Karnataka hijab row: కర్నాటకలోని పలు విద్యాసంస్థల్లో రాజుకున్న హిజాబ్ (Hijab) వివాదం.. ఇప్పుడు దేశవ్యాప్తంగా రాజకీయ దుమారం రేపుతున్నది. కర్నాటక నుంచి హిజాబ్ వివాదం ఇతర రాష్ట్రాలకు పాకుతోంది. ముఖ్యంగా మధ్యప్రదేశ్, పుదుచ్చేరిలలోనూ ఉద్రిక్త పరిస్థితులు నెలకొంటున్నాయి.
Karnataka hijab row: కర్నాటకలోని పలు విద్యాసంస్థల్లో రాజుకున్న హిజాబ్ (Hijab) వివాదం.. ఇప్పుడు దేశవ్యాప్తంగా రాజకీయ దుమారం రేపుతున్నది. కర్నాటక నుంచి హిజాబ్ వివాదం ఇతర రాష్ట్రాలకు పాకుతోంది. ముఖ్యంగా మధ్యప్రదేశ్, పుదుచ్చేరిలలోనూ ఉద్రిక్త పరిస్థితులు నెలకొంటున్నాయి. ఈ నేపథ్యంలోనే మధ్యప్రదేశ్ లోని ఓ విద్యాసంస్థ.. ప్రాంగణంలోకి మతపరమైన సంబంధం కలిగిన దుస్తులు ధరించి రావడానికి అనుమతి లేదని పేర్కొంటూ సర్క్యూలర్ ను సైతం జారీ చేసింది. మధ్యప్రదేశ్‌లోని దతియా జిల్లాలోని అగ్రని ప్రభుత్వ అటానమస్ పీజీ కళాశాల సోమవారం విద్యార్థులు 'మతానికి సంబంధించిన' దుస్తులు ధరించకుండా ఉండాలని కోరుతూ సర్క్యులర్ జారీ చేసింది. కాలేజ్ ప్రాంగణంలో హిజాబ్ ధరించిన ఇద్దరు విద్యార్థులు రావడంతో పలువురు యువకులు.. కాషాయ కండువాలు ధరించి నిరసన తెలిపారు. జై శ్రీరామ్ అంటూ నినాదాలు చేశారు. ఈ క్రమంలోనే సదరు కాళాశాల యాజమాన్యం సర్క్యూలర్ జారీ చేసింది. గతంలో ఎంకామ్ విద్యార్థిని కళాశాల ఆవరణలో హిజాబ్ ధరించడంపై అభ్యంతరాలు వ్యక్తమయ్యాయి.
పుదుచ్చేరి లోనూ..
గత వారం, పుదుచ్చేరిలో అరియాంకుప్పంలోని ఒక ప్రభుత్వ పాఠశాలలో హిజాబ్ ధరించి తరగతికి హాజరుకాకుండా ఒక ముస్లిం బాలికను అడ్డుకోవడంతో హిజాబ్ వివాదం చెలరేగింది. అనంతరం ఎస్‌ఎఫ్‌ఐ కార్యకర్తలు పాఠశాలకు చేరుకుని ఘటనపై ఆరా తీశారు. విద్యార్థిని గత మూడేళ్లుగా హిజాబ్ ధరిస్తోందని పేర్కొన్నారు. అయితే, విద్యార్థి పాఠశాల ప్రాంగణం వరకు మాత్రమే హిజాబ్ ధరించేవారని, ఇప్పుడు ఆమె దానిని ధరించి తరగతులకు హాజరయ్యిందని పాఠశాల అధికారులు పేర్కొన్నారు. ఫిర్యాదును స్వీకరించిన తర్వాత, స్కూల్ ఎడ్యుకేషన్ డైరెక్టరేట్ ఈ సంఘటనపై విచారణ జరపాలని పాఠశాల నిర్వాహకులను కోరింది.
ఇదిలావుండగా, మొదటగా హిజాబ్ వివాదం చెలరేగిన కర్నాకలో పలు చోట్ల ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. శిమోగాలో పలువురు విద్యార్థులు హిజాబ్ ను తొలగించడానికి నిరాకరించారు. అయితే, పలు పాఠశాలలు, కాలేజీలు హిజాబ్ ధరించే విషయంపై కఠినంగా చర్యలు తీసుకోవడంతో.. హిజాబ్ తీసివేయడానికి కొందరు విద్యార్థులు నిరాకరించడంతో వారిని ప్రాంగణంలోకి అనుమతించలేదు. దీంతో వారు తిరిగి ఇంటికి వెళ్లాల్సి వచ్చింది. సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న ఓ వీడియోలో.. హిజాబ్ ధరించి వచ్చిన ముస్లిం విద్యార్థుల బృందాన్ని కళాశాల అధికారులు తిప్పి పంపారు. మహమ్మద్ హబీబ్ ఉర్ రెహ్మాన్ అనే ట్విట్టర్ యూజర్ ఈ సంఘటనను ముస్లింలపై చట్టబద్ధం చేసిన అణచివేతగా పేర్కొన్నారు. “హిజాబీ ముస్లిం విద్యార్థులు హిజాబ్‌ని తీసివేయడానికి నిరాకరించారు. షిమోగాలోని క్యాంపస్‌ను విడిచిపెట్టారు. కర్ణాటక హైకోర్టు మధ్యంతర ఉత్తర్వులు మత స్వేచ్ఛకు విరుద్ధం. ఇది ముస్లింలపై చట్టబద్ధత కల్పించిన అణచివేత. ముస్లిం మహిళలు తమ విశ్వాసం మరియు విద్య రెండింటిలో ఒకటి ఎంచుకోవాలని కోరారు. అంటూ ట్వీట్ చేశారు.
కాగా, ముస్లిం బాలికలు తరగతి గదుల్లో హిజాబ్ ధరించడాన్ని వ్యతిరేకిస్తూ పలువురు విద్యార్థులు నిరసన వ్యక్తం చేసిన తర్వాత కొన్ని వారాల క్రితం కర్నాటకలో హిజాబ్ అంశం ఉద్రిక్తలకు దారితీసింది. ఆ తర్వాత రాష్ట్ర పరిపాలన కళాశాలలు, పాఠశాలల్లో మతపరమైన దుస్తులు ధరించరాదని నిబంధనను జారీ చేసింది. ప్రస్తుతం హిజాబ్ వ్యవహారాన్ని కర్నాటక హైకోర్టు విచారణ జరుపుతోంది. హైకోర్టు మధ్యంతర ఉత్తర్వుల నేపథ్యంలో కర్నాటకలో మూతపడిన విద్యాసంస్థలు సోమవారం నుంచి తిరిగి ప్రారంభమయ్యాయి.
