బెంగాల్ రాష్ట్రంలోని బీర్మూమ్ లో ఎనిమిది మంది సజీవ దహనమైన ఘటనపై దర్యాప్తును సీబీఐకి కోల్‌కత్తా హైకోర్టు ఆదేశించింది.
కోల్‌కత్తా: పశ్చిమ బెంగాల్ రాష్ట్రంలోని Birbhum లో ఎనిమిది మందిని సజీవ దహనం కేసు విచారణను CBIకి అప్పగిస్తూ Calcutta High Court శుక్రవారం నాడు ఆదేశించింది. ఈ ఘటనపై కోల్‌కత్తా హైకోర్టు సుమోటోగా విచారణ నిర్వహిస్తున్న విషయం తెలిసిందే. ఈ కేసు విచారణను సీబీఐకి అప్పగించవద్దని మమత బెనర్జీ సర్కార్ హైకోర్టును కోరింది. కానీ కోల్‌కత్తా హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి ప్రకాష్ శ్రీవాస్తవ, జస్టిస్ ఆర్ భరద్వాజ్ లతో కూడిన డివిజన్ బెంచ్ ఈ ఆదేశాలను జారీ చేసింది. ఏప్రిల్ 7వ తేదీ లోపుగా నివేదికను ఇవ్వాలని కూడా ఆదేశించింది.
సజీవ దహనమైన వారిలో ఎనిమిది మందిలో మహిళలు, పిల్లలున్నారు. ఈ ఘటనను విచారించేందుకు Mamata Banerjee సర్కార్ ప్రత్యేక దర్యాప్తు బృందాన్ని ఏర్పాటు చేసింది. అయితే ఇప్పటివరకు ప్రత్యేక దర్యాప్తు బృందం సేకరించిన సమాచారాన్ని సీబీఐకి ఇవ్వాల్సి ఉంది.
ఈ ఘటనకు పాల్పడిన నిందితులు లొంగిపోకపోతే వారిపై వేటు పడుతుందని సీఎం మమత బెనర్జీ హెచ్చరించారు. ఈ ఘటన వెనుక ఏదో ఉందని సీఎం మమత అనుమానం వ్యక్తం చేశారు. సంఘటన స్థలాన్ని మమత బెనర్జీ పరిశీలించారు. బాధిత కుటుంబాలను పరామర్శించారు. TMC లోని రెండు వర్గాల మధ్య ఆధిపత్య పోరులో భాగంగానే ఈ ఎనిమిది మంది హత్యలు జరిగాయనే ప్రచారం కూడా లేకపోలేదు. ఈ ఘటనను వాడుకొని రాజకీయంగా తమ ప్రభుత్వాన్ని అప్రదిష్టపాల్జేసేందుకు ప్రత్యర్ధులు ప్రయత్నిస్తున్నారని మమత బెనర్జీ విమర్శలు చేశారు.
బీర్బూమ్ లో స్థానిక టీఎంసీ నేత బాద్ షేక్ బాంబు దాడిలో మరణించారు. ఆ తర్వాత ప్రతీకార దాడిలో ఎనిమిది మంది మరణించారు. రాంపూర్ హాట్ పట్టణానికి సమీపంలోని బొగ్తుయ్ గ్రామంలో ఆరుగురు మహిళలు, ఇద్దరు పిల్లలను వారి ఇళ్లలో బంధించి సజీవ దహనం చేశారు. ఒక్క రోజు తర్వాత కాలిపోయిన మృత దేహాలను గుర్తించారు. సజీవ దహనమైన వారంతా ఒకే కుటుంబానికి చెందినవారుగా స్థానికులు చెబుతున్నారు.
