ట్రాఫిక్ జామ్‌‌ ఓ యువకుడి నిండు ప్రాణాన్ని బలి తీసుకుంది. 500 మీటర్ల దూరాన్ని దాటడానికి 20 నిమిషాలు పట్టడంతో అంబులెన్స్‌లోనే ప్రాణాలు వదిలాడు ఓ యువకుడు. ఈ సంఘటన మహారాష్ట్రలోని ముంబైలో జరిగింది. ఆలస్యంగా వెలుగులోకి వచ్చిన ఈ ఘటన వివరాల్లోకి వెడితే..

ముంబై, వెస్ట్‌ మలద్‌లోని మల్వానీకి చెందిన అల్‌ జిగ్నేష్‌ పర్‌మర్‌ అనే 27 ఏళ్ల యువకుడు తల్లిదండ్రులతో కలిసి మహారాష్ట్ర హౌసింగ్‌ బోర్డు కాలనీలో నివాసం ఉంటున్నాడు. మంగళవారం ఉదయం 10 గంటల సమయంలో అతడికి గుండెలో నొప్పి రావటంతో దగ్గరలోని ఆసుపత్రికి తీసుకెళ్లారు. 

ఆ ఆసుపత్రిలో అత్యవసరమైన పరికరాలు లేకపోవటంతో వేరే పెద్ద ఆసుపత్రికి తీసుకెళ్లాలని వైద్యులు జిగ్నేష్‌ తల్లిదండ్రులకు సూచించారు. తొందరగా తీసుకెళ్లేందుకు అంబులెన్స్‌లో వెళ్లమని చెప్పారు. అతడ్ని వెంటనే అంబులెన్స్‌లోకి చేర్చారు. 

అంబులెన్స్‌ ఆసుపత్రిలోనుంచి బయట రోడ్డు మీదకు వచ్చింది. అయితే అదే సమయంలో విపరీతమైన ట్రాఫిక్‌ జామ్‌ అయింది. 500మీటర్ల దూరాన్ని దాటడానికి 20 నిమిషాలకు పైగా పట్టింది. దీంతో జిగ్నేష్‌ అంబులెన్స్‌లోనే ప్రాణాలు వదిలాడు. 

దీనిపై మృతుడి తల్లి మాట్లాడుతూ.. ‘‘ ట్రాఫిక్‌ జామ్‌ కారణంగా ఈ రోజు నేను నా కుమారుడ్ని పోగొట్టుకున్నాను. ఇలా ఇంకొకరికి జరగకూడదని అనుకుంటున్నాను. మలద్‌ ఏరియాలోని రోడ్లు చాలా దారుణంగా ఉన్నాయి. మల్వానీ ఏరియాను దాటడానికి గంటల సమయం పడుతుంది. అధికారులు వెంటనే స్పందించి నిర్మాణ పనులు పూర్తి చేయాలని కోరుకుంటున్నాను’’ అని అన్నారు.