కేరళలో ఎడతెరిపి లేకుండా వర్షాలు కురుస్తున్నాయి. భారీ వర్షాల నేపథ్యంలో కేరళలోని ఏడు జిల్లాలకు భారత వాతావరణ శాఖ (ఐఎండీ) రెడ్ అలర్ట్ ప్రకటించింది. ఆ జాబితాలో తిరువనంతపురం, కొల్లాం, పతనంతిట్ట, అలప్పుజా, కొట్టాయం, ఎర్నాకులం, ఇడుక్కి జిల్లాలు ఉన్నాయి. 

కేరళలో ఎడతెరిపి లేకుండా వర్షాలు కురుస్తున్నాయి. భారీ వర్షాల నేపథ్యంలో కేరళలోని ఏడు జిల్లాలకు భారత వాతావరణ శాఖ (ఐఎండీ) రెడ్ అలర్ట్ ప్రకటించింది. ఆ జాబితాలో తిరువనంతపురం, కొల్లాం, పతనంతిట్ట, అలప్పుజా, కొట్టాయం, ఎర్నాకులం, ఇడుక్కి జిల్లాలు ఉన్నాయి. కేరళలో కురుస్తున్న భారీ వర్షాలకు ఇప్పటి వరకు ఆరుగురు ప్రాణాలు కోల్పోయారు. పలు జిల్లాల్లో ఇళ్లు ధ్వంసమయ్యాయి. భారీ వర్షాల నేపథ్యంలో ఎటువంటి ప్రాణ నష్టం జరగకుండా అధికార యంత్రాంగం చర్యలు చేపట్టిందని కేరళ సీఎం పినరయి విజయన్ చెప్పారు. 

గత అనుభవాలను.. ముఖ్యంగా 2018లో సంభవించిన వరదల నుంచి నేర్చుకున్న పాఠాలను దృష్టిలో ఉంచుకుని ముందస్తు జాగ్రత్తలు తీసుకున్నట్లు సీఎం విజయన్ చెప్పారు. వర్షాలకు ఐదు ఇళ్లు పూర్తిగా, 55 పాక్షికంగా దెబ్బతిన్నాయని వెల్లడించారు. ఆరుగురు మరణించారని, ఒకరు గల్లంతయ్యారని తెలిపారు.

తిరువనంతపురం, కొల్లాం, పతనంతిట్ట, అలప్పుజ, కొట్టాయం, ఎర్నాకులం, ఇడుక్కి జిల్లాలకు సోమ, మంగళవారాల్లో రెడ్ అలర్ట్‌లు జారీ చేసిన ఐఎండీ.. ఆగస్టు 3న 11 జిల్లాల్లో, ఆగస్టు 4న 9 జిల్లాల్లో రెడ్ అలర్ట్‌ను జారీ చేసినట్లు ఆయన తెలిపారు. డిజాస్టర్ మేనేజ్‌మెంట్ అథారిటీకి చెందిన స్టేట్ ఎమర్జెన్సీ ఆపరేషన్స్ సెంటర్‌ను ఏర్పాటు చేశామని సీఎం విజయన్ చెప్పారు. అన్ని జిల్లాలు, తాలూకాల్లో కంట్రోల్ రూమ్‌లు ప్రారంభిస్తామని తెలిపారు.

ఇడుక్కి, కోజికోడ్‌, వాయనాడ్‌, త్రిసూర్‌ జిల్లాల్లో నాలుగు బృందాలు ఎన్‌డీఆర్ఎఫ్ బృందాలు అందుబాటులో ఉన్నాయని సీఎం విజయన్ తెలిపారు. మరో నాలుగు బృందాలు త్వరలో రాష్ట్రానికి చేరుకోనున్నాయని.. వాటిని ఎర్నాకులం, కొట్టాయం, కొల్లాం, మలప్పురం జిల్లాల్లో మోహరించనున్నట్టుగా చెప్పారు. మరికొద్ది రోజులు భారీ వర్షాలు కురిస్తే లోతట్టు ప్రాంతాల్లో ఇబ్బందికర పరిస్థితులు తలెత్తే అవకాశాలు ఉన్నాయని.. ఆ ప్రమాదాన్ని నివారించేందుకు దాదాపు 17 డ్యామ్‌ల నుంచి నీటిని విడుదల చేస్తున్నామని తెలిపారు.

