Mansukh Mandaviya: దేశంలో ఔషధాల నాణ్యతను నిర్ధారించడానికి సమగ్ర ప్రమాద-ఆధారిత విశ్లేషణ నిరంతరం జరుగుతుందని కేంద్ర ఆరోగ్య మంత్రి మన్సుఖ్ మాండవియా అన్నారు. అలాగే.. నకిలీ మందుల వల్ల ఎవరూ చనిపోకుండా ప్రభుత్వం, నియంత్రణాధికారులు ఎల్లప్పుడూ అప్రమత్తంగా ఉంటారని తెలిపారు.

Mansukh Mandaviya: భారత్ లో తయారైన నకిలీ ఔషధాల వల్ల ఇతర దేశాల్లో మరణాలు సంభవిస్తున్నాయనే ఆరోపణలు వస్తున్న విషయం తెలిసిందే. తాజాగా ఆఫ్రికాలోని కామెరూన్ లో భారత్ తయారైన దగ్గు మందులను ఉపయోగించడం వల్ల పలువురు చిన్నారులు మరణించారనే ఆరోపణలు వచ్చాయి. ఈ నేపథ్యంలో కేంద్ర ఆరోగ్య మంత్రి శాఖ కీలక వ్యాఖ్యలు చేసింది. 

ఈ సందర్బంగా కేంద్ర ఆరోగ్య మంత్రి మన్సుఖ్ మాండవియా భారత్ జీరో-టోలరెన్స్ విధానాన్ని అనుసరిస్తోందని, భారతదేశంలో తయారైన కలుషిత దగ్గు సిరప్ కారణంగా మరణాల గురించి ఆందోళన వ్యక్తం చేసిన 71 కంపెనీలకు షోకాజ్ నోటీసులు జారీ చేసిందని, వాటిలో 18 కంపెనీలను మూసివేయాలని ఆదేశించినట్టు తెలిపారు. 

దేశంలో నాణ్యమైన మందులను ఉత్పత్తి చేసే విధంగా చర్యలు తీసుకుంటున్నామని, ఆ కంపెనీల నాణ్యతను నిర్ధారించడానికి సమగ్ర విశ్లేషణ నిరంతరం జరుగుతుందని కేంద్ర మంత్రి అన్నారు. అలాగే.. నకిలీ మందుల వల్ల ఎవరూ చనిపోకుండా ప్రభుత్వం, నియంత్రణాధికారులు ఎల్లప్పుడూ అప్రమత్తంగా ఉంటారు. భారత్ ప్రపంచానికే ఫార్మాసిటీ లాంటిదనీ,నాణ్యత విషయంలో రాజీపడే ప్రస్తక్తే లేదన్నారు. 

మాండవ్య ఇంకా మాట్లాడుతూ.. భారతీయ ఔషధాల గురించి ప్రశ్నలు తలెత్తినప్పుడు.. వాస్తవాలను కూడా పరిశీలించాలి.ఉదాహరణకు గాంబియాలో 49 మంది పిల్లలు మరణించారని కథనాలు వస్తున్నాయి. ఈ విషయం వాస్తవాలు చెప్పాలంటూ WHOకు లేఖ రాశాం. వాస్తవాలతో ఎవరూ తిరిగి సమాధానమివ్వలేదు. మృతికి గల కారణాలను తెలుసుకునేందుకు ప్రయత్నించగా చనిపోయిన పిల్లలలో ఓ చిన్నారికి డయేరియా సోకినట్లు గుర్తించారు. డయేరియా ఉన్న పిల్లలకు దగ్గు సిరప్‌ను ఎవరు సిఫార్సు చేశారు? అని మంత్రి ప్రశ్నించారు. 

తాము ఓ కంపెనీకి చెందిన శాంపిల్స్‌ను పరిశీలించామని ఆయన చెప్పారు. మొత్తం 24 శాంపిల్స్ తీసుకోగా అందులో నాలుగు ఫెయిల్ అయ్యాయని మంత్రి తెలిపారు. సాధారణంగా ఓ నమూనా విఫలమైతే.. మిగితా అన్ని నమూనాలు విఫలమవుతాయని మంత్రి అన్నారు. కానీ
20 శాంపిల్స్ పాస్ కావడం, నాలుగు శాంపిల్స్ ఫెయిల్ కావడం అసాధ్యం. ఇప్పటికీ మేము జాగ్రత్తగా ఉన్నాము. మన దేశంలో నాణ్యమైన మందులు ఉత్పత్తి అవుతున్నాయని నిర్ధారించడానికి తాము ప్రమాద ఆధారిత విశ్లేషణను కొనసాగిస్తున్నామని తెలిపారు. జూన్ 1 నుండి భారతదేశం దగ్గు సిరప్‌లను ఎగుమతి చేయడానికి ముందు పరీక్షను తప్పనిసరి చేశారని తెలిపారు.

దగ్గు సిరప్ ఎగుమతిదారులు జూన్ 1 నుండి ఎగుమతులకు ముందు ప్రభుత్వ ప్రయోగశాల జారీ చేసిన విశ్లేషణ ధృవీకరణ పత్రాన్ని సమర్పించాలని డైరెక్టరేట్ జనరల్ ఆఫ్ ఫారిన్ ట్రేడ్ (డిజిఎఫ్‌టి) గత నెలలో ఒక నోటిఫికేషన్‌లో తెలిపింది. తాము 125 కంటే ఎక్కువ కంపెనీలలో రిస్క్ ఆధారిత విశ్లేషణ చేసామనీ, తనిఖీ బృందాలు వారి సంస్థలను సందర్శించాయనీ మంత్రి మాండవ్య చెప్పారు. ఇందులో 71 కంపెనీలకు షోకాజ్ నోటీసులు ఇవ్వగా, 18 కంపెనీలకు మూసివేత నోటీసులు ఇచ్చినట్టు మంత్రి మాండవ్య తెలిపారు. 

ఈ ఏడాది ఫిబ్రవరిలో తమిళనాడుకు చెందిన గ్లోబల్ ఫార్మా హెల్త్‌కేర్ తన కంటి చుక్కల మొత్తం సరుకును రీకాల్ చేసింది. గత ఏడాది ప్రారంభంలో గాంబియా, ఉజ్బెకిస్థాన్‌లలో వరుసగా 66, 18 మంది పిల్లలు మరణించడానికి భారతదేశంలో తయారు చేసిన దగ్గు సిరప్ కారణమని ఆరోపణలు వస్తున్నాయి.

భారతదేశం 2022-23లో USD 17.6 బిలియన్ల విలువైన దగ్గు సిరప్‌ను ఎగుమతి చేసింది, అయితే 2021-22లో ఇది 17 బిలియన్ డాలర్లు. మొత్తంమీద భారతదేశం ప్రపంచవ్యాప్తంగా జెనరిక్ ఔషధాల యొక్క అతిపెద్ద సరఫరాదారు. వివిధ టీకాల కోసం ప్రపంచ డిమాండ్‌లో 50 శాతానికి పైగా సరఫరా చేస్తోంది. అదనంగా ఇది USలో 40 శాతం జనరిక్ ఔషధాలను , UKలో 25 శాతం ఔషధాలను సరఫరా చేస్తుంది భారత్.