rainfall: ఆగస్టు 19 నాటికి వాయువ్య బంగాళాఖాతంలో మరో అల్పపీడనం ఏర్పడే అవకాశం ఉందనీ, దీంతో పశ్చిమ బెంగాల్, ఒడిశా, జార్ఖండ్‌లో విస్తృతంగా మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని భారత వాతావరణ శాఖ (ఐఎండీ) వెల్లడించింది.
India Meteorological Department (IMD): రుతుపవనాల ప్రభావంతో దేశంలోని పలు చోట్ల ఇప్పటికీ మోస్తారు నుంచి భారీ వర్షాలు కురుస్తున్నాయి. ప్రస్తుతం మధ్య భారతం సహా దేశంలోని పలు చోట్ల భారీ వర్షాలు కురిసే అవకాశముందని భారత వాతావరణ శాఖ (ఐఎండీ) వెల్లడించింది. ఉత్తర ఛత్తీస్‌గఢ్, రాజస్థాన్, పశ్చిమ మధ్యప్రదేశ్, గుజరాత్, కచ్‌లలో ఈ వారం విస్తారంగా వర్షాలు కురిసే అవకాశం ఉందని IMD తెలిపింది. ఆగష్టు 19 నాటికి వాయువ్య బంగాళాఖాతంలో తాజా అల్పపీడనం ఏర్పడే అవకాశం ఉంది. పశ్చిమ బెంగాల్, ఒడిశా, జార్ఖండ్ మొదలైన ప్రాంతాల్లో విస్తృతంగా మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉంది.
అల్పపీడనం పశ్చిమ-వాయువ్య-పశ్చిమ దిశగా కదులుతూ క్రమంగా బలహీనపడే అవకాశం ఉందని, రుతుపవన ద్రోణి దాని సాధారణ స్థితికి దక్షిణంగా మూడు రోజుల పాటు చురుకుగా ఉండే అవకాశం ఉందని IMD తెలిపింది. రుతుపవన ద్రోణి పశ్చిమ చివర ఆగస్టు 17 నుండి క్రమంగా ఉత్తరం వైపుకు మారే అవకాశం ఉంది. తూర్పు చివర క్రమంగా ఉత్తరం వైపుకు మారే అవకాశం ఉంది. దక్షిణ గుజరాత్, మహారాష్ట్ర తీరాల వెంబడి సగటు సముద్ర మట్టం వద్ద ఆఫ్-షోర్ ద్రోణి ప్రవహిస్తోంది. ఈ వ్యవస్థల ప్రభావంతో పశ్చిమ, మధ్య భారతదేశంలో విస్తారంగా, మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉంది.
IMD డైరెక్టర్ జనరల్ M Mohapatra మాట్లాడుతూ.. మధ్య భారతదేశం, పశ్చిమ తీరంలో విస్తృతమైన-భారీ వర్షాలు కొనసాగుతాయని, ఆపై వర్షపాతం మళ్లీ ఒడిశాకు మారుతుందని చెప్పారు. "తాజా అల్పపీడన వ్యవస్థ కారణంగా, ఒడిశా, జార్ఖండ్, పశ్చిమ బెంగాల్ మొదలైన ప్రాంతాల్లో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది. వరుస అల్పపీడన వ్యవస్థల అభివృద్ధి కారణంగా ఒడిశాలో అధిక వర్షాలు కురుస్తున్నాయి. దీంతో వరదలు కూడా సంభవించవచ్చు" అని తెలిపారు.
ఇదిలావుండగా, భారీ వర్షానికి లక్నోలోని బారా ఇమాంబరాలో కొంత భాగం కూలిపోయింది. భారీ వర్షాల కారణంగా లక్నోలోని 230 ఏళ్ల చరిత్ర కలిగిన బారా ఇమాంబర ప్రాకారం సోమవారం రాత్రి కుప్పకూలింది. సూపరింటెండింగ్ ఆర్కియాలజిస్ట్, ఆర్కియాలజికల్ సర్వే ఆఫ్ ఇండియా (ASI) అఫ్తాబ్ హుస్సేన్ మాట్లాడుతూ.. స్మారక చిహ్నాన్ని సరిగ్గా నిర్వహించినప్పటికీ, భారీ వర్షాల సమయంలో పారాపెట్ పడిపోయిందన్నారు. "ఘటన గురించి మాకు సమాచారం అందిన వెంటనే, సైట్ ఇన్‌చార్జి ఆ ప్రాంతాన్ని సందర్శించారు. అతను ఇచ్చిన ఇన్‌పుట్‌ల ఆధారంగా, ఇంజనీర్లు వెళ్లి నష్టాన్ని పరిశీలించి మంగళవారం నివేదిక ఇస్తారు. ఆ తర్వాత, అది పునరుద్ధరించబడుతుంది" అని చెప్పారు. అయితే, నిర్వహణ సరిగా లేకపోవడం వల్ల భవనం బలహీనపడి, ఒక భాగం కూలిపోయిందని స్థానికులు చెబుతున్నారు.
హెరిటేజ్ కార్యకర్త మహ్మద్ హైదర్ మాట్లాడుతూ.. "మేము అనేకసార్లు ASI కి సమాచారం అందించాము. అయినప్పటికీ చాలా ఫిర్యాదులు ఉన్నప్పటికీ, నిర్మాణాన్ని బలోపేతం చేయడానికి ASI ఎటువంటి చర్య తీసుకోలేదు"న్నారు. 1784లో అవధ్ నవాబ్ అసఫ్-ఉద్-దౌలాచే లక్నోలో నిర్మించిన ఇమాంబర సముదాయాన్ని అసఫీ ఇమాంబరా అని కూడా పిలుస్తారు. ఈ ఇమాంబరా నిజామత్ ఇమాంబరా తర్వాత రెండవ అతిపెద్దది.
