గుజరాత్‌లో వర్ష బీభత్సం.. చెరువులను తలపిస్తున్న రోడ్లు.. వరదనీటిలో తేలియాడుతున్న కార్లు..
గుజరాత్‌లోని పలు ప్రాంతాల్లో భారీ వర్షాలు బీభత్సం సృష్టిస్తున్నాయి. మంగళవారం కురిసిన భారీ వర్షాల కారణంగా పలు ప్రాంతాలు చెరువులను తలపిస్తున్నాయి.

గుజరాత్‌లోని పలు ప్రాంతాల్లో భారీ వర్షాలు బీభత్సం సృష్టిస్తున్నాయి. మంగళవారం కురిసిన భారీ వర్షాల కారణంగా పలు ప్రాంతాలు చెరువులను తలపిస్తున్నాయి. రాజ్‌కోట్, సూరత్, గిర్ సోమనాథ్ జిల్లాల్లో కుండపోత వర్షం కారణంగా ఎటూ చూసినా వరద నీరే కనిపిస్తుంది. కొన్ని గంటల వ్యవధిలోనే పలు ప్రాంతాల్లో 300 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదైందని అధికారులు చెబుతున్నారు. భారీ వర్షాల నేపథ్యంలో అప్రమత్తమైన అధికారులు.. లోతట్టు ప్రాంతాల నుంచి ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలిస్తున్నారు.
గిర్ సోమనాథ్ జిల్లాలోని సూత్రపాద తాలూకాలో మంగళవారం ఉదయం 6 గంటల నుండి కేవలం 14 గంటల్లో రాష్ట్రంలోనే అత్యధికంగా 345 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదైందని స్టేట్ ఎమర్జెన్సీ ఆపరేషన్ సెంటర్ (ఎస్‌ఈవోఎస్) తెలిపింది. ఇక, రాజ్‌కోట్ జిల్లాలోని ధోరాజి తాలూకాలో మంగళవారం ఉదయం 6 గంటల నుంచి 14 గంటల వ్యవధిలో దాదాపు 250 మి.మీ వర్షపాతం నమోదుకాగా.. కేవలం రెండు గంటల్లో 145 మి.మీ జల్లులు నమోదైందని ఎస్‌ఈవోఎస్ పేర్కొంది.
భారీ వరదల కారణంగా పలు ప్రాంతాల్లో వీధులు జలమయం కావడం, కార్లు నీటిలో మునిగిపోవడం వంటి దృశ్యాలు కనిపిస్తున్నాయి. కొన్ని వాహనాలు వరద నీటిలో తేలియాడుతూ కనిపిస్తున్నాయి. ఇందుకు సంబంధించి దృశ్యాలు సోషల్ మీడియాలో కూడా వైరల్ అవుతన్నాయి.
రాబోయే రోజుల్లో సౌరాష్ట్ర, దక్షిణ గుజరాత్ ప్రాంతాల్లోని కొన్ని జిల్లాల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని భారత వాతావరణ శాఖ (ఐఎండీ) అంచనా వేసింది. జూలై 19-21 మధ్య సౌరాష్ట్ర ప్రాంతంలోని అమ్రేలి, భావ్‌నగర్ జిల్లాలు, దక్షిణ గుజరాత్‌లోని వల్సాద్ జిల్లాలో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని.. పరిస్థితిని ఎదుర్కోవటానికి స్థానిక అధికారులకు అవసరమైన సూచనలు అందించామని గుజరాత్ రాష్ట్ర ప్రభుత్వం తెలిపింది.
గుజరాత్‌లోని 206 రిజర్వాయర్‌లలో 43 రిజర్వాయర్లలో భారీ నీటి ప్రవాహం కారణంగా హై అలర్ట్ ప్రకటించారు. 18 రిజర్వాయర్లు అలర్ట్ మోడ్‌లో ఉన్నాయని.. మరో 19కి హెచ్చరికలు జారీ చేసినట్లు ప్రభుత్వం ఒక ప్రకటనలో తెలిపింది. రాష్ట్రంలో వర్షాభావ పరిస్థితుల నేపథ్యంలో జాతీయ విపత్తు ప్రతిస్పందన దళం (ఎన్డీఆర్ఎఫ్), రాష్ట్ర విపత్తు ప్రతిస్పందన దళం (ఎస్డీఆర్‌ఎఫ్) బృందాలు అప్రమత్తంగా ఉన్నాయని ప్రభుత్వం తెలిపింది.