Gujarat bridge accident: గుజరాత్ లోని మచ్చునదిపై ఉన్న మోర్బీ కేబుల్ బ్రిడ్జి అక్టోబర్ 30న కూలిపోయింది. ఈ దుర్ఘటనలో దాదాపు 140 మంది ప్రాణాలు కోల్పోయారని రిపోర్టులు పేర్కొంటున్నాయి. ఈ ఘటనపై పూర్తి స్థాయి నివేదిక ఇవ్వాలంటూ గుజరాత్ ప్రభుత్వాన్ని హైకోర్టు నోటీసులు జారీ చేసింది.
Gujarat bridge accident: మోర్బీ బ్రిడ్జి కూలిన ఘటనపై గుజరాత్ హైకోర్టు సుమోటోగా విచారణ చేపట్టింది. ఈ క్రమంలోనే రాష్ట్ర హోం శాఖ, అర్బన్ హౌసింగ్ డిపార్ట్‌మెంట్, మోర్బీ మున్సిపాలిటీ, రాష్ట్ర మానవ హక్కుల కమిషన్‌తో సహా రాష్ట్ర ప్రభుత్వ అధికారులకు నోటీసు జారీ చేసింది. దాదాపు 140 మందికి పైగా ప్రాణాలను బలిగొన్న మోర్బీ ప్రమాదంపై వారంలోగా నివేదిక ఇవ్వాలని హైకోర్టు రాష్ట్రాన్ని ఆదేశాలు జారీ చేసింది. కాగా, గుజరాత్ లోని మచ్చునదిపై ఉన్న మోర్బీ కేబుల్ బ్రిడ్జి అక్టోబర్ 30న కూలిపోయింది. ఈ దుర్ఘటనలో దాదాపు 140 మంది ప్రాణాలు కోల్పోయారని రిపోర్టులు పేర్కొంటున్నాయి. చనిపోయిన వారిలో 40 మందికి పైగా చిన్నారులు ఉన్నారు. ఈ ప్రమాదం ఇటీవలి కాలంలో దేశం చూసిన అత్యంత భయంకరమైన విపత్తు. ప్రమాదం జరిగినప్పుడు ప్రధాని నరేంద్రమోడీ తన సొంత రాష్ట్రంలోనే పర్యటిస్తున్నారు. రెండు రోజుల తర్వాత ఘటనా స్థలాన్ని సందర్శించి గాయపడిన వారందరినీ ఆయన పరామర్శించారు.
కాగా, అక్టోబర్ 30న మోర్బీ కేబుల్ బ్రిడ్జి కూలిన దుర్ఘటనలో ప్రాణాలు కోల్పోయిన వారి ఆత్మలకు నివాళులర్పిస్తూ హైకోర్టు సోమవారం రెండు నిమిషాలు మౌనం పాటించింది. రాష్ట్ర ప్రభుత్వం సహా పలువురికి నోటీసులు జారీ చేసిన హైకోర్టు తదుపరి విచారణ తేదీని నిర్ణయించిన నవంబర్ 14లోగా నివేదికను కోర్టుకు సమర్పించాలని చీఫ్ జస్టిస్ అరవింద్ కుమార్, జస్టిస్ అశుతోష్ శాస్త్రిలతో కూడిన డివిజన్ బెంచ్ పేర్కొంది. అక్టోబర్ 31న ప్రచురితమైన వార్తాపత్రిక నివేదిక ఆధారంగా ఈ ఘటనపై న్యాయస్థానం సుమోటోగా (స్వంతంగా) విచారణ చేపట్టిందని చీఫ్ జస్టిస్ కుమార్ తెలిపారు. కాగా, చాలా ఏండ్ల క్రితం నిర్మించిన ఈ మోర్బీ వేలాడే వంతెన పునురుద్ధరణ, ఇతర పనులు పూర్తియిన తర్వాత తెరిచారు. వారాంతంలో పండుగ సందర్భంగా చాలా మంది అక్కడకు చేరుకున్నారు. ఈ క్రమంలోనే అది కూలిపోవడంతో ప్రాణనష్టం అధికంగా సంభవించింది. దీని మెయింటెనెన్స్‌కు బాధ్యత వహించే ఓరేవా గ్రూప్‌కు చెందిన వారితో సహా పలువురిని ఇప్పటికే పోలీసులు అరెస్టు చేశారు. దీనిపై విచారణ జరుపుతున్నామని తెలిపారు. అయితే, ఈ ఘటనపై జ్యుడిషియల్ విచారణ జరిపించాలని డిమాండ్లు వస్తున్నాయి.
ఇదిలా ఉండగా, న్యాయస్థానం పర్యవేక్షణలో న్యాయ విచారణను కోరుతూ దాఖలైన ప్రజా ప్రయోజన వ్యాజ్యాన్ని (పీఐఎల్) విచారించేందుకు కూడా సుప్రీంకోర్టు అంగీకరించింది. నవంబర్ 14న ఈ పిటిషన్‌ను సుప్రీంకోర్టు విచారించనుంది. దాదాపు 27 ఏళ్లుగా రాష్ట్రాన్ని పాలిస్తున్న బీజేపీ పై ఈ ఘటన తర్వాత ప్రతిపక్షాలు తీవ్ర విమర్శలు గుప్పించాయి. ఈ సంఘటన, ప్రాణనష్టం అన్ని వర్గాల నుంచి ప్రభుత్వంపై తీవ్ర ఆగ్రహాన్ని రేకెత్తించింది. త్వరలో ఎన్నికల జరగనున్న తరుణంలో ఈ ఘటన చోటుచేసుకోవడంతో గుజరాత్ బీజేపీ సర్కారుపై ప్రతిపక్షాలు మరింతగా పదును పెంచి విమర్శలు గుప్పిస్తున్నాయి. గుజరాత్‌లో ఎన్నికలకు సంబంధించి ఇటీవలే ఎన్నిక సంఘం షెడ్యూల్ ను ప్రకటించింది. రెండు దశల్లో డిసెంబర్ 1, 5న ఇక్కడ పోలింగ్ జరగనుంది. డిసెంబర్ 8న ఫలితాలు ప్రకటిస్తారు.
