మహారాష్ట్ర రాజకీయాలు హనుమాన్ చాలీసా పఠనం చుట్టూ తిరుగుతున్నాయి. శివసేన చీఫ్ ఉద్ధవ్ ఠాక్రే నివాసం మాతో శ్రీ ముందు తాము హనుమాన్ చాలీసా పఠిస్తామని సవాల్ విసరడంతో దుమారం రేగింది. శివసేన కార్యకర్తలు ఇటు మాతో శ్రీ ముందు.. అటు సవాల్ విసిరిన నవనీత్ రాణా, ఆమె భర్త రవి రాణాల ఇంటి ముందు ఆందోళనలకు దిగింది. 

ముంబయి: మహారాష్ట్ర రాజకీయాలు ఒక్కసారిగా వేడెక్కాయి. ఎంపీ నవనీత్ రాణా, ఆమె భర్త ఎమ్మెల్యే రవి రాణాలు సీఎం ఉద్ధవ్ ఠాక్రే ప్రైవేటు రెసిడెన్స్ ‘మాతో శ్రీ’ ముందు హనుమాన్ చాలీసా పఠిస్తామని చాలెంజ్ చేయడంతో హైడ్రామాకు తెరలేసింది. అటు మాతో శ్రీ ముందు, ఇటు నవనీత్ రాణా, రవి రాణాల అపార్ట్‌మెంట్ నివాసం ముందు శివసేన కార్యకర్తలు (Shiv Sena Workers) గుమిగూడారు. నవనీత్ రాణా దంపతుల నివాసం ముందు పెద్ద ఎత్తున నినాదాలు చేస్తున్నారు. ముంబయి సబర్బన్ ఖార్‌లోని వారి నివాసం ముందు
పోలీసులు ఏర్పాటు చేసిన బారికేడ్లను బద్దలు కొట్టుకుని కొందరు శివసేన కార్యకర్తలు లోపలికి దూసుకెళ్లే ప్రయత్నం చేశారు. అక్కడే ఉన్న పోలీసులు పరిస్థితులను అదుపులోకి తెచ్చారు.

ఇదిలా ఉండగా, మాతో శ్రీ ఇంటి ముందు కూడా సెక్యూరిటీని పెంచారు. ఉద్ధవ్ ఠాక్రే నివాసం ముందు పెద్ద ఎత్తున జనం గుమిగూడకుండా బారికేడ్లను ఏర్పాటు చేశారు. అయినప్పటికీ శివసేన కార్యకర్తలు వచ్చి స్వతంత్ర ఎంపీ నవనీత్ రాణా, స్వతంత్ర ఎమ్మెల్యే రవి రాణాలకు వ్యతిరేకంగా నిరసనలు చేస్తున్నారు.

హనుమాన్ జయంతి రోజున సీఎం ఉద్ధవ్ ఠాక్రే హనుమాన్ చాలీసాను పఠించాలని ఎమ్మెల్యే రవి రాణా సవాల్ విసిరారు. ఒక వేళ సీఎం ఠాక్రే హనుమాన్ చాలీసాను పఠించకుంటే.. తాము ఆయన ఇంటి ముందు హనుమాన్ చాలీసాను పఠిస్తామని పేర్కొన్నారు. ఈ సవాల్‌ను పునరుద్ఘాటించడంతో రాష్ట్రంలో ఉద్రిక్తతలు ఏర్పడ్డాయి. రాష్ట్రంలో లా అండ్ ఆర్డర్ కాపాడటానికి పోలీసులు రంగంలోకి దిగారు. నవనీత్, రవి దంపతులకు ముంబయి పోలీసులు నోటీసులు జారీ చేశారు.

Scroll to load tweet…

శివసేన కార్యకర్తల ఆందోళనలు, పోలీసుల నోటీసులనూ లెక్క చేయకుండా ఆ దంపతులను తమ సవాలును పునరుద్ఘాటించారు. తమ ప్రణాళికలను భంగం చేసి అవమానపరచాలని మహారాష్ట్ర సీఎం ఉద్ధవ్ ఠాక్రే ఆదేశాలు ఇచ్చారని నవనీత్ రాణా ఆరోపించారు. వారు బారికేడ్లను ధ్వంసం చేస్తున్నారని వివరించారు. తాను బయటకు వెళ్లుతారని, మాతో శ్రీ (Mato Shree) ముందు హనుమాన్ చాలీసాను పఠిస్తానని పునరుద్ఘాటిస్తున్నట్టు ఆమె పేర్కొన్నారు.

కాగా, ఈ ఇద్దరు స్వతంత్ర చట్టసభ్యులను కొందరు ఆడిస్తున్నారని శివసేన నేతలు ఆరోపణలు సంధించారు. శివసేన సారథ్యంలోని సంకీర్ణ ప్రభుత్వాన్ని ఇరుకున పెట్టడానికి బీజేపీ కుట్రలు పన్నుతున్నదని అన్నారు. అందుకే ఆ పార్టీ ఈ చట్టసభ్యులతోపాటు మహారాష్ట్ర నవనిర్మాణ్ సేనా చీఫ్ రాజ్ థాక్రేనూ పావులుగా వినియోగించుకుంటున్నదని వివరించారు. కానీ, తాము, శివసేన కార్యకర్తుల మాతో శ్రీని కాపాడుకుంటామని శివసేన ఎంపీ అనిల్ దేశాయ్ అన్నారు.

శివసేన సీనియర్ లీడర్ సంజయ్ రౌత్.. నవనీత్ రాణా, రవి రాణాలను విమర్శించారు. వారు బంటీ ఔర్ బబ్లీ వంటి వారని ఓ హిందీ సినిమాను పేర్కొంటూ సీరియస్ అయ్యారు. మోసపూరిత డ్రామాలో ఈ రాణా వంటి వారు పాత్రధారులు అని వివరించారు. బీజేపీ స్టంట్‌ను వీరు అమలు చేస్తున్నారని తెలిపారు. ఈ వ్యవహారాన్ని ప్రజలు సీరియస్‌గా తీసుకోబోరని పేర్కొన్నారు.