ఎన్నికల వేళ అయోధ్యలో రామమందిరం నిర్మాణం వ్యవహారం మరోసారి రాజుకుంది. రామమందిర నిర్మాణామే లక్ష్యంగా విశ్వహిందూ పరిషత్, శివసేన చేపట్టిన ధర్మసభ నేపధ్యంలో నగరంలో ఉద్రిక్తత పరిస్థితులు చోటుచేసుకున్నాయి.

దాదాపు 30 వేల మంది కరసేవకులతో పాటు శివసేన అధినేత ఉద్ధవ్ థాక్రే చేరుకున్నారు. 1992 డిసెంబర్ 6వ తేదీన వివాదాస్పద బాబ్రీ మసీదును కూల్చివేసిన ఘటన పునరావృతమవుతుందనే భయంతో అయోధ్యలోని వ్యాపారులు హిందూ సంస్థలు తలపెట్టిన ఆందోళనను బాయ్‌కాట్ చేశారు.

దీంతో అక్కడ ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా అక్కడి పరిసరాల్లో పోలీసులు 144 సెక్షన్ విధించారు. ఆలయం సమీపంలో సీఆర్‌పీఎఫ్, పీఏసీ, సివిల్ పోలీసులును మోహరించారు.

రామాలయ నిర్మాణం కొరకు పార్లమెంటు ద్వారా ఆర్డినెన్స్ తీసుకురావాలని శివసేన డిమాండ్ చేసింది. అయితే లోక్‌సభ ఎన్నికలకు సమయం దగ్గర పడుతుండటంతో బీజేపీతో పాటు హిందుత్వ సంస్థలు రామజపాన్ని అందుకున్నాయని ప్రతిపక్షాలు మండిపడుతున్నాయి.