తమిళనాడులో భారీ వర్షాలు కొనసాగుతున్నాయి. ఈ వానల వల్ల చెన్నైతో పాటు అనేక నగరాలు జల దిగ్భందం అవుతున్నాయి. పలు జిల్లాలో స్కూల్స్, కాలేజీలను అధికారులు మూసివేశారు.
బంగాళాఖాతంలో శ్రీలంక తీరంలో ఏర్పడిన అల్పపీడనం ప్రభావంతో తమిళనాడులో వర్షాలు దంచికొడుతున్నాయి. రాజధాని చెన్నైతో పాటు పొరుగున్న ఉన్న కాంచీపురం, తిరువళ్లూరు, చెంగల్‌పేట జిల్లాల్లో అలాగే రామనాథపురం, కడలూరు, విల్లుపురంతో పాటు రాష్ట్రంలోని పలు తీర ప్రాంతాల్లో కూడా వర్షాలు కురుస్తున్నాయి. వర్షాల కారణంగా చైన్నైతో పాటు ఇతర నగరాల్లో భారీగా నీరు నిలిచిపోయిందని ‘ది న్యూ ఇండియన్ ఎక్స్ ప్రెస్’ నివేదించింది.
జమ్మూకశ్మీర్ లో ఎన్ కౌంటర్.. జైషే మహ్మద్ ఉగ్రవాది హతం.. కొనసాగుతోన్న సెర్చ్ ఆపరేషన్
శ్రీలంక తీరానికి ఆనుకుని నైరుతి బంగాళాఖాతంలో అల్పపీడనం కొనసాగుతోందని, రానున్న 24 గంటల్లో ఇది మరింతగా పెరిగే అవకాశం ఉందని భారత వాతావరణ శాఖ (ఐఎండీ) తన బులెటిన్‌లో తెలిపింది. ఇది నవంబర్ 12 ఉదయం వరకు వాయువ్య దిశగా కదులుతూ తమిళనాడు-పుదుచ్చేరి తీరాల వైపు వెళ్లే అవకాశం ఉంది. రానున్న మూడు రోజుల పాటు రాష్ట్రంలోని పలు ప్రాంతాల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని ఐఎండీ అంచనా వేసింది.
ఇదిలా ఉండగా.. ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాల నేపథ్యంలో శివగంగ జిల్లా కలెక్టర్ అన్ని పాఠశాలలకు సెలవు ప్రకటించారు. అలాగే మధురై జిల్లా కలెక్టర్ అన్ని పాఠశాలలతో పాటు కళాశాలలకు సెలవు ప్రకటించారు. పలు జిల్లాల్లో భారీ వర్షం కారణంగా శని, ఆదివారాల్లో జరగాల్సిన టైప్‌రైటింగ్ పరీక్షలు వాయిదా పడ్డాయి. వాటిని నవంబర్ 19,20 తేదీల్లో పరీక్షలు నిర్వహిస్తామని అధికారులు తెలిపారు.
కాగా.. పొరుగున ఉన్న పుదుచ్చేరిలో గురువారం రాత్రి నుంచి భారీ వర్షం కురుస్తోంది. భారీ వర్షాల కారణంగా శుక్ర, శనివారాల్లో పుదుచ్చేరి, కారైకల్ ప్రాంతాల్లోని అన్ని పాఠశాలలు, కళాశాలలకు కేంద్ర పాలిత ప్రభుత్వం సెలవు ప్రకటించింది.
