Asianet News TeluguAsianet News Telugu

కేసీఆర్ హెలికాప్టర్ మనీ వ్యాఖ్య :మోడీ ఇక డబ్బులు చల్లుడే అన్న టీవీ ఛానెల్, నోటీసులు

హెలికాప్టర్ మని అనే కాన్సెప్ట్ పై అవగాహనా లేని కర్ణాటకకు చెందిన ఒక మీడియా ఛానల్ ఈ హెలికాప్టర్ మనీ అనే పదానికి తమ సొంత పైత్యం ఉపయోగించి నూతన నిర్వచనం చెప్పడమే కాకుండా మోడీ హెలికాప్టర్ నుంచి డబ్బులు విసురబోతున్నాడా అంటూ ఒక ప్రత్యేక ప్రోగ్రాం ని కూడా ప్రసారం చేసింది. 

Helicopter Money: News channel gets notice for spreading false news and hinting at modi throwing money out of helicopter
Author
Bangalore, First Published Apr 17, 2020, 6:30 PM IST

కరోనా వైరస్ మహమ్మారి దెబ్బకు ప్రపంచ ఆర్ధిక వ్యవస్థ అంతా కుదేలవుతోంది భారతదేశ ఆర్ధిక వ్యవస్థ కూడా లాక్ డౌన్ వల్ల దాదాపుగా రోజుకు 35,000 కోట్ల రూపాయలను నష్టపోతున్నట్టు ఒక అంచనా. అన్ని రాష్ట్రాల పరిస్థితి కూడా ఇంచుమించుగా ఇదే ఉంది. 

అయితే మొన్నటి ప్రెస్ మెట్లో తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ ఇప్పుడు ప్రస్తుతం ఉన్న తరుణంలో రాష్ట్రానికి రాబడి పూర్తిగా ఆగిపోయిన తరుణంలో ఆర్బీఐ నుండి ఓవర్ డ్రాఫ్ట్ తీసుకోవాల్సిందేనని, హెలికాప్టర్ మనీ మాత్రమే ప్రస్తుత సమయంలో ఆర్ధిక వ్యవస్థను గాడిలో పెట్టగలదు అని అన్నారు. 

ఈ హెలికాప్టర్ మని అనే కాన్సెప్ట్ పై అవగాహనా లేని కర్ణాటకకు చెందిన ఒక మీడియా ఛానల్ ఈ హెలికాప్టర్ మనీ అనే పదానికి తమ సొంత పైత్యం ఉపయోగించి నూతన నిర్వచనం చెప్పడమే కాకుండా మోడీ హెలికాప్టర్ నుంచి డబ్బులు విసరబోతున్నాడా అంటూ ఒక ప్రత్యేక ప్రోగ్రాం ని కూడా ప్రసారం చేసింది. 


అసలు హెలికాప్టర్ మనీ అంటే.... 

ఆర్ధిక వ్యవస్థ దెబ్బతిని ఉన్నప్పుడు, ఆర్ధిక వ్యవస్థను గాడిలో పెట్టేందుకు, ప్రజల చేత డబ్బును ఖర్చు పెట్టించడమే మార్గంగా భావిస్తారు. అప్పుడు డిమాండ్ పెరిగి ఆర్ధిక వ్యవస్థకు ఊతం ఇస్తుందనేది ఆర్ధిక సిద్ధాంతం. 

కానీ కష్టకాలంలో ప్రజల వద్దే ఏమి ఉండదు. వారెలా ఖర్చు పెడతారు? అందుకోసమే ప్రజలకు రకరకాల రూపాల్లో డబ్బులు అందించాలి. అవి సంక్షేమ పథకాల రూపంలో, లేదా కష్టకాలంలో అందించే ఆర్ధిక ప్రయోజనాల రూపంలో ఉంటాయి. 

ఇలా ఒక్కసారి గనుక ప్రజల చేతుల్లోకి డబ్బు వెళితే... వారు ఆ డబ్బును ఖర్చు చేస్తారు. ఖర్చు చేస్తే ఆ డబ్బు ద్వారా డిమాండ్ పెరిగి ఆర్థికంగా వృద్ధి సాధించేందుకు ఆస్కారం ఉంటుంది. 

ప్రముఖ అమెరికన్ ఆర్ధిక శాస్త్రవేత్త మిల్టన్ ఫ్రైడ్ మాన్ ఈ హెలికాప్టర్ మనీ అనే పదాన్ని సూచించి దాన్ని విరివిగా వాడకంలోకి తీసుకువచ్చాడు. ఈ హెలికాప్టర్ మనీ కి ఆ సదరు పబ్లిక్ టీవీ కన్నడ అనే ఛానల్ నూతన నిర్వచనం తన స్పెషల్ షోలో చెప్పింది. 

జర్నలిస్టులకు అన్ని విషయాలు తెలిసి ఉండాల్సినవసరం లేకున్నప్పటికీ... కనీసం ఒక స్పెషల్ ప్రోగ్రాం చేసే ముందు కొంచం ఆ సదరు టాపిక్ గురించి రీసెర్చ్ అయినా చేయాలి. అలాంటివేమీ చేయకుండా వారు ప్రోగ్రాం ని ప్రసారం చేసారు. 

ఆ సదరు ఛానల్ లో యాంకర్ చెప్పిన నిర్వచనం వింటే మైండ్ బ్లాంక్ అవ్వాల్సిందే. ఆర్బీఐ డబ్బును ముద్రించి ప్రభుత్వానికి ఇస్తే ప్రభుత్వం   హెలికాప్టర్ ద్వారా ఈ డబ్బును వెదజల్లుతుందని, ఈ డబ్బును తిరిగి ఆర్బీఐ కి ఇవ్వాల్సినవసరం లేదని అన్నారు. ఈ డబ్బును ఆకాశ మార్గం గుండా వెదజల్లుతారు కాబట్టి ఈ డబ్బును హెలికాప్టర్ మనీ అని పిలుస్తున్నట్టు ఆ ఛానల్ వారు ఒక ప్రత్యేక కథనం ప్రసారం చేసారు. గతంలో ఇదే ఛానల్ 2000 రూపాయల నోట్లలో జీపీఎస్ చిప్ ఉంటుందని కూడా ఫేక్ న్యూస్ ప్రసారం చేయడం జరిగింది. 

Follow Us:
Download App:
  • android
  • ios