దేశ వాణిజ్య రాజధాని ముంబైపై వరుణుడు ఏమాత్రం కరుణ చూపడం లేదు. గత శుక్రవారం మొదలైన వర్షాలు నేటి వరకు కొనసాగుతూనే ఉన్నాయి.
దేశ వాణిజ్య రాజధాని ముంబైపై వరుణుడు ఏమాత్రం కరుణ చూపడం లేదు. గత శుక్రవారం మొదలైన వర్షాలు నేటి వరకు కొనసాగుతూనే ఉన్నాయి. దీనికి తోడు థానే, పాల్ఘార్ ప్రాంతాల్లో ఈ నెల 2, 4, 5 తేదీల్లో అతి భారీ వర్షాలు కురుస్తాయన్న వాతావరణ విభాగం హెచ్చరికలు జారీ చేయడంతో ముంబై జనాన్ని మరింత ఆందోళనకు గురిచేస్తోంది.
ఆది, సోమవారాల్లో నగరంలో 540 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదైనట్లు ముంబై నగరపాలక సంస్థ కమీషనర్ తెలిపారు. ఈ దశాబ్ధంలోనే ఇది గరిష్టమని ఆయన వివరించారు. భారీ వర్షాల నేపథ్యంలో ముంబై స్తంభించింది.
ఇళ్లు, వీధులు, రోడ్లు నోటితో నిండిపోయాయి.. రహదారులు చెరువులను తలపిస్తూ.. అపార్ట్‌మెంట్లు నీటిలో చిక్కుకుపోయాయి. వర్షం కారణంగా నగరంలో రవాణా వ్యవస్థ స్తంభించింది.
జోగేశ్వరి-విఖ్రోలి లింక్ రోడ్, ఎస్‌వీ రోడ్, ఎల్‌బీఎస్ మార్గ్‌తో పాటు ప్రధాన రహదారులు జలసంద్రమయ్యాయి. చర్చ్‌గేట్, మెరైన్ లైన్, భక్తిపార్క్ ఏరియాలలో తీవ్ర ట్రాఫిక్ ఇబ్బందులు తలెత్తాయి.
దీంతో హింద్‌మాతా జంక్షన్ నుంచి ట్రాఫిక్‌ను మళ్లీస్తున్నారు. మరోవైపు రైలు, విమాన సర్వీసులకు అంతరాయం ఏర్పడింది. ముంబై నుంచి వివిధ ప్రాంతాలకు వెళ్లాల్సిన అనేక రైళ్లను రైల్వేశాఖ రద్దు చేసింది.
సోమవారం రాత్రి ముంబై విమానాశ్రయంలోని రన్‌వేపై ఓ విమానం ల్యాండింగ్ సమయంలో జారడంతో ఆ రన్‌వేను అధికారులు మూసివేశారు. సదరు విమానం జారిన తర్వాత సుమారు 54 విమానాలను దారి మళ్లించారు.
మరోవైపు భారీ వర్షాల కారణంగా శిథిలావస్థలో ఉన్న కట్టడాలు కూలుతున్నాయి. వేర్వేరు ప్రమాదాల్లో మొత్తం 40 మంది దుర్మరణం పాలయ్యారు. మహారాష్ట్ర ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నవీస్ రాష్ట్రంలోని పరిస్ధితిని ఎప్పటికప్పుడు సమీక్షిస్తున్నారు. అత్యవసరమైతే తప్ప ప్రజలు బయటకు రావొద్దని ముఖ్యమంత్రి కార్యాలయం ప్రజలకు విజ్ఞప్తి చేసింది.
