భారత్- చైనా సరిహద్దుల్లో మరోసారి యుద్ధ వాతావరణం నెలకొంది. వాస్తవాధీన రేఖ వెంబడి భారత్ భారీగా యుద్ధ ట్యాంకులను మోహరిస్తోంది. తూర్పు లఢఖ్‌లోని చుమర్-దెమ్‌చోక్ ప్రాంతానికి ట్యాంకులు చేరుకుంటున్నాయి.

చుమర్-దెమ్‌చోక్ లైన్ ఆఫ్ కంట్రోల్ సమీపంలో టీ-90 బీష్మ యుద్ధ ట్యాంకులను నడిపింది సైన్యం. శీతాకాలంలో యుద్ధ ట్యాంకుల పని విధానంలో ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా ఉండటానికి మూడు రకాల ఇంధనాలును ఉపయోగిస్తోంది ఇండియన్ ఆర్మీ.

మైనస్ 40 డిగ్రీల సెల్సియస్ ఉష్ణోగ్రతలో పనిచేయగల బీఎంపీ-2 వాహనాలు, టీ-90, టీ-72 ట్యాంకులు చైనాపై గర్జించేందుకు సిద్ధంగా ఉన్నాయి. మరోవైపు చైనా దళాలు భారత్‌నను ఏమాత్రం తేలిగ్గా తీసుకోకుండా అప్రమత్తంగా ఉండాలని చైనా సైన్యంలో పనిచేసిన మాజీ లెఫ్టినెంట్ జనరల్ వాంగ్ హాంగ్ యాంగ్ హెచ్చరించారు.

ఏ మాత్రం నిర్లక్ష్యంగా ఉన్నా  భారత్ షాక్ ఇస్తుందని ఆయన పేర్కొన్నారు. చైనా దళాలకు పోటీగా భారత్ కూడా భారీ సంఖ్యలో సైన్యాన్ని పెంచిందని యాంగ్ వెల్లడించారు. వాస్తవానికి ఎల్ఏసీ నిర్వహణకు 50 వేల మంది సరిపోతారని.. కానీ భారత్ దీనికి అదనంగా మరో లక్షమందిని తరలించిందని ఆయన పేర్కొన్నారు.