ప్రస్తుతం ప్రపంచ దేశాలను కరోనా వైరస్ పట్టిపీడిస్తోంది. ఎవరికి, ఎక్కడ, ఎలా కరోనా వైరస్ సోకుతుందో ఎవరికీ అర్థం కావడం లేదు. ఎన్ని జాగ్రత్తలు తీసుకున్నా.. చాలా మందికి వైరస్ సోకుతోంది. దీంతో.. బయట అడుగుపెట్టాలంటేనే చాలా మంది భయపడిపోతున్నారు.

ప్రజలంతా ఈ వైరస్ బారిన పడకుండా రకరకాల జాగ్రత్తలు తీసుకుంటున్నారు. ఈ క్రమంలో దొంగలు కూడా అప్‌డేట్ అయ్యారు. దొంగతనానికి వచ్చేప్పుడు పీపీఈ(పర్సనల్ ప్రొటెక్షన్ ఎక్విప్‌మెంట్) కిట్లు ధరించి వస్తున్నారు. తమ ప్రాణ రక్షణ కోసం.. తమకు వైరస్ సోకకుండా ఉండేందుకు పీపీఈ కిట్ ధరించి.. ఆ తర్వాత దొంగతనం చేయడం గమనార్హం. ఈ సంఘటన మహారాష్ట్రలో చోటుచేసుకోగా.. పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి.

మహరాష్ట్రలోని సతారా డిస్ట్రిక్ట్‌లోని ఓ జ్యూవెలరీ స్టోర్‌లో ఇటీవల ఓ దొంగతనం జరిగింది. ఈ షాపును దోచుకున్న దొంగలు 780గ్రాముల బంగారాన్ని ఎత్తుకెళ్లారు. సీసీటీవీ కెమెరాలో ఈ తతంగం మొత్తం రికార్డయింది. ఈ రికార్డును పరిశీలించిన పోలీసులు షాకయ్యారు. ఎందుకంటే ఆ వీడియోలో దొంగలు పీపీఈ కిట్లు ధరించి ఉన్నారు. గ్లవ్స్, ప్లాస్టిక్ కోట్స్, హెల్మెట్స్ ధరించి పూర్తి సన్నద్ధతతో వచ్చారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.