Bangalore: క‌ర్నాట‌క‌లోని పలు ప్రాంతాల్లో కురుస్తున్న భారీ వర్షాలతో జనజీవనం స్తంభించిపోయింది. చాలా ప్రాంతాల్లో పాఠశాలలు, కాలేజీలు మూత‌ప‌డ్డాయి. మ‌రో ఐదు రోజుల పాటు కర్ణాటకలోని పలు ప్రాంతాల్లో భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ తెలిపింది. నైరుతి రుతుపవనాలు, ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాల దృష్ట్యా ద‌క్షిణ క‌న్న‌డ ప్రాంతంలోని పాఠశాలలు, కళాశాలలకు సెల‌వు ప్ర‌క‌టించిన‌ట్టు అధికార యంత్రాంగం ప్ర‌క‌టించింది. 

Heavy rain in Karnataka: క‌ర్నాట‌క‌లోని పలు ప్రాంతాల్లో కురుస్తున్న భారీ వర్షాలతో జనజీవనం స్తంభించిపోయింది. చాలా ప్రాంతాల్లో పాఠశాలలు, కాలేజీలు మూత‌ప‌డ్డాయి. మ‌రో ఐదు రోజుల పాటు కర్ణాటకలోని పలు ప్రాంతాల్లో భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ తెలిపింది. నైరుతి రుతుపవనాలు, ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాల దృష్ట్యా ద‌క్షిణ క‌న్న‌డ ప్రాంతంలోని పాఠశాలలు, కళాశాలలకు సెల‌వు ప్ర‌క‌టించిన‌ట్టు అధికార యంత్రాంగం ప్ర‌క‌టించింది.

వివ‌రాల్లోకెళ్తే.. కర్నాట‌క‌లోని దక్షిణ కన్నడ ప్రాంతంలో వాన‌లు దంచికొడుతున్నాయి. కుండ‌పోత వ‌ర్షం నేప‌థ్యంలో 'ఆరెంజ్ అలర్ట్' ప్ర‌క‌టించారు. ఈ క్ర‌మంలోనే దక్షిణ కన్నడ జిల్లా డిప్యూటీ కమిషనర్ జూలై 4 న మంగళూరు, బంట్వాల్, ముల్కి, మూడ్బిద్రి, ఉల్లాల్ లోని అంగన్వాడీ కేంద్రాలు, ప్రాథమిక-ఉన్నత పాఠశాల, ప్రీ-యూనివర్శిటీ, ప్రభుత్వ, ప్ర‌యివేటు పాఠశాలల విద్యార్థులకు సెలవు ప్రకటించారు. దక్షిణ కన్నడలో జూలై 6 వరకు ఆరెంజ్ అలర్ట్ ప్రకటించారు.

లోతట్టు ప్రాంతాలు, సరస్సులు, నదీ తీరాలు, సముద్ర తీరాల్లోకి పిల్లలను వెల్ల‌కుండా చూసుకోవాల‌ని దక్షిణ కన్నడ డిప్యూటీ కమిషనర్ జారీ చేసిన మార్గదర్శకాల్లో తల్లిదండ్రులకు సూచించారు. మత్స్యకారులు సముద్రంలో వేటకు వెళ్లొద్దని సూచించారు. జిల్లా, తాలూకా స్థాయి అధికారులు సిద్ధంగా ఉండాలనీ, విపత్తు నిర్వహణ చర్యలను నిర్విఘ్నంగా చేపట్టాలని ఆదేశించారు. ప్రతి తాలూకాలో కేర్ సెంటర్ ను సిద్ధంగా ఉంచాలని డిపార్ట్ మెంటల్ అధికారులను ఆదేశించినట్లు డిప్యూటీ కమిషనర్ ఉత్తర్వుల్లో పేర్కొన్నారు.

గంటకు 30-40 కిలోమీటర్ల వేగంతో ఉరుములు, మెరుపులతో కూడిన తేలికపాటి నుంచి ఒక మోస్తరు వర్షాలు/ ఉరుములు, మెరుపులతో కూడిన వర్షాలు కోస్తా ప్రాంతాల‌ను తాకే అవకాశం ఉందని భారత వాతావరణ శాఖ తెలిపింది. బళ్లారి, చామరాజ్ న‌గ‌ర్, చిక్కబళ్లాపుర, చిత్రదుర్గ, దక్షిణ కన్నడ, దావణగిరి, కోలార్, కొప్పల్ రాయచూర్, ఉత్తర కన్నడ జిల్లాలు ప్రభావితమయ్యే అవకాశం ఉందని తెలిపింది. కాగా, కేరళ, కర్నాట‌క‌, మహారాష్ట్రలో భారీ వర్షాలు కురుస్తుండటంతో దక్షిణ భారతదేశంలో రుతుపవనాలు మరింత బలపడనున్నాయి. భారత వార్షిక రుతుపవనాలు ఆదివారం దేశం మొత్తాన్ని కవర్ చేశాయని, అయితే ఈ సీజన్లో ఇప్పటివరకు వర్షపాతం సగటు కంటే 10% తక్కువగా ఉందని ప్రభుత్వ వాతావరణ కార్యాలయం తెలిపింది.