Kerala: జూలై 23 వరకు కేరళలో భారీ వర్షాలు కురుస్తాయని భారత వాతావరణ విభాగం (ఐఎండీ) అంచనా వేసింది. ఈ క్రమంలోనే కాసరగోడ్, కన్నూర్, ఇడుక్కి, పాలక్కాడ్, ఎర్నాకులం ప్రాంతాలకు హెచ్చరికలు జారీ చేసింది.
Heavy Rains in Kerala: గతవారం ప్రారంభం నుంచి దేశంలోని అనేక ప్రాంతాల్లో వర్షాలు కురుస్తున్నాయి. రుతుపవనాలు చురుగ్గా కదులుతుండటంతో పలు ప్రాంతాల్లో కురిసిన భారీ వర్షాలతో వరదల పొటెత్తాయి. ఇక దక్షిణాది రాష్ట్రమైన కేరళలో కూడా వానలు దంచికొడుతున్నాయి. ఈసారి నైరుతి రుతుపవనాలు ముందుగానే ప్రారంభమైనప్పటికీ జూన్ అంతటా లోటు వర్షపాతం నమోదైందని గణాంకాలు పేర్కొంటున్నాయి. అయితే, గత వారం ప్రారంభం నుంచి వానలు దంచికొడుతున్నాయి. జూలై ప్రారంభం నుండి కేరళలో వర్షపాతం గణనీయంగా పెరిగిందని అధికారులు చెబుతున్నారు. భారత వాతావరణ శాఖ (IMD) జారీ చేసిన తాజా బులిటెన్ ప్రకారం రాష్ట్రంలో మరో నాలుగు రోజుల పాటు భారీ వర్షాలు కురవనున్నాయి. ఈ క్రమంలోనే ఐఎండీ హెచ్చరికలు జారీ చేసింది.
ప్రస్తుతం రుతుపవన ద్రోణి కొద్దిగా ఉత్తరం వైపుకు మారిందనీ, రాబోయే రెండు రోజుల్లో ఆ దిశగా తుఫాను మారే అవకాశం ఉంది. అంతేకాకుండా, అల్పపీడన ప్రాంతం, మధ్యప్రదేశ్ సహా దాని పొరుగు మధ్య ప్రాంతాలపై ప్రభావం ఉంటుందని తెలిపింది. మరొక తుఫాను వాయువ్యంగా ఆనుకుని ఉన్న పశ్చిమ-మధ్య అరేబియా సముద్రంపై కేంద్రీకృతమై ఉంది. ఈ వాతావరణ వ్యవస్థల సమిష్టి ప్రభావంతో కేరళ వ్యాప్తంగా భారీ నుంచి అతిభారీ వర్షాలు కురుస్తాయని తెలిపింది. రాబోయే ఐదు రోజుల్లో మంగళవారం నుండి శనివారం (జూలై 23) వరకు విస్తృతంగా తేలికపాటి లేదా మోస్తరు వర్షపాతం, ఉరుములుమెరుపులతో కూడిన వర్షం కురుస్తుంది. మంగళవారం నుండి శుక్రవారం వరకు (జూలై 19-22) ఒంటరిగా భారీ వర్షాలు కురుస్తాయని తెలిపింది. ఈ క్రమంలోనే ప్రస్తుతం ఎల్లో అలర్ట్ ప్రకటించబడింది.
జిల్లా స్థాయి హెచ్చరికల విషయానికొస్తే, మంగళవారం కాసరగోడ్, కన్నూర్ జిల్లాలకు ఎల్లో హెచ్చరికలు జారీ చేయబడ్డాయి. బుధవారం కన్నూర్, పాలక్కాడ్, మలప్పురం ప్రాంతాలకు, గురువారం ఇడుక్కి, పాలక్కాడ్, ఎర్నాకులం, అలపుజా, కొట్టాయం, మలప్పురం ప్రాంతాలకు ఎల్లో అలర్ట్ ప్రకటించారు. కేరళలో గత వారం రోజుల నుంచి వర్షాలు, ఉరుములతో కూడిన జల్లులు కురుస్తున్నాయి. సమృద్ధిగా కురుస్తున్న జల్లులు రాష్ట్రానికి అనేక ప్రయోజనాలను తెచ్చిపెడుతున్నప్పటికీ, కొన్నిసార్లు అవి విధ్వంసానికి కూడా కారణం కావచ్చు. ఎందుకంటే ఇదివరకు వర్షాకాలంలో కేరళ అనేక వరద విపత్తులను ఎదుర్కొంది. గత శనివారం (జూలై 16) ఉత్తర కేరళ జిల్లాల్లో వర్షాలకు సంబంధించిన సంఘటనల్లో నలుగురు మరణించారు. వీరిలో ఇద్దరుకోజికోడ్‌లో ఒక్కొక్కరు వయనాడ్, కాసరగోడ్‌లో వర్షాల కారణంగా ప్రాణాలు కోల్పోయారు. అలాగే, ముల్లపెరియార్, ఇడుక్కి సహా అనేక ఇతర డ్యామ్‌లలో నీటి మట్టాలు పెరగడం ప్రారంభించాయి. అప్రమత్తమైన అధికారులు ఆదివారం అనేక ప్రాంతాల్లో వరద హెచ్చరికలను జారీ చేశారు.
నీటి మట్టాలు పెరుగుతున్న నేపథ్యంలో కూనమంగళం, కొలిక్కల్ వద్ద పూనూర్ నది ఒడ్డున ఉండే వారి కోసం కోజికోడ్ జిల్లా యంత్రాంగం చర్యలు చేపట్టింది. రాష్ట్రంలో కురుస్తున్న వర్షాల కారణంగా దాదాపు వంద ఇళ్లు దెబ్బతిన్నాయి. పాలక్కాడ్, మలప్పురం వంటి లోతట్టు ప్రాంతాలు వారం రోజుల నుంచి ముంపునకు గురవుతున్నాయి. పలుచోట్ల చెట్లు కూలిపోవడంతో ట్రాఫిక్‌కు తీవ్ర అంతరాయం ఏర్పడింది. సోమవారం, కేరళలోని ఇడుక్కి జిల్లాలోని వండిపెరియార్ సమీపంలోని సత్రం వద్ద ఎయిర్‌స్ట్రిప్‌లో కొంత భాగం నిరంతర భారీ వర్షాల కారణంగా కొండచరియలకు కొట్టుకుపోయింది. సెమీ-నిర్మిత ఎయిర్‌స్ట్రిప్ 100 మీటర్ల పొడవున కుంగిపోయింది.
