న్యూఢిల్లీ: మాజీ ప్రధానమంత్రి అటల్ బీహరీ వాజ్‌పేయ్‌ అంత్యక్రియల సందర్భంగా పాక్ నుండి వచ్చిన  బృందంలో ముంబై దాడుల సూత్రధారి డేవిడ్ హేడ్లీ సవతి సోదరుడు గిలానీ రావడంపై సర్వత్రా చర్చ సాగుతోంది.

వాజ్‌పేయ్ అంత్యక్రియలు స్మృతిస్థల్‌లో ఆగష్టు 17వ తేదీన జరిగాయి. అంత్యక్రియల్లో పాల్గొనేందుకు పలు దేశాల నుండి విదేశాంగ మంత్రులు, ప్రతినిధులు హాజరయ్యారు. అయితే పాకిస్తాన్ నుండి  ఆ దేశ న్యాయ, సమాచార శాఖ మాజీ మంత్రి సయ్యద్ అలీ జాఫర్‌తో పాటు, ఆయనకు డైరెక్టర్‌గా వ్యవహరిస్తున్న దన్యాల్ గిలానీ కూడ ఉన్నారు.

26/11 ముంబైలో ఉగ్రదాడికి సూత్రధారి  డేవిడ్ హెడ్లీ సవతి సోదరుడు గిలానీ  విదేశాంగ శాఖ మంత్రి సుష్మాస్వరాజ్ ఏర్పాటు చేసిన సమావేశానికి  హజరయ్యేందుకు గిలానీ భారత్‌కు వచ్చినట్టు అధికారులు చెబుతున్నారు. 

అదే సమయంలో వాజ్‌పేయ్ మరణించడంతో  ఆయన అంత్యక్రియల్లో పాల్గొన్నారని చెప్పారు. ప్రభుత్వాధికారిగా గిలానీని అనుమతించకుండా నిరోధించేందుకు ఎలాంటి కారణాలు లేవన్నారు. గిలానీని బ్లాక్‌లిస్టులో కూడ లేడని విదేశాంగ ప్రతినిధి ఒకరు వ్యాఖ్యానించారు.

ప్రభుత్వాధికారిగా  తన దేశానికి సేవ చేయడమే  తన బాధ్యతగా  పాక్ కు చెందిన గిలానీ వ్యాఖ్యానించారు.  డేవిడ్ హెడ్లీ కుటుంబంతో తనకు ఎలాంటి సంబంధాలు లేవన్నారు. అయితే ఒక వ్యక్తి కుటుంబంతో బంధుత్వం ఉండడం పాపం చేసినట్టు కాదు కదా అని  ఓ జాతీయ మీడియాకు ఇచ్చిన ఇంటర్వ్యూలో చెప్పారు.