Asianet News TeluguAsianet News Telugu

కేరళ విలవిల..భారీ వర్షాలకు 26 మంది మృతి...పరిస్థితి భయానకం

భారీ వర్షాలతో కేరళ విలవిలలాడిపోతోంది. మూడు రోజులుగా కురుస్తున్న భారీ వర్షాలకు జనజీవనం అస్తవ్యస్తమైంది. వాగులు, వంకలు ఏకం కావడంతో నదులు పొంగిపొర్లుతున్నాయి

heavy rains in kerala.. situation critical
Author
Kerala, First Published Aug 10, 2018, 6:21 PM IST

భారీ వర్షాలతో కేరళ విలవిలలాడిపోతోంది. మూడు రోజులుగా కురుస్తున్న భారీ వర్షాలకు జనజీవనం అస్తవ్యస్తమైంది. వాగులు, వంకలు ఏకం కావడంతో నదులు పొంగిపొర్లుతున్నాయి. లోతట్టు ప్రాంతాలు జలమయమయ్యాయి. అలప్పుజ, ఇడుక్కి, వయనాడ్, కొల్లాం, మళప్పురం జిల్లాల్లో వరదలు పోటెత్తుతుండటంతో.. ఊళ్లు సముద్రాలను తలపిస్తున్నాయి. చాలా ప్రాంతాల్లో రోడ్లు, రైలు పట్టాల మీద అడుగుల మేర నీరు ప్రవహించడటంతో పాటు రహదారులు కొట్టుకుపోయాయి.

ఇడుక్కి జిల్లాలోని ఇడుక్కి రిజర్వాయర్‌లో భారీగా వరద నీరు చేరడంతో చేరుథోనీ డ్యాం గేట్లను ఎత్తి నీటిని కిందకు వదిలారు. భారీ వరదల కారణంగా కొచ్చి విమానాశ్రయం రన్‌వేపైకి నీరు చేరడంతో ఎయిర్‌పోర్ట్‌ను తాత్కాలికంగా మూసివేశారు. కొండచరియలు విరిగిపడి ఇడుక్కి జిల్లాలో 11 మంది, ఉత్తర మళప్పురం జిల్లాలో ఆరుగురు, కన్నూరు, వయనాడ్ జిల్లాల్లో తొమ్మిది మందితో కలిపి మొత్తం 26 మంది చనిపోయినట్లు అధికారులు వెల్లడించారు.

ఇడుక్కి జిల్లాలో మరణించిన వారిలో 11 మంది ఒకే కుటుంబానికి చెందిన వారు. మరోవైపు కేరళలోని ప్రకృతి అందాలు వీక్షించడానికి వెళ్లిన పర్యాటకులు వరదల్లో చిక్కుకుపోయారు.. మన్నార్ సమీపంలోని రిసార్టులో 60 మంది పర్యాటకులు చిక్కుకున్నారు. వీరిలో విదేశీయులు కూడా ఉన్నారు.. వరదలు నాలుగు వైపులా ముంచేయడంతో వారు బయటకు రాలేకపోతున్నారు. ఈ నేపథ్యంలో ఎత్తైన ప్రదేశాలు, డ్యాంలున్న ప్రాంతాలకు వెళ్లకూడదని ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది.

రాష్ట్రంలో వరద పరిస్థితిని ముఖ్యమంత్రి ఎప్పటికప్పుడు సమీక్షిస్తున్నారు. ప్రధాని నరేంద్రమోడీ కూడా సీఎంకు ఫోన్ చేసి వర్షాలపై ఆరా తీశారు. అవసరమైన సాయాన్ని చేస్తామని హామీ ఇచ్చారు. ఇదిలావుండగా కేరళలో మరో రెండు రోజులు భారీ నుంచి అతి భారీ వర్షాలు కురవనున్నాయని వాతావరణ శాఖ ప్రకటించడంతో.. అధికారులు ప్రమాద హెచ్చరిక జారీ చేశారు. 


 

Follow Us:
Download App:
  • android
  • ios