ముంబై: ముంబై నగరంలో  రెండు రోజుల పాటు భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ ప్రకటించింది. సోమవారం నుండి ముంబైలో వర్షాలు కురుస్తున్నాయి. ముంబైతోపాటు దాని శివారు ప్రాంతాల్లో వర్ష ప్రభావం అధికంగా ఉండే అవకాశం ఉందని ఐఎండీ హెచ్చరించింది.

ఇవాళ, రేపు భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ ప్రకటించింది.అరేబియా సముద్రంలో ఏర్పడ్డ అల్పపీడనం కారణంగా, సోమవారం ముంబైలో వర్షాలు కురుస్తూనే ఉన్నాయి.

ముంబైతో పాటు థానే, పుణె, రాయ్‌ఘడ్, రత్నగిరి జిల్లాల్లో కూడ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది. అత్యవసర సేవలు అందించే కార్యాలయాలు మినహా ఇతర కార్యాలయాలన్నీ కూడ ఇవాళ మూసివేయనున్నట్టుగా ముంబై కార్పోరేషన్ ప్రకటించింది.  ఇప్పటికే కురుస్తున్న వర్షాల కారణంగా ముంబైలోని 26 ప్రాంతాల్లో వరదలు సంభవించాయి.

గోరేగావ్, కింగ్ సర్కిల్, హింద్మాత, దాదర్, శివాజీ చౌక్, షెల్ కాలనీ, కుర్లా ఎస్టీ డిపో, బాంద్రా టాకీస్, సియోన్ రోడ్ వంటి ప్రాంతాల్లో రోడ్లన్నీ నీటితో నిండిపోయాయి.సోమవారం ఉదయం 8 గంటల నుండి ఇవాళ ఉదయం 6 గంటల వరకు ముంబైలో 230.06 మి.మీ వర్షపాతం నమోదైంది.

ముంబై లో లోకల్ ట్రైన్స్ ను నిలిపివేశారు. బస్సులను రూట్లు మళ్లించారు. ప్రజలు ఎవరూ కూడ రెండు రోజుల పాటు బయటకు రావొద్దని ప్రభుత్వం కోరింది.