అమర్‌నాథ్ యాత్ర రద్దు, బలగాల మోహరింపుతో జమ్మూకశ్మీర్‌లో హై టెన్షన్ నెలకొంది. దీంతో అక్కడ వున్న ఇతర రాష్ట్రాలకు చెందిన యాత్రికులు, పర్యాటకులతో పాటు ఉద్యోగులు, విద్యార్ధులు స్వస్థలాలకు బయలుదేరారు.

దీంతో ఒక్కసారిగా శ్రీనగర్ విమానాశ్రయంలో రద్దీ పెరిగింది. ప్రయాణీకులకు టిక్కెట్లు సైతం దొరకని పరిస్ధితి నెలకొంది. పరిస్ధితిపై స్పందించిన డైరెక్టరేట్ జనరల్ ఆఫ్ సివిల్ ఏవియేషన్ శ్రీనగర్ నుంచి అదనపు విమానాలు నడపాలని విమానాయాన సంస్థలను ఆదేశించింది.

దీనికి అనుగుణంగానే తమ సర్వీసులను రీషెడ్యూల్ చేస్తున్నట్లుగా ఎయిర్‌ ఇండియా, ఇండిగో, విస్తారా ప్రకటించాయి. మరోవైపు కశ్మీర్ లోయలో గత కొద్దిరోజులుగా నెలకొన్న పరిస్ధితిపై గవర్నర్ సత్యపాల్ మాలిక్ సమీక్ష నిర్వహించారు. పుకార్లను నమ్మవద్దని, సంయమనం పాటించాలని ఆయన ప్రజలకు విజ్ఞప్తి చేశారు.