతి గదులలో సంప్ర‌దాయ హిజాబ్ కు స్థానం ఎక్క‌డ ఉంది ? విద్యాసంస్థ‌ల్లో హిజాబ్ ధరించే సంకుచిత, తిరోగమన పద్ధతిని కాంగ్రెస్ ఎందుకు సమర్థిస్తోంది? హిజాబ్‌ను సమర్ధించడం ద్వారా సోనియా నేతృత్వంలోని కాంగ్రెస్.. వారి(ముస్లీం విద్యార్థినుల‌) భవిష్యత్తును ప్రమాదంలో పడ‌వేసిన‌ట్టు కాదా? అని ప్ర‌శ్నించింది.