ఉన్నట్టుండి కుండపోత వర్షం కురిసింది. దీంతో వీధులు జలమయం అయ్యాయి. లోతట్టు ప్రాంతాలు నీట మునిగాయి. రోడ్లపై భారీగా వరద నీరు వచ్చి చేరడంతో ప్రయాణికులు అవస్థలు పడుతున్నారు. కర్ణాటక రాజధానిలో ఇప్పుడీ పరిస్థితి ఉన్నది. మరో మూడు రోజలపాటు భారీ వర్షాలు ఉన్నాయని ఐఎండీ అంచనా వేసింది.
బెంగళూరు: కర్ణాటక రాజధాని బెంగళూరులో గురువారం ఉన్నట్టుండి వర్షాలు ముంచెత్తాయి. కుండపోతగా వర్షం కురిసింది. దీంతో రోడ్లు, పేవ్‌మెంట్లు నీటమునిగిపోయాయి. కొన్ని చోట్ల వరద నీరు భారీగా నిలిచిపోయింది. కొన్ని వీధుల్లో దాదాపు నడుము లోతు వరకు వరద నీరు చేరడం గమనార్హం. ప్రయాణికులు అవస్థలు పడ్డారు. దీంతో బృహత్ బెంగళూరు మహానగర పాలికే (బీబీఎంపీ), అగ్నిమాపక శాఖలు ఎమర్జెన్సీ ఆపరేషన్ చేపట్టాయి.
ఇదిలా ఉండగా, మరో మూడు రోజులు బెంగళూరులో భారీ వర్షాలు తప్పవని వాతావరణ శాఖ హెచ్చరించింది. బెంగళూరులో మూడు రోజులపాటు భారీ వర్షాలు కురుస్తాయని ఐఎండీ వెల్లడించింది. వర్షాలకు సంబంధించిన వీడియోలను సోషల్ మీడియాలో స్థానికులు పోస్టు చేస్తున్నారు. న్యూస్ ఏజెన్సీ ఏఎన్ఐ కూడా బానాశంకారీ, కత్రెగుప్పి, జయప్రకాశ్ నగరలలో వరద నీటిని ఓ వీడియోలో చిత్రించి సోషల్ మీడియాలో పోస్టు చేసింది.
నగర పౌరుల నుంచి ఎలాంటి ఫిర్యాదు వచ్చినా తక్షణమే పరిష్కరించాలని, ముఖ్యంగా చెట్లు పెలికిలించుకువచ్చే ఘటనలు, వరద నీరు రోడ్లను ముంచేయడం, ట్రాఫిక్ సమస్యలను వెంటనే సాల్ల్ చేయాలని బెంగళూరు సివిక్ ఏజెన్సీ చీఫ్ అధికారులను ఆదేశించారు. ఇందులో ఎంతమాత్రం నిర్లక్ష్యం కనిపించినా వెంటనే చర్యలు తీసుకుంటామని బీబీఎంపీ చీఫ్ కమిషనర్ గౌరవ్ గుప్తా తెలిపారు. ఆయన అధికారులతో అత్యవసర సమావేశాన్ని నిర్వహించారు.
వర్షపాతం కారణంగా పౌరులు ఇబ్బందులు పడకుండా చూసుకోవాలని, బీబీఎంపీ బృందాలు వెంటనే సమస్య ఉన్నట్టు తెలిస్తే పరుగున వెళ్లాలని బీబీఎంపీ చీఫ్ కమిషనర్ గుప్తా తెలిపారు. అంతేకాదు, నీరు బ్లాక్ అయ్యే ప్రాంతాలను పసిగట్టాలని, ముందుగానే నీటి సరఫరా సులువుగా వెళ్లేలా చర్యలు తీసుకోవాలని వివరించారు.
కర్ణాటకలో ముఖ్యంగా కేరళ-మహే, దక్షిణ కర్ణాటకలో వచ్చే ఐదు రోజుల్లో సాధారణం నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశాలు ఉన్నట్టు ఐఎండీ అంచనా వేసింది. నైరుతి అరేబియా సముద్రంలో లక్షదీవుల ఏరియాలో ఓ అల్పపీడనం ఏర్పడినట్టు తెలిసింది. దీని కారణంగా తమిళనాడులోని కొన్ని ప్రాంతాలు, పుదుచ్చేరి, కరైకాల్, తీర ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, రాయలసీమ, కర్ణాటక ఉత్తర, తీర ప్రాంతాల్లో వచ్చే ఐదు రోజులు వర్షాలు కొడతాయని ఐఎండీ తెలిపింది.
నైరుతి రుతుపవనాల కారణంగా దేశంలో సాధారణ వర్షపాతం నమోదవుతుందని భారత వాతావరణ శాఖ అంచనా వేసింది. దీర్ఘకాల (1971-2020 కాలం) సగటులో 96 నుంచి 104 శాతం వరకు వర్షపాతం నమోదుకావచ్చని తెలిపింది. భారతదేశంలోని ఉత్తర ప్రాంతాలు, మధ్య భారతదేశం, హిమాలయ పర్వత ప్రాంతాలు, వాయువ్య భారతదేశంలోని కొన్ని ప్రాంతాలలో సాధారణ లేదా సాధారణం కంటే ఎక్కువ వర్షపాతం నమోదు అయ్యే అవకాశం ఉందని వెల్లడించింది. మరోవైపు ఈశాన్య భారతదేశంలోని అనేక ప్రాంతాలలో, వాయువ్య భారతదేశంలోని కొన్ని ప్రాంతాలో, దక్షిణ భారతదేశంలో సాధారణం కంటే తక్కువ వర్షపాతం నమోదయ్యే అవకాశం ఉందని తెలిపింది.
