చెన్నై: హీరో విశాల్ బిజెపిలో చేరుతారంటూ పుకార్లు షికార్లు చేశాయి. ప్రసార మాధ్యమాల్లో విరివిగా ప్రచారమయ్యాయి. దానిపై ఆయన స్పష్టత ఇచ్చారు. తాను బిజెపిలో చేరుతున్నట్లు వచ్చిన వార్తల్లో నిజం లేదని ఆయన చెప్పారు. 

విశాల్ బిజెపిలో చేరేందుకు సిద్ధపడ్డారని, ఇందుకు తమిళనాడు బిజెపి అధ్యక్షుడు మురగన్ తో భేటీకి అపాయింట్ మెంట్ కోరినట్లు సామాజిక మాధ్యమాల్లో ప్రచారం జరిగింది. రాజకీయాల్లో ప్రవేశించాలనే కోరిక ఆయనకు దండిగానే ఉంది. 

ఆర్కె నగర్ ఉప ఎన్నికల్లో పోటీ చేయాలని ఆ మధ్య ప్రయత్నించారు. అయితే, ఆయన నామినేషన్ తిరస్కరణకు గురైంది. గతంలో జరిగిన తమిళ నిర్మాతల మండలి ఎన్నికల్లో అధ్యక్షుడిగా, నడిగర్ సంగం ఎన్నికల్లో కార్యదర్శిగా పోటీ చేసి విజయం సాధించారు. 

బాలీవుడ్ నటుడు సుశాంత్ సింగ్ రాజ్ పుత్ ఆత్మహత్యపై సంచలన వ్యాఖ్యలు చేసిన బాలీవుడ్ నటి కంగనా రౌనత్ మీద ఆయన ఆసక్తికరమైన వ్యాఖ్యలు చేశారు. కంగనా రనౌత్ ను సమర్థిస్తూ ఆయన మాట్లాడారు. ఆమెను భగత్ సింగ్ తో పోల్చారు. 

కంగనా రనౌత్ కు బిజెపి మద్దతు ఇస్తున్న విషయం తెలిసిందే. దీంతో విశాల్ బిజెపిలో చేరుతారనే ప్రచారం ముమ్మరంగా సాగింది. రాష్ట్ర బిజెపి అధ్యక్షుడు మురగన్ ఈ నెల 14 లేదా 15వ తేదీన భేటీకి అపాయింట్ మెంట్ కోరినట్లు ప్రచారం జరిగింది. ఈ ప్రచారాన్ని హీరో విశాల్ ఖండించారు.