Assam Floods: ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాలకు బ్రహ్మపుత్ర నది నీటిమట్టం గణనీయంగా పెరగడంతో అసోంలోని చిరాంగ్, బొంగైగావ్ జిల్లాలు జలదిగ్బంధంలో చిక్కుకున్నాయి. పొరుగున ఉన్న భూటాన్ కురిచు డ్యామ్ నుంచి అదనపు నీటిని విడుదల చేస్తుందని అసోం ముఖ్యమంత్రి హిమంత బిశ్వ శర్మ ఇప్పటికే వరద హెచ్చరికలు జారీ చేశారు. అలాగే, బెకి, మానస్ నదులు ప్రమాద స్థాయిని మించి ప్రవహిస్తున్నాయా లేదా అనే దానిపై అప్రమత్తంగా ఉండాలని అసోం ప్రభుత్వం జిల్లా యంత్రాంగాలను అప్రమత్తం చేసింది.
Assam Floods-Over 60K Lives Affected: ఉత్తర భారతం మాత్రమే కాదు, తీవ్రమైన వర్షాల, వరదల కారణంగా ఈశాన్య భారతంలోని అనేక ప్రాంతాలు ప్రభావితం అయ్యాయి. అసోం, సిక్కిం, ఉత్తర బెంగాల్‌లోని పలు ప్రాంతాల్లో భారీ వర్షాలతో కొండచరియలు విరిగిపడటం, వరదలు సంభవించాయి. అప్రమత్తమైన అధికారులు రెస్క్యూ, రిలీఫ్ కార్యకలాపాలను వేగవంతం చేశారు. అసోంలో వరద పరిస్థితి మరింత దారుణంగా మారడంతో 67 జిల్లాల్లో బాధితుల సంఖ్య 689,17కి చేరింది. బ్రహ్మపుత్ర సహా ప్రధాన నదులు పలు చోట్ల ప్రమాద స్థాయిని మించి ప్రవహిస్తుండటం పరిస్థితిని మరింత తీవ్రతరం చేసింది. అదృష్టవశాత్తు గత 24 గంటల్లో కొత్తగా ఎలాంటి మరణాలు నమోదు కాలేదని, మృతుల సంఖ్య ఏడుగా ఉందని అసోం రాష్ట్ర విపత్తు నిర్వహణ అథారిటీ (ఏఎస్డీఎంఏ) తెలిపింది.
బక్సా, బిస్వనాథ్, బొంగైగావ్, చిరాంగ్, ధేమాజీ, ధుబ్రి, దిబ్రూఘర్, గోలాఘాట్, జోర్హాట్, కోక్రాజార్, లఖింపూర్, మజులి, నాగావ్, నల్బరీ, శివసాగర్, తముల్‌పూర్, తిన్సుకియాతో సహా ప్రభావిత జిల్లాల సంఖ్య 10 నుండి 17కి పెరిగింది. ధుబ్రీ, తేజ్ పూర్ వద్ద బ్రహ్మపుత్ర నదితో పాటు గోలక్ గంజ్ వద్ద బెకి, బురిడిహింగ్, సంకోష్ నదులు ప్రమాద స్థాయిని దాటాయి. పరిస్థితిని మరింత దిగజార్చే విధంగా భూటాన్ నుండి అదనపు నీటిని విడుదల చేశారు, ఇది పశ్చిమ అసోం జిల్లాల్లో అప్రమత్తతకు దారితీసింది. అదనపు నీటిని గేట్ల ద్వారా మళ్లించడం ద్వారా నీటి ప్రవాహాన్ని నియంత్రించే ప్రయత్నాలు చేస్తున్నామని ముఖ్యమంత్రి హిమంత బిశ్వ శర్మ హామీ ఇచ్చారు. అయితే, విడుదల చేసే నీటి పరిమాణం పొరుగు దేశంలోని ఎగువ పరిస్థితిపై ఆధారపడి ఉంటుంది.
బాధితులకు ఉపశమనం కల్పించేందుకు 78 సహాయ శిబిరాలు, పంపిణీ కేంద్రాలను ఏర్పాటు చేసి 4,531 మందికి వసతి కల్పించారు. వరదల వల్ల 2,770 హెక్టార్ల పంట నష్టం వాటిల్లగా, 49,535 పశువులు ప్రభావితం అయ్యాయి. పలు జిల్లాల్లో భారీగా కోతకు గురికావడంతో పలు కరకట్టలు, రోడ్లు దెబ్బతిన్నాయి. వరద పరిస్థితిని చక్కదిద్దేందుకు, అవసరమైన వారికి అండగా నిలిచేందుకు అధికారులు అహర్నిశలు శ్రమిస్తున్నారు. బాధితులను ఆదుకునేందుకు ఆశ్రయం, నిత్యావసర సరుకుల పంపిణీ సహా సహాయక చర్యలు కొనసాగుతున్నాయి.
సిక్కింలో ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాలకు కొండచరియలు విరిగిపడటంతో ఉత్తర ప్రాంతాలు అతలాకుతలమయ్యాయి. జవహర్ లాల్ నెహ్రూ రోడ్డు వెంబడి 9వ మైలు ప్రాంతంలో కొండచరియలు విరిగిపడటంతో భారత్, చైనాలను కలిపే నాథూలా పాస్ తో పాటు సిక్కిం రాజధాని గ్యాంగ్టక్ నుంచి సోమ్గో సరస్సు, బాబా మందిర్ వంటి పర్యాటక ప్రాంతాల మధ్య సంబంధాలు తెగిపోయాయి. ఉత్తర సిక్కింలో గత ఏడు రోజులుగా భారీ వర్షాలు కురుస్తున్నాయి.