అడిషనల్ చీఫ్ సెక్రటరీ నేతృత్వంలోని డ్యామ్ మేనేజ్‌మెంట్ కమిటీ.. రాష్ట్రంలోని డ్యామ్‌లలో నీటి మట్టాన్ని అంచనా వేసిందని, ప్రస్తుతం ఆందోళన చెందాల్సిన పని లేదని సీఎం విజయన్ చెప్పారు. వీటిని దృష్టిలో ఉంచుకుని.. కొండచరియలు విరిగిపడటం, కొండ ప్రాంతాల్లో వరదలు, లోతట్టు ప్రాంతాలకు వరద ముప్పు వంటి సంభావ్య విపత్తులను అంచనా వేయడానికి, అతి భారీ వర్షాలు కురిసే ప్రాంతాలలోపాటు వాటిని ఆనుకుని ఉన్న ప్రదేశాలలో కూడా సన్నాహాక చర్యలు అవసరమని సీఎం విజయన్ చెప్పారు. 

ఈ క్రమంలో కొండచరియలు విరిగిపడే అవకాశం ఉన్న ప్రాంతాల నుంచి, వరద ముంపునకు గురయ్యే ప్రాంతాల్లో నివసించే ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలించే పనులను వెంటనే పూర్తి చేసేందుకు చర్యలు తీసుకున్నట్లు సీఎం విజయన్ తెలిపారు. రుతుపవన కాలంలో సంభవించే భారీ వర్షాలు, వరదలను ఎదుర్కోవడానికి రాష్ట్ర ప్రభుత్వం ఈ ఏడాది మార్చిలో ముందస్తుగా అంచనాలు, మాక్ డ్రిల్‌లు, సమావేశాలు నిర్వహించడం ద్వారా అవసరమైన సన్నాహాలు ప్రారంభించిందని ఆయన చెప్పారు.

అత్యవసర పరిస్థితిని ఎదుర్కొనేందుకు రాష్ట్ర, జిల్లా, తాలూకా స్థాయి కంట్రోల్‌ రూమ్‌లతో పాటు ప్రతి జిల్లాలో ప్రత్యేక పోలీసు కంట్రోల్‌ రూమ్‌ను ఏర్పాటు చేయనున్నట్లు సీఎం విజయన్ తెలిపారు. ఎమర్జెన్సీ పరిస్థితులను ఎదుర్కొనేందుకు సిద్ధంగా ఉండాలని అన్ని పోలీస్ స్టేషన్ల విపత్తు ప్రతిస్పందన బృందాలను ఆదేశించినట్లు తెలిపారు. అన్ని కంట్రోల్‌రూమ్‌లు 24 గంటలూ పనిచేస్తాయని తెలిపారు. అన్ని పోలీస్ స్టేషన్లలో మట్టి తొలగింపు పరికరాలు, పడవలు, ఇతర ప్రాణాలను రక్షించే పరికరాలను సిద్ధంగా ఉంచుకోవాలని పోలీసులను ఆదేశించినట్లు తెలిపారు. మత్స్యకారులు సముద్రంలోకి వెళ్లకుండా చూడాలని.. ఈ మేరకు జిల్లా అధికారులు తప్పకుండా చర్యలు తీసుకోవాలని సూచించారు. సహాయక శిబిరాలు ఏర్పాటు చేసి వాటిని బాధితులకు అందుబాటులో ఉండేలా ఆదేశాలు జారీ చేసినట్లు తెలిపారు.

భారీ వర్షాల నేపథ్యంలో.. ఎర్నాకులం, తిరువనంతపురం జిల్లాల్లో ఇప్పటికే పాఠశాలలు, ఇతర విద్యాసంస్థలకు ఆగస్టు 2న సెలవు ప్రకటించారు. భారీ వర్షాల సమయంలో ప్రమాదాలు ఎక్కువగా జరిగే అవకాశం ఉందని.. అందువల్ల ప్రతి ఒక్కరూ అప్రమత్తంగా ఉండాలని, కొండ ప్రాంతాలలో రాత్రిపూట ప్రయాణించకుండా చూసుకోవాలని సూచించారు.