సీఐసీగా హీరాలాల్ సమారియా ప్రమాణం.. ఆ పదవి చేపట్టిన తొలి దళిత వ్యక్తి ఆయనే..
ప్రధాన సమాచార కమిషనర్ (సీఐసీ) హీరాలాల్ సమరియా నేడు ప్రమాణ స్వీకారం చేశారు.
ప్రధాన సమాచార కమిషనర్ (సీఐసీ) హీరాలాల్ సమరియాను ప్రధాని మోదీ నేతృత్వంలోని సెలక్షన్ కమిటీ ఎన్నుకున్న సంగతి తెలిసిందే. దీంతో ఆయన నేడు ప్రమాణ స్వీకారం చేశారు. రాష్ట్రపతి భవన్‌లో ప్రధాన సమాచార కమిషనర్ హీరాలాల్ సమరియాతో రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ప్రమాణ స్వీకారం చేయించారు. ఈ కార్యక్రమానికి ప్రధాని నరేంద్ర మోదీ కూడా హాజరయ్యారు. అయితే ప్రధాన సమాచార కమిషనర్‌గా బాధ్యతలు చేపట్టిన తొలి దళిత వ్యక్తిగా హీరాలాల్ సమారియా నిలిచారు.
ఇక, మాజీ ఐఏఎస్, ప్రస్తుతం సమాచార కమిషనర్‌గా విధులు నిర్వర్తిస్తున్న హీరాలాల్ సమరియాను ప్రధాని నరేంద్ర మోదీ నేతృత్వంలోని సెలక్షన్ కమిటీ శనివారం తదుపరి సీఐసీగా ఎన్నుకుంది. అయితే ఈ సెలక్షన్ కమిటీలో సభ్యునిగా ఉన్న లోక్‌సభలో ప్రతిపక్ష నేత అధిర్ రంజన్ చౌదరి ఈసమావేశానికి హాజరుకాలేదు. ఈ సమావేశానికి ఆయనకు ఆహ్వానం ఉన్నప్పటికీ.. పశ్చిమ బెంగాల్‌లో ఉన్న పనుల కారణంగా హాజరుకాలేకపోతున్నట్టుగా ఆయన తెలిపారు.
ఇక, హీరాలాల్ సమారియా రాజస్తాన్ రాష్ట్రానికి చెందినవారు. ఆయన దళిత సామాజికవర్గానికి చెందిన వ్యక్తి. ఆయన సివిల్ ఇంజనీరింగ్‌లో బ్యాచిలర్ డిగ్రీని పొందాడు. సమరియా కార్మిక, ఉపాధి మంత్రిత్వ శాఖ కార్యదర్శిగా పదవీ విరమణ చేశారు.