న్యూఢిల్లీ: డిపాజిటర్లకు డబ్బులను ఎలా తిరిగి చెల్లిస్తారనే విషయమై నివేదిక రూపంలో 10 రోజుల్లో కోర్టుకు తెలపాలని సుప్రీంకోర్టు నౌహీరా షేక్ ను ఆదేశించింది.

హీరా గోల్డ్ కుంభకోణానికి సంబంధించి మంగళవారంనాడు సుప్రీంకోర్టులో విచారణ జరిగింది. ఈ కుంభకోణానికి సూత్రధారిగా ఆరోపణలు ఎదుర్కొంటున్న నౌహీరా షేక్ బెయిల్ పిటిషన్ దాఖలు చేసింది. 

మరో వైపు ఈ కేసును సీరియస్ ఫ్రాడ్ ఇన్వెస్టిగేషన్ ఆఫీస్ తో పాటు ఐపీసీ ప్రకారం విచారణ జరిపేలా చూడాలని తెలంగాణ ప్రభుత్వం ఉన్నత న్యాయస్థానాన్ని కోరుతూ పిటిషన్ దాఖలు చేసింది.

ఈ రెండు పిటిషన్లపై సుప్రీంకోర్టు విచారణ చేసింది. నౌహీరా షేక్ కు బెయిల్ ఇవ్వాలని ఆమె తరపు న్యాయవాది సుప్రీంను కోరారు. జైలు నుండి బయటకు వచ్చిన తర్వాత ఇన్వెష్టర్ల నుండి తీసుకొన్న డిపాజిట్లను చెల్లించనున్నట్టుగా ఆమె తరపు న్యాయవాది తెలిపారు.

బెయిల్ మంజూరు చేసిన తర్వాత డబ్బులు చెల్లిస్తామని నోటిమాటగా చెబితే ఎలా అని సుప్రీం ప్రశ్నించింది. ఈ విషయమై ఓ నివేదికను ఇవ్వాలని సుప్రీం ఆదేశించింది. 10 రోజుల్లోగా ఈ నివేదికను తమకు సమర్పించాలని కోర్టు కోరింది.