తమిళనాడు, పుదుచ్చేరిలలో రాగల 48 గంటల్లో భారీ వర్షం కురిసే అవకాశం ఉందని భారత వాతావరణ శాఖ తెలిపింది. హిందూ మహా సముద్రం, దానికి అనుకుని ఉన్న ఆగ్నేయ బంగాళాఖాతం ప్రాంతంలో 3.1 కి.మీ ఎత్తు వరకు ఉపరితల ఆవర్తనం ఏర్పడింది.

దీని ప్రభావంతో శ్రీలంకకు ఆగ్నేయంగా దక్షిణ మధ్య బంగాళాఖాతంలో అల్పపీడనం ఏర్పడింది. ఇది రానున్న 24 గంటల్లో మరింత బలపడి వాయుగుండంగా మారుతుందని ఐఎండీ పేర్కొంది.

వాయుగుండం వాయువ్యంగా పయనించి తుఫాన్‌గా బలపడుతుందని అధికారులు చెబుతున్నారు. ఇది దక్షిణ తమిళనాడు తీరం దిశగా కదులుతుంది. దీని ప్రభావంతో రానున్న 24 గంటల్లో తమిళనాడు తీరంతో పాటు పుదుచ్చేరిలో ఉరుములతో కూడిన భారీ వర్షం కురిసే అవకాశముందని వాతావరణ శాఖ తెలిపింది.

తీరం వెంబడి గంటకు 45 నుంచి 55 కిలోమీటర్ల వేగంతో బలమైన ఈదురుగాలులు వీస్తాయని, అక్కడక్కడా పిడుగులు పడతాయని ప్రజలు అప్రమత్తంగా ఉండాలని హెచ్చరించింది.