హాస్టళ్లలో ఉండే అమ్మాయిలకు భద్రత లేకుండా పోయింది.  హాస్టల్ నిర్వాహాకులే  రహస్య కెమెరాలను అమర్చి  అమ్మాయిల జీవితాలతో చెలగాటమాడుతున్నారు

ముంబై: హాస్టళ్లలో ఉండే అమ్మాయిలకు భద్రత లేకుండా పోయింది. హాస్టల్ నిర్వాహాకులే రహస్య కెమెరాలను అమర్చి అమ్మాయిల జీవితాలతో చెలగాటమాడుతున్నారు. హైద్రాబాద్‌లోనే కాదు మహరాష్ట్ర రాజధాని ముంబైలో కూడ ఇదే తరహా ఘటన ఒకటి వెలుగు చూసింది.

దక్షిణ ముంబైలో నాలుగు బెడ్‌రూమ్‌లున్న ఫ్లాట్‌ను హాస్టల్‌గా మార్చి ముగ్గురిని గెస్ట్‌లుగా చేర్చుకొన్నాడు ఓ వ్యక్తి. ఈ అమ్మాయిలు ఉంటున్న రూమ్‌ల్లో వారికి తెలియకుండానే రహస్య కెమెరాలను ఏర్పాటు చేశారు. ఈ గదుల్లో అమర్చిన మొబైల్ అడాప్టర్‌లో సీక్రెట్ కెమెరాను ఏర్పాటు చేశాడు.

ఈ గదుల్లో అమ్మాయిల కదలికలను తన మొబైల్‌ ఫోన్లో రికార్డు చేసుకొనేవాడు. అయితే గదుల్లో అమ్మాయిలు ఏం మాట్లాడుకొంటున్నారనే విషయమై అతను ఎప్పటి కప్పుడు వినేవాడు. ఒక రోజు అమ్మాయిలు మాట్లాడుకొన్న విషయాలను హాస్టల్ ఓనర్ అమ్మాయిల వద్ద యధాలాపంగా ప్రస్తావించాడు. దీంతో ఓ అమ్మాయికి అనుమానం వచ్చి నిలదీసింది. అయితే ఆ సమయంలో అతను ఏదో చెప్పి తప్పించుకొన్నాడు.

ఇదిలా ఉంటే హాస్టల్‌ రూమ్‌లో ఉన్న మొబైల్ అడాప్టర్‌పై ఓ అమ్మాయి ఓ వస్త్రాన్ని కప్పింది. హాస్టల్‌లో తనిఖీ పేరుతో ఆ రూమ్‌లోకి వచ్చిన ఓనర్ మెబైల్ అడాప్టర్‌పై ఎందుకు వస్త్రాన్ని కప్పారని ప్రశ్నించారు.

దీంతో ఆ రూమ్‌లో ఉన్న యువతికి అనుమానం వచ్చి దాన్ని పరిశీలించింది. అందులో కెమెరా ఉన్నట్టు అనుమానించి పోలీసులకు ఫిర్యాదు చేసింది. ఈ ఫిర్యాదు మేరకు పోలీసులు ఆ హాస్టల్‌లో తనిఖీలు నిర్వహించగా రహస్య కెమెరాలు లభ్యమయ్యాయి.

నిందితుడిపై ఐటీ యాక్టు కింద కేసు నమోదు చేసి విచారణ నిర్వహిస్తున్నట్టు పోలీసులు తెలిపారు. ఇదే తరహాలో హైద్రాబాద్, చెన్నైలలోని లేడీస్ హాస్టళ్లలో రహస్య కెమెరాలు లభించిన విషయం తెలిసిందే.